Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుజరాత్‌లోని మోర్బీ నగరంలో మచ్చు నదిపై నిర్మితమైన పురాతన కేబుల్ వంతెన ఆదివారం సాయంత్రం ఉన్నపళాన కూలిపోయింది. ఈ దుర్ఘటనలో మరణాలు 141కి చేరాయి. పలువురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో వంతెనపై 400-500 మంది ఉన్నట్లు చెబుతున్నారు. వారిలో చాలా మంది నదిలో పడి గల్లంతయ్యారు. ఝాల్తాపుల్గా పిలిచే తీగల వంతెనను ఎప్పుడో బ్రిటిష్ పాలనలో నిర్మించారు. ఆ ప్రాంతంలో ఈ బ్రిడ్జి ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశం. మరమ్మతుల నిమిత్తం ఏడు మాసాల క్రితం వంతెనను మూసేశారు. గుజరాతీ నూతన సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకొని మొన్న 26న తిరిగి ప్రారంభించి సందర్శకులను అనుమతించగా, ఐదు రోజుల్లోనే బ్రిడ్జి కూలడం, వందల మంది అమాయకులను బలితీసుకోవడం ఈ సంవత్సరంలో అతి పెద్ద విపత్తు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షా సొంత ఇలాకా గుజరాత్. ఆ రాష్ట్రంలో బీజేపీయే అధికారంలో ఉంది. అయినప్పటికీ అక్కడ సంభవించిన దిగ్భ్రాంతికర దుర్ఘటనకు అసలు కారణాలేమిటో ఇప్పటికైతే బహిర్గతం కాలేదు. పరిమితికి మించి సందర్శకులున్నారని మాత్రమే చెబుతున్నారు. మృతుల కుటుంబాలను, గాయపడ్డ బాధితులను సంతృప్తికర స్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకున్నది లేదు. బీజేపీ వాలకం చూస్తుంటే అతి చిన్న ప్రమాదంగా మలచి కొద్దోగొప్పో ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, సంతాపం, సానుభూతి వ్యక్తం చేసి, దేశం దృష్టి అటువైపు అంతగా పడకుండా జాగ్రత్త పడుతున్నదనిపిస్తోంది.
ఝాల్తా పుల్ వంతెన మరమ్మతులు, నిర్వహణకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రాబోయే పదిహేనేండ్లకు కాంట్రాక్టు పొందిన ఒరేవా గ్రూపు ఇప్పటి వరకు ప్రమాదంపై స్పందించకపోవడంతో అందరి వేళ్లూ ఆ కంపెనీవైపే చూపిస్తున్నాయి. ఒరేవా గ్రూపు అనేది ఒక ప్రయివేటు ట్రస్టు. యాభై ఏండ్ల క్రితం స్థాపించిన సదరు సంస్థ తొలి రోజుల్లో అజంతా బ్రాండ్‌పై గోడ గడియారాలు తయారు చేసేది. అనంతరం గృహ, ఎలక్ట్రికల్ వస్తువులతోపాటు విద్యుత్ దీపాలు, కాలిక్యులేటర్లు, ఈ-బైక్‌లు ఉత్పత్తి చేస్తోంది. ఈ కంపెనీకి ఎలాంటి నిర్మాణ అనుభవం లేదు. అటువంటి కంపెనీకి వందేళ్లనాటి పురాతన కేబుల్ బ్రిడ్జి మరమ్మతు, నిర్వహణ బాధ్యతలను గుజరాత్ ప్రభుత్వం అప్పగించడమేంటి? అంతేనా, ఆ కంపెనీకి సందర్శకుల నుంచి టికెట్ ఫీజులు వసూలు చేసుకునే, ఏటా టికెట్ ఫీజులు పెంచుకునే బంపర్ ఆఫర్లూ ఇచ్చింది. పైపెచ్చు ఏడు మాసాలు మూతేసిన బ్రిడ్జిని త్వరలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆదరాబాదరగా ప్రారంభించిందనడానికి గట్టి రుజువులే ఉన్నాయి. బ్రిడ్జికి కనీసం ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదంటే ఎంతగా ప్రజల ప్రాణాలకు విలువ ఇస్తున్నారో అర్థమవుతోంది.
ఝాల్తా పుల్ వంతెన వైఫల్యానికి మితిమీరిన అవినీతి, అక్రమాలే కారణమని చెప్పడానికి పెద్దగా పరిశోధన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్టు సంస్థకు మధ్య ఉన్న అవినాభావ సంబంధమే వంతెనను ఉన్నపళాన కూల్చేసింది. తీగల వంతెన నిర్మాణం, నిర్వహణకు ప్రపంచంలో చాలా అనుభవాలున్నాయి. 1940లో వాషింగ్టన్‌లోని టకోమా నారోస్ బ్రిడ్జి పతనమైనప్పుడు కొన్ని సాంకేతిక విషయాలు వెలుగు చూశాయి. గాలి వేగాన్ని తట్టుకునే శక్తి వంతెనకు ఉండాలి. గాలి వేగం పెరిగేకొద్దీ వంతెన ఊగుతూ ఉంటుంది. దీన్ని ఏరోలాస్టిక్ ఫ్లట్టర్గా పేర్కొంటారు. ఈ పరిస్థితులను ఎదుర్కొని వంతెనను యథాస్థానంలో నిలిపే సాంకేతిక, నిర్మాణ ఏర్పాట్లు ఉండాలి. ఇవి ఝాల్తా పుల్లో సమర్థవంతంగా పని చేశాయో లేదో తేలాలి. అసలా పరిస్థితులను బ్రిడ్జి ఎదుర్కొంటుందో లేదో నివేదికలు లేవు. అసంపూర్ణ పునర్నిర్మాణం, ఉద్దేశపూర్వక నిబంధనల ఉల్లంఘన, నిర్మాణాత్మక వైఫల్యం వీటన్నింటిపై సమగ్ర, నిష్పక్షపాత దర్యాప్తు జరిగితేనే విషాదానికి కారణమైన వాస్తవాలు బయటికొస్తాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండానూ ఉంటాయి. సమగ్ర దర్యాప్తునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఎవరో నలుగురు యువకులు వంతెనను ఊపడం వలన ప్రమాదం జరిగిందనడం తప్పుదారి పట్టించే ఎత్తు మాత్రమే. మృతుల కుటుంబాలను, గాయపడ్డ వారిని సముచిత స్థాయిలో ఆదుకోవడం ప్రభుత్వాల కనీస బాధ్యత.