Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వివా లూలా వివా లూలా! ఆదివారం రాత్రి అధ్యక్ష పదవికి జరిగిన తుదిపోరులో వామపక్ష నేత ''లూలా'' విజయం సాధించిన వార్త వెలువడగానే బ్రెజిల్ అంతటా ప్రతిధ్వనించిన నినాదాలివి. తమ ప్రియతమ నేత విజయంతో జిందాబాద్‌లు పలుకుతూ వీధుల్లో కార్మికులు గంతులు వేశారు. ఆనందంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు, ఆనందబాష్పాలు రాల్చారు. అక్టోబరు రెండవ తేదీన జరిగిన తొలివిడత ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాకపోవటంతో కార్మికులు అప్రమత్తమయ్యారు. ప్రజల వాంఛను కాదని అధికారాన్ని ఎగరేసుకుపోజూసిన తోడేళ్లకు అవకాశం ఇవ్వరాదని ''బ్రెజిల్ విశ్వాసం'' పేరుతో వర్కర్స్ పార్టీ, బ్రెజిల్ కమ్యూనిస్టు పార్టీ, గ్రీన్ పార్టీలతో కూడిన కూటమి, దానికి మద్దతు ఇచ్చిన ఇతరులు లక్షలాది మంది అక్టోబరు మూడవ తేదీ నుంచి అహౌరాత్రాలు శ్రమించారు, మితవాద శక్తులు జనాన్ని తప్పుదారి పట్టించకుండా చూశారు, అక్రమాలను అడ్డుకొనేందుకు వీధుల్లోకి వచ్చారు. ఈ కారణంగానే బోల్సనారో మూకలు అదుపులో ఉండాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో లూలా మద్దతుదార్లను అడ్డుకున్న ప్పటికీ మొత్తం మీద ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లే చెప్పవచ్చు.
ఒక కార్మికుడి ఇంట పుట్టిన 77 సంవత్సరాల లూలా స్వయంగా ఒక లోహపరిశ్రమలో పనిచేశారు. తోటి కార్మికులను సమీకరించారు. వామపక్ష వాదిగా, మిలిటరీ నిరంకుశపాలనను వ్యతిరేకించిన యోధుడిగా, వర్కర్స్ పార్టీ స్థాపకుల్లో లూలా ప్రముఖుడు. ఒక్క వెనెజులాకే కాదు, యావత్ లాటిన్ అమెరికాకు వామపక్ష వేగు చుక్కగా ఉన్న హ్యూగో ఛావెజ్ తరువాత ఎక్కువ కాలం అధికారంలో ఉండనున్న నేతగా లూలా చరిత్రకు ఎక్కనున్నారు. గత పాతిక సంవత్సరాల పరిణామాలను మొత్తంగా చూసినపుడు వామపక్ష నేతలను ఎన్నుకున్న దేశాలలో ఒక ఎన్నికలో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ అధికారంలోకి వచ్చిన మితవాదుల తీరుతెన్నులను బేరీజు వేసుకుంటున్న జనం తిరిగి వామపక్షాలకు పట్టం గట్టటం ఒక సాధారణ అంశంగా మారినట్లు చెప్పవచ్చు. బ్రెజిల్లో జరిగింది కూడా అదే. వర్కర్స్‌పార్టీ నాయకురాలు దిల్మా రౌసెఫ్ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత అమెరికా మద్దతుతో మితవాదశక్తులు కుట్రచేసి తప్పుడు ఆరోపణలతో లూలాపై కేసుపెట్టి జైలుకు పంపటం, దిల్మా ప్రభుత్వాన్ని అభిశంసన అస్త్రంతో కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2018 ఎన్నికల్లో ఓడినా తిరిగి వర్కర్స్ పార్టీకి జనం పట్టం గట్టారు.
లాటిన్ అమెరికా దేశాల్లో అధ్యక్ష తరహా విధానాలు ఉన్న కారణంగా జనం ఆ పదవులకు వామపక్ష నేతలను ఎన్నుకుంటున్నప్పటికీ పార్లమెంటుల విషయానికి వస్తే ఆ తీర్పు ప్రతిబింబించటం లేదు. అందువలన పార్లమెంటు ఆమోదం అవసరమైన అనేక చర్యలను వామపక్ష ప్రభుత్వాలు తీసుకోలేకపో తున్నాయి. ఇది ఒక సాధారణ బలహీనతగానే చెప్పాలి. ఇప్పుడు బ్రెజిల్లో జరిగింది కూడా అదే. పార్లమెంటు ఉభయ సభల్లో వామపక్షాలను వ్యతిరేకించే పార్టీలకు చెందిన వారు 60శాతం వరకు తాజాగా ఎన్నికయ్యారు. లాటిన్ అమెరికా వామపక్ష ప్రభుత్వాల తీరుతెన్నులను చూసినపుడు అవి పెట్టుబడిదారీ, కార్పొరేట్లకు అనుకూలమైన రాజ్యాంగ వ్యవస్థలు, నయా ఉదారవాద విధానాల కట్టడాల మీద ఉన్న పరిధుల్లోనే పని చేయాల్సి వస్తున్నది. చైనా, క్యూబా, వియత్నామ్ వంటి సోషలిస్టు దేశాల్లో మాదిరి కార్మికవర్గానికి పూర్తిసాధికారతనిచ్చే అవకాశాలు లేవు. అందువలన ఎన్నో ఆశలు పెట్టుకున్న జనంలో కొన్ని సందర్భాల్లో అసంతృప్తి పెరగటానికి కారణమిదే. కార్మికవర్గానికి పూర్తి సాధికారత నిచ్చేందుకు అనువైన చైతన్యాన్ని కలిగించేందుకు లాటిన్ అమెరికా లేదా మరొక చోట ఎక్కడైనా చేయాల్సింది ఎంతో ఉంది. పార్లమెంటరీ వ్యవస్థల ద్వారా వచ్చే అధికారంతో కొన్ని సంస్కరణలు, సంక్షేమ చర్యలు చేపట్ట వచ్చని లాటిన్ అమెరికాలో వామపక్షాలు ఇప్పటివరకు రుజువు చేశాయి. ఇవి ఉపశమనం తప్ప సమూల మార్పులు కాదు. జన జీవితాలను పూర్తిగా మెరుగుపరిచేవీ కాదు. అందు కోసం ఉద్యమాలను మరోమెట్టు ముందుకు తీసుకుపోవాల్సి ఉంది.
లూలా ఎన్నిక అంతర్జాతీయంగా ప్రకంపనలను సృష్టిం చిందనే చెప్పాలి. తెగేదాకా లాగటం మంచిది కాదని అమెరికా నేతలకు కొంత మేర అర్థమైనట్లుంది. ఎన్నికల ఫలితాన్ని అంగీకరించని డోనాల్డ్ ట్రంప్ బాటలోనే తాను ఓడితే ఓటమిని అంగీకరించేది లేదన్న బోల్సనారోను ఖండించేందుకు అపర అమెరికా, ఐరోపా ప్రజాస్వామిక పెద్దలకు నోరు రాలేదు. కానీ, తాము గద్దెనెక్కించదలచిన గువైడో వంటి తొత్తులకు, మిలిటరీ నియంతలను పొగిడి, ప్రజాస్వామిక వ్యవస్థల విధ్వంసానికి పూనుకున్న బోల్సనారోకు స్థానం లేదని జనం ఇచ్చిన తీర్పును అంగీకరించి బైడెన్ వెంటనే అభినందనలు చెప్పక తప్పలేదు. ఇది బ్రెజిల్ వామపక్షాలు సాధించిన మరో విజయంగానే చెప్పాలి. బ్రెజిల్ పరిణామం ప్రపంచంలోని వామపక్ష శ్రేణులు, అభిమానులకు ఉత్సాహం కలిగిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. జయహౌ బ్రెజిల్ వామపక్ష లూలా!