Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రంలోని అధికార బీజేపీ తెచ్చి పెట్టిన మునుగోడు ఉప ఎన్నిక ప్రహసనం చివరి అంకానికి చేరింది. అక్కడి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామాతో ఆగస్టు నుంచే అనధికారిక ప్రచారం ఆరంభమైంది. గతనెల ఏడున ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అది మరింత జోరందుకుంది. ఈ క్రమంలో వారం రోజుల నుంచి ప్రధాన పార్టీల దూషణ భాషణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో ఆ ప్రచారం మరింత రంజుగా మారింది. చివరకు కమలనాథుల అత్యుత్సాహంతో మంగళవారం మునుగోడు రణగోడుగా మారింది. అటు ఎమ్మెల్యేల కొనుగోళ్లు, ఇటు రాళ్లు రువ్వే అల్లరిమూకల ఆకతాయి పనుల వల్ల వారు లబ్దిపొందాలని చూసినా... ఆ నాటకం అంతగా రక్తి కట్టలేదు.
ఇలాంటి పరిణామాల మధ్య గురువారం మునుగోడు మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతున్నది. కమ్యూనిస్టుల కంచుకోట... ఎర్రజెండా అడ్డా అయిన అక్కడ ఓటరన్న ప్రదర్శించబోయే చైతన్యం, విజ్ఞత మీదనే ప్రత్యక్షంగా రాష్ట్ర భవిష్యత్తు, పరోక్షంగా దేశ భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే ప్రచారపర్వం ముగిసిన నేపథ్యంలో ఇక గెలుపోటములు ఓటరు మహాశయుడి చేతిలోనే నిబిడీకృతమై ఉన్నాయి కాబట్టి. గురువారం ఓటర్లు తమ ఓటు హక్కుతో అభ్యర్థిని నిర్దారించుకోనుండగా... ఈనెల ఆరున గెలుపెవరిదో తేలిపోనుంది. ఈ కీలక తరుణంలో ఓటర్లు ఒక్కసారి గత చరిత్రను తిరగేయాలి. మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి వారసులుగా ఇప్పుడు తాము పోషించబోయే పాత్ర ఎంత కీలకమైందో గుర్తెరగాలి. మునుగోడులో అసలు ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది..? దాని వల్ల నియోజకవర్గానికి ఒరిగిందేమిటి..? ఒరగబోయేదేమిటి..? అనే ప్రశ్నలను వేసుకోవాలి. పార్టీలు, వాటి నాయకులు వస్తుంటారు... పోతుంటారు... కానీ మన ప్రాంత అభివృద్ధికి, మన నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం మనం ఎలాంటి కర్తవ్యాన్ని పోషించాలనే విషయమై వారు తమంతట తాము ఆలోచించుకోవాలి. అలాగాక పార్టీలు, వాటి నాయకులు, అభ్యర్థులు ఇచ్చే తాయిలాలకు లొంగి మన భవిష్యత్తును మనమే నాశనం చేసుకుంటున్నామా...? అనేది కూడా పరిశీలించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. మతోన్మాదం కరాళనృత్యం చేస్తూ విచ్ఛిన్నకర శక్తులు జడలు విప్పుతున్న వేళ... జాగరూకతతో ఓటేయాలి. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ... రాజ్యాంగానికి చెల్లు చీటి రాస్తూ... సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తూ... సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తూ... ఆర్థిక రంగంలో దేశ స్వావలంబనను తాకట్టు పెడుతున్న వారికి చెల్లు చీటి రాయాలి. ఆ చైతన్యమే ఇప్పుడు మునుగోడు ఓటర్లలో వెల్లివిరియాలి.
కాంట్రాక్టుల కోసమే ఉప ఎన్నికను తీసుకొచ్చిందెవరో, ఈ అనవసర ఎన్నికతో మునుగోడు ఓ ప్రయోగశాలగా మార్చిందెవరో గుర్తించాలి. కీలెరిగి వాతపెట్టాలి. ఎవరు నిజాయితీగా మునుగోడు కోసం శ్రమిస్తారు.. ఆ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతారనే అంశాన్ని ఓటర్లు పసిగట్టాలి. కోట్ల రూపాయలు గుమ్మరించిన వాడు తప్పనిసరిగా వ్యాపారే. గెలిచిన తర్వాత మళ్లీ పెట్టిన ఖర్చును వడ్డీతో సహా లాగేసుకుంటాడు. ఈ నేపథ్యంలో అధికారం, ధనబలంతో ఓట్లు కొల్లగొట్టాలని చూసిన వారి చెంప పగులగోట్టే సమయం ఆసన్నమైంది. అందుకోసం ఓటనే ఆయుధం ఇప్పుడు చేతిలో ఉంది. ఓటంటే అమ్ముడు పోవటం కాదు.. ఓటంటే అభివృద్ధిని కాంక్షించటం అనే జ్ఞానాన్ని కలిగి ఉండటమనేది ఓటరు సహజ లక్షణం కావాలి. పార్టీ ఫిరాయింపులు, కోట్లాది రూపాయలను కుమ్మరించటాన్ని కాకుండా... నిజాయితీగా, సంస్థాగతంగా తనకోసం, తన నియోజకవర్గం కోసం పాటుపడే అభ్యర్ధిని గెలిపించుకోవటం తక్షణ కర్తవ్యం కావాలి. ఇప్పుడు ఆ కర్తవ్యానికి అవసరమైన అస్త్రం ఓటరు చేతిలో ఉంది. ధన బలం, అధికార బలంతో గెలవాలనుకున్నోడిని ఇలాంటి అస్త్రశస్త్రాలతో దెబ్బకొట్టాలి. దోచుకున్న సొమ్మునంతా కక్కించాలి. దేశం కోసం, ధర్మం కోసమంటూ దొంగజపం చేసే వారి అధర్మనీతిని టిట్ ఫర్ టాట్ లా... పది మీటర్ల లోతులో పాతి పెట్టాలి. నైజాం నవాబును, రజాకార్లను సైతం తరమికొట్టిన కమ్యునిస్టుల కంచుకోట నల్లగొండ జిల్లాలో నిజమైన, నమ్మకమైన వ్యక్తిని గెలిపించుకోవాలి. ఆ బాధ్యత ఇప్పుడు మునుగోడు ప్రజలపైన్నే ఉంది. అందుకే ఓటరన్న మేలుకో... ఓటంటే బిర్యానీ పొట్లమో... సారా సీసానో... ఐదొందల నోటో కాదని నిరూపించు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ధనమదంతో కొనుగోలు చేయాలని చూసిన వారికి కర్రు కాల్చి వాతపెట్టు. అన్నీ తెలిసిన నీ విచక్షణే రేపటి తెలంగాణకు, భవిష్యత్ భారతానికి అండ... దండా. అదే దేశానికి రక్ష... రక్షణ. ఆ రక్షణ కవచమే భావి భారత పౌరులకు దశ, దిశ. అదే మనకు మార్గదర్శనం.