Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అవినీతిని సహించరాదు. అవినీతిపరులకు రాజకీయ, సామాజిక మద్ధతు లభించడానికి వీలులేదు. జైలుకు వెళ్లిన వారినీ కీర్తిస్తున్నారు వారిని ఊరేగిస్తున్నారు. ఇది తగదు' అని ప్రధాని మోడీ విజిలెన్స్ జాగరూకత వారోత్సవాల్లో పాల్గొని ప్రసంగిచారు. ఇవి వినగానే 'ఎదుటి మనిషికి చెప్పేటందుకె నీతులు వున్నాయి' అన్న ఘంటసాల పాట వెంటనే గుర్తుకు వచ్చింది. అవును చెప్పటానికి శ్రీరంగ నీతులు ఎన్నయినా వుంటాయి. చేసేది మాత్రం అందుకు పూర్తి విరద్ధంగా వుంటుంది. మొన్న బిల్కీస్ బానో కేసులో శిక్షపడ్డ నిందితులను విడుదల చేసి వారు బయటికి రాగానే దండలేసి స్వాగతం పలికిన వారు మోడీగారి అనుచరులు కావటం మనకేమీ ఆశ్చర్యాన్నికొల్పదు. ఎందుకంటే చెప్పేదానికి, చేసేదానికి ఏమీ సంబధం లేకపోవటం మనమేరి గినవిషయమే. జైళ్లలో వుండాల్సిన వాళ్లందరూ బయటికి వచ్చి కాలరెగరేస్తు న్నారు. జైలుకు పోవాల్సిన వాళ్లూ బేఫికర్‌గా బలాదూర్ తిరుగుతున్నరు. ఇక ఇప్పుడు న్యాయం, నీతి, నిజాయితీ అంతా నిర్భంధానికి గురయి మగ్గుతున్నది! పని చేస్తున్న మెదళ్లు వారిని భయపెడుతూనే వుంటాయి.
ఇకపోతే చిల్లర బేరాలకు చెల్లుచీటీ రాసి, టోకున కొనుక్కునే బేరాలకు తెరలేపి ప్రజాస్వామ్య నాటక ప్రదర్శనకు కొత్త మేకప్పులు అద్దుతున్నరు. ఓట్లు కొనుక్కోవడం పాత మాట. ప్రజలకు ఏం చేస్తామో చెప్పటం బూజు పట్టిన విధానం. అధికారం చేజిక్కాలంటే ఇప్పుడు ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనేస్తే సరిపోతుంది. ఇన్‌స్టంట్‌గా అధికారం దక్కుతుంది. ప్రజల బాధలు, గాధలు, దుఃఖాలు, ఏడ్పులు, నిరుద్యోగం, నిట్టూర్పులు, కళ్లనీళ్లు తుడవటం, ఇంటిల్లి పాదినీ కలవటం, ఓటు కోసం బ్రతిమిలాడటం దేబురించడం, అడుక్కోవటం అంతా, ఓ దండుగ మారిపని. ఔడ్డేటెడ్. ఇపుడంతా ఆన్లైన్ బుకింగ్‌లే. ఆ తతంగమంతా అవన్నీ అయిపోయి ఎన్నికల్లో గెలుపొందాక- లక్షమంది ప్రజలకు బదులుగా ఒక్క ఎమ్మల్యేను కొనుక్కోవడం తేలికయిన పని కదా! ఇదే నేటి అధికార ప్రణాళిక. అధికారమే ఇంత అవినీతి మయమై పోతుంటే... కాదు కాదు. అవినీతి మయం చేస్తూ అవినీతిని సహించరాదు అన్న మాటలకు విలువెంత? మొన్న ఆపరేషన్ లోటస్ మొయినాబాద్ సంఘటన చాలా మందికి సామాన్య ప్రజలకు వింతగా ఆశ్యర్యాన్ని కలిగించ వచ్చు. కానీ నేటి రాజకీయ పరిణామాలను ఆచరణలో ప్రజాస్వామిక ప్రహసనాలను జాగ్రత్తగా గమనిస్తున్న వారికి వీరి మాయోపాయాల మహేంద్రజాలాలకు పరాకాష్టగానే తోస్తుంది. వంద కోట్లకు ఒక్క ఎమ్మెల్యే చొప్పున బేరం కుదుర్చుకునే డీల్, రీల్లు రీళ్లుగా మనముందు దర్శనమిస్తోంది.
ఒక్కసారి వెనక్కి వెళ్లి పరిశీలించండి ఎందరిని లాక్కొన్నారో... ఎన్ని ప్రభుత్వాలనిలా నిస్సిగ్గుగా ఏర్పాటు చేశారో తెలుస్తుంది. మన పక్కనే వున్న మహారాష్ట్రలో శివసేనలో చీలిక తెచ్చి నలభై మంది ఎమ్మెల్యేలను కొనేసి, షిండే ముఠాతో అందలం ఎక్కడానికి దాదాపు 4600 కోట్లు ఖర్చు చేయటం బహిరంగ కథేకదా! మధ్య ప్రదేశ్‌లోనూ ఇపుడు అధికారంలో వున్న వాళ్లు గెలవనే లేదు. కానీ 2600 కోట్లు ఖర్చు చేసారంతే! అధికారం వచ్చి కూర్చుంది. కర్నాటకలో మరీ పచ్చిగా కొనుగోళ్లు చేశారు. అరుణాచల్‌లో 1600 కోట్లతో, గోవాలో 1100 కోట్లతో, సిక్కింలో 480 కోట్లతో, మణిపూర్‌లో 360 కోట్లతో అధికారం బేరమాడేసిన వివరాలు అవినీతి కిందకు వస్తాయోరావో....! వీటిని ఏమని పిలవాలో కొత్త పదబంధాలను సృష్టించుకోవాలేమో మరి! వేలకోట్ల రూపాయల అధికార మార్పిడి అవినీతి కథలో కథానాయకులు హరికథలు వినిపించడం, నీతి సూత్రాలు వల్లించడం నిజంగానే నివ్వెరపోయేట్టు చేస్తోంది.
ఈ వ్యవహారాల్లో మధ్యవర్తులుగా తమ వాక్చాతుర్యాన్ని చాటుకుంటూ, సదరు కొనుగోళ్ళ బేరాలను కుదర్చటానికి బాబాలు, మఠాధిపతులు, యోగులు, పీఠాధిపతులు పూనుకోవడం మాత్రం పంచరంగుల చిత్రంలా కనిపిస్తున్నది. యోగులకు పదవీ బేరాలోచనలలో పనేమిటో తెలియాలంటే డేరా బాబాల నడగాలేమో! ఏమో ఇంకెన్ని రకాలుగా ప్రజాస్వామ్యాన్ని చెరిచే పనిని తలపెడతారో! వేచి చూడాల్సిందే. ఇంత జరుగుతున్నా కంటితో చూడక, నోటితో మాటాడక ఎంతో మనో నిబ్బరాన్నీ ప్రదర్శిస్తున్న అధినాయికమన్యుల అంతరంగాన్నీ తెలుసుకోవడం అంత కష్టమవుతుందా!.
చాలా పాత మొరటు సామెత ఒకటున్నది. దొంగే దొంగ దొంగ అని అరిచాడనేది. ఇప్పటి పరిస్థితులకు అట్టే సరిపోతుంది. మనం ఎదుగుతున్నామనే దానికి గుర్తుగా పోటి చేయకుండానే, ఎలక్షన్లలో గెలవకుండానే అధికారంలోకి రాగలగటం అనే ఆధునిక రాజకీయ విన్యాసాన్ని చూపెడతారో! మనం చూస్తున్నంతకాలం అలానే చేస్తారు. ఒక్కసారి వేలెత్తి నిలదీస్తేనే వెనక్కి తిరుగుతారు. వొట్టి మాటలు కాదు, చేతల, నిజాయితీ అధినేతలు కావాలి. నీతుల బోధలు కాదు అవినీతిని పారద్రోలాలి.