Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆదివారం మునుగోడు ఫలితం వెలువడగానే సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ అయిన అంశం... 'ఉప ఎన్నికలో గెలిచింది టీఆర్ఎస్.. ఓడింది బీజేపీ.. కానీ ఆ పార్టీని ఓడించింది మాత్రం ముమ్మాటికి కమ్యూనిస్టులే...' ఇది నూటికి నూరు పాళ్లు పచ్చి నిజం. ఇక చిన్న పేపర్ల నుంచి ప్రధాన పత్రికల వరకూ తమ తమ పతాక శీర్షికల్లో... 'కారుకు కమ్యూనిస్టుల ఇంధనం.. కారును గట్టెక్కించిన కమ్యూనిస్టులు.. ఎర్ర గులాబీ.. కారు గెలుపులో కామ్రేడ్ల కీలక పాత్ర...' అనే వార్తలను పరి చేశాయి. ఈ క్రమంలో మును గోడులో గెలవటం ద్వారా తెలంగాణలో, అందునా దక్షిణ తెలంగాణలో, అందునా వామపక్షాల కంచుకోటలైన నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కాలుపెట్టేందుకు ఆశపడి, అర్రులుచాచిన 'కమలాన్ని...' ప్రజలు అడ్డుకున్నారు. తద్వారా 'నిలిచి ఉన్న నీటిలో కమలాలే కాదు.. క్రిములూ ఉంటాయి...' అంటూ పెద్దలు చెప్పిన హితోక్తిని తీవ్ర హెచ్చరికలాగా భావించి కమలంతోపాటు మతోన్మాద, మనువాద క్రిములనూ శుభ్రంగా తుడిచి పారేశారు.. ఇందులో కామ్రేడ్ల పాత్ర సుస్పష్టం.
మొత్తం ఉప ఎన్నిక ప్రహసనాన్ని, ఫలితాన్నీ, ఓట్లతో కూడిన గణాంకాలను పరిశీలిస్తే... మొదటి నుంచి బీజేపీపై ఎదురుదాడి చేయటంలోనూ, కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్రెడ్డి రాజీనామా చేశారంటూ చెప్పటంలోనూ, ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారాన్ని తనకనుకూలంగా మార్చుకోవటంలో కేసీఆర్ వ్యూహం పక్కాగా ఫలించింది. ఆ ఫలితమే ఉప ఎన్నికలో ప్రతిఫలించిందని చెప్పక తప్పదు. కాకపోతే 14 ఏండ్ల సుదీర్ఘ ఉద్యమం, ఎనిమిదేండ్ల అద్భుత పాలన, మునుగోడు నియోజకవర్గంలో సైతం 99 శాతం మందికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందా యని ప్రభుత్వాధినేతలు చెప్పు కుంటున్న క్రమంలో గులాబీ పార్టీ అభ్యర్థి కేవలం 42.3 శాతం ఓట్లనే సాధించటం గమనార్హం. మరోవైపు ఒక ఉప ఎన్నిక కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా మొత్తం మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరూ ప్రచారం చేసిన పరిస్థితి. ఆ మాటకొస్తే అమిషా సహా బీజేపీ కేంద్ర నాయకత్వమంతా ఈ ఎన్నికపైనే కేంద్రీకరించిదను కోండి. అయినప్పటికీ మునుగోడు అనుభవం నుంచి గులాబీ పార్టీ కొన్ని పాఠాలను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం సంక్షేమ, కార్యక్రమాలే గట్టెక్కించలేవన్న వాస్తవాన్ని మనం ఇక్కడ గుర్తెరగాలి. ముఖ్యమంత్రి స్థాయి నుంచి కిందిస్థాయి ఎమ్మెల్యేల వరకూ నిత్యం ప్రజలతో సంబంధాలు నెరపటం, వారి సమస్యలను ఓపిగ్గా వినటం, వాటి పరిష్కారం కోసం కృషి చేయటమనేది నిత్యకృత్యం కావాలి. దీంతోపాటు వ్యక్తిగతంగా లబ్ది చేకూర్చే పథకాలతోపాటు వ్యవస్థీకృతంగా ప్రజలకు అత్యంత కీలకమైన విద్య, వైద్యం, ఉపాధి, రవాణా మౌలిక వసతుల కల్పన తదితరాంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. పోడు భూములు, నిర్వాసితులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రైతాంగం, ఆర్టీసీ, వీఆర్ఏలు, కనీస వేతనాల జీవో తదితర సమస్యలను తక్షణం పరిష్కరించాలి.
ఇక ఈ ఉప ఎన్నిక ఫలితం తర్వాత కమలనాథులకు ఒక విషయం మాత్రం సుస్పష్టంగా అర్థమై ఉంటుంది. అదేంటంటే... సాయుధ పోరాట గడ్డ మీద తమ పప్పులుడకబోవని. కమ్యూనిస్టు పార్టీల నుంచి మహామహులు ప్రాతినిధ్యం వహించిన నేల మీద తమ పాచికలు పారబోవని. అందుకే బీజేపీ సీనియర్ లీడర్ ఈటల రాజేందర్ లాంటి వారు సైతం... 'మునుగోడులో టీఆర్ఎస్ విజయమనేది కమ్యూనిస్టులు పెట్టిన భిక్ష...' అని వ్యాఖ్యానించాల్సి వచ్చింది. ఢిల్లీ పెద్దల ప్రోద్బలంతో ఏరికోరి తెచ్చుకున్న ఉప ఎన్నికలో జనం ఇచ్చిన తీర్పుకు బీజేపీ బొక్కా బోర్లా పడింది. ఇదే సమయంలో దేశాన్ని ఏకం చేయడానికంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ... భారత్ జోడో యాత్ర చేపడితే, మునుగోడులో మాత్రం ఆ పార్టీ నేతలు ఏకం కాలేక, ఐక్యంగా పోరాడలేక చేతులెత్తేశారు. దీంతో అక్కడి అభ్యర్థి బోరుబోరున విలపిస్తూ కౌంటింగ్ సెంటర్ నుంచి నిష్క్రమించిన దుస్థితి. దీంతో బీజేపీని ఓడించగల సత్తా ఉన్న పార్టీకే మేం మద్దతిస్తామంటూ కమ్యూనిస్టు పార్టీలు చెప్పిన మాటకి కాంగ్రెస్ దీనాతిదీన స్థితి మరింత బలాన్ని చేకూర్చింది. చివరికి 'తోక పార్టీలు, సూదులు, దబ్బణాలు...' అంటూ ఒకప్పుడు ఎర్రజెండాలను ఎగతాళి చేసిన వారికి సైతం ఈ ఫలితం కనువిప్పు కలిగించింది. అందువల్ల 'తోకలే మునుగోడులో గులాబీ పతంగిని ఎగరేశాయి. అవే లేకపోతే ఆ పతంగే ఎగిరేది కాదు...' అంటూ రాజకీయ విశ్లేషకులు ముక్తాయింపునివ్వటం ఇక్కడ గమనార్హం.