Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నోట్ల రద్దు' అనే చీకటి రోజుకు ఆరేండ్లు గడిచినా అది చేసిన గాయం ఇంకా సలుపుతూనే ఉంది. కాలం అన్ని రకాల గాయాలను మాన్పుతుందంటారు. కానీ మన ప్రధానమంత్రి చేసిన గాయం మాత్రం రాచపుండై కాలం గడిచేకొద్దీ రెచ్చుతోంది. ఈ గాయాన్ని కేవలం 50రోజులు భరిస్తే చాలు... ఆపైన అదే సర్వరోగనివారిణి అని చెప్పారు. ఈ గాయాన్ని భరించడం దేశ భక్తులైన ప్రజలందరి తక్షణ కర్తవ్యంగా హితభోద చేశారు. ప్రజలు సైతం తమ దేశభక్తి నిరూపించుకోవడానికి ఆ గాయాన్ని పంటి బిగువున భరించారు. నిద్రాహారాలుమాని బ్యాంకుల ముందు పడిగాపులు కాశారు. ఆ క్రమంలో ముసలీముతక క్యూలో గంటల కొద్దీ నిల్చోలేక స్పృహతప్పి పడిపోయారు. మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. వైద్యానికి డబ్బుల్లేక ఎన్ని ప్రాణాలు గాలిలో కలిశాయో? ఎన్ని పెళ్లిలు నిలిచిపోయాయో? అయినా ప్రధాని చెప్పిన మాటను తూ.చా తప్పకుండా ప్రజలు పాటించారు. లెక్కకు మించిన కష్టాలననుభవించారు. విశేషమిటంటే ఇప్పటికి అనుభవిస్తూనే ఉన్నారు..!
ఈ గాయానికి బలవుతున్న సామాన్యుల పట్ల కనీస సానుభూతి చూపే తీరికలేని పాలకులు ఇప్పటికీ ఇది సాహసోపేతమైన, సముచితమైన నిర్ణయమేనని బుకాయించడం విస్తుగొలుపుతోంది. ఈ నిర్ణయం వల్ల లక్షల కోట్ల నల్లధనం బయటికొస్తుందీ, అవినీతి అంతమవుతుందీ, ఉగ్రవాదానికి అడ్డుకట్ట పడుతుందీ, నకిలీ కరెన్సీ నశించిపోతుందీ అన్న ప్రధాని పలుకులన్నీ బూటకమని ఎప్పుడో తేటతెల్ల మైపోయింది. ఆయినా, వారి బుకాయింపులు మాత్రం ఆగలేదు. ఇప్పుడు ఆచరణలో కనిపిస్తున్నదేమిటి? మోడీ ఒక్క నిర్ణయంతో అసంఖ్యాకులైన ప్రజల బతుకులు అతలాకుతలం అయిపోయాయి. ఒంటి చేత్తో ఆయన దేశ ఆర్థిక వ్యవస్థను సర్వ నాశనం చేశారు. అప్పుడు పతనమైన ఆర్థిక వ్యవస్థ ఇంకా గాడినపడలేదు. రెక్కలు ముక్కలు చేసుకుని న్యాయబద్ధంగా సంపాదించుకునే సామాన్యులను చావుదెబ్బతీసి, నల్లకుబేరుల అక్రమ సంపాదన చట్టబద్ధం చేశారు. ఇదే కదా జరిగింది. ప్రధాని నిర్ణయం వెనుక అసలు ఉద్దేశం కూడా ఇదే..! ఆ మేరకు ఆయన నూటికి నూరుపాళ్లు విజయం సాధించారు. ప్రధాని ఉద్దేశ్యం అది కాకుంటే ప్రజలకు వారు వాగ్దానం చేసిన లక్ష్యాలను ఎంత మేరకు సాధించారో ఇప్పటికైనా చెప్పాలి.
అక్రమంగా దాచుకున్న నల్ల డబ్బును ఆర్థిక వ్యవస్థలోకి తెచ్చేందుకే నోట్ల రద్దును చేపట్టామని మోడీ, వారి నాయకగణం పదేపదే నొక్కి వక్కాణించారు. మరి ఇప్పటికి ఎంత డబ్బు తెచ్చారు. బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగిరాని పాతనోట్ల మొత్తం కేవలం పదివేల కోట్లు మాత్రమే అని అప్పటి లెక్కలే చెబుతున్నాయి. కొత్తగా నోట్ల ముద్రణకు అదనంగా రూ.7965కోట్లు ఖర్చు చేయడమే తప్ప సాధించిందేమి లేదు కదా..! మొత్తానికి ఈ ప్రహసనం ద్వారా 'కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదన్న' సంగతి ఎప్పుడో తేలిపోయింది. ఉగ్రవాద అంతం అని కబుర్లు చేప్పిన ప్రభుత్వ పెద్దలకు పుల్వామా ఘటన ఎప్పుడు జరిగిందో వేరే గుర్తు చేయాల్సిన పని లేదు. నోట్లరద్దు తరువాత ఉగ్రవాదుల దాడులు గతానికి రెండింతలు పెరిగాయని అధికారిక లెక్కలే చెపుతున్నాయి.
పాతనోట్లు రద్దు చేస్తే నకిలీ మకిలి వదులుతుందని చెప్పారు. కాని అవినీతి ఆగిందెక్కడీ నల్లధనం కట్టడయిందెక్కడీ 2 వేలనోటు నల్లకుబేరుల పని మరింత సులువు చేసిందే తప్ప ఎక్కడా అడ్డుకోలేదు. చివరికి ప్రధాని చెప్పిన లక్ష్యాలేవీ నెరవేరకపోగా, ఈ నోట్ల రద్దు అనేక దుష్ప్రభావాలను చూపుతూ భారత ఆర్థిక వ్యవస్థకు పెను విపత్తుగా మారింది. మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలైన చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వ్యాపారాలన్నీ చిన్నాభిన్నమయ్యాయి. 'గోరు చుట్టుపై రోకటి పోటులా' దీనికి కరోనా తోడైంది. అసలే కుదేలైన అసంఘటితరంగాన్ని మరింత దిగజార్చింది. ఫలితంగా ఉపాధి ఉద్యోగావకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అంతిమంగా నోట్లరద్దు ప్రధాని చెప్పిన ఏ ఒక్క లక్ష్యాన్నీ సాధించకపోగా భారత ఆర్థిక వ్యవస్థనే అధోగతిపాలు చేసిందని ఈ వాస్తవాలన్నీ రుజువు చేస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని ముందే పసికట్టిన ఎందరో ఆర్థిక నిపుణులు హెచ్చరించినా లెక్కచేయని మోడీ అంతరంగమేమిటో ఈ ఆరేండ్ల అనుభవాలు అవగతం చేస్తున్నాయి. ఇప్పటికైనా తప్పుదిద్దుకోవాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకపోగా ఇంకా మోసం చేయాలనే చూస్తోంది. కొందరిని కొంతకాలమే మోసం చేయగలరేమో గానీ, అందరినీ అన్ని వేళలా మోసం చేయలేరనే సత్యాన్ని ఏలికలు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది. లేదంటే ప్రజలే పాఠాలు నేర్పుతారు. ప్రజలు మాత్రం ఈసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. తగిన పాఠం చెప్పేందుకు సమాయత్తం అవుతున్నారు.