Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంగళవారంనాడు జరిగిన అమెరికా పార్లమెంట్ మధ్యంతర ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం నాటికి కూడా పూర్తి కాలేదు. ఆధిక్యతల తీరు తెన్నులు మాత్రమే మన ముందున్నాయి. వివిధ మీడియా సంస్థలు భిన్నమైన అంకెలను చూపుతున్నాయి. బిబిసి సమాచారం ప్రకారం 435స్థానాలున్న ప్రజా ప్రతినిధుల సభ (అమెరికన్ కాంగ్రెస్)లో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ 210, అధికార డెమోక్రటిక్ పార్టీ 192 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఎగువసభ సెనెట్‌లోని వంద స్థానాలకు గాను 35సీట్లకు, 50రాష్ట్రాల గవర్నర్ పదవులకూ ఎన్నికలు జరిగాయి. సెనెట్‌లో తాజా పరిస్థితి ప్రకారం ఒక స్థానానికి రెండదఫా ఎన్నిక జరగాల్సి ఉంది. డెమోక్రటిక్ పార్టీకి 46, రిపబ్లికన్ పార్టీకి 48, ఇతర పార్టీలకు రెండు స్థానాలు ఉన్నాయి. అంతిమంగా రెండు పార్టీ లకు సమాన బలం ఉంటుందని, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఓటుతో అధికారపక్షానికి 51తో మెజారిటీ ఉంటుందని, మెజారిటీ గవర్నర్ స్థానాలు, ప్రజాప్రతినిధుల సభలో స్వల్ప మెజారిటీ రిపబ్లికన్లకు వస్తుందని అంచనా.
ఓట్ల లెక్కింపు సరళిని చూసిన అధ్యక్షుడు జో బైడెన్ బుధవారంనాడు చేసిన వ్యాఖ్యల ద్వారా ఓటమిని పరోక్షంగా అంగీకరించటమేగాక రిపబ్లికన్లతో సఖ్యతకు సిద్దమే అనే సంకేతాలిచ్చాడు. అంచనాలకు మించి డెమోక్రటిక్ పార్టీ మెరుగ్గా ఉన్నందుకు ప్రజాస్వామ్యానికి శుభదినం, రిపబ్లికన్ అనుకూల గాలి వీస్తుందన్న మీడియా, ఎన్నికల పండితులు చెప్పిందేమీ జరగలేదు అని జో బైడెన్ చెప్పాడు. తిరుగులేదు అనుకున్న చోట్ల రిపబ్లికన్లు ఓడారు. ఎన్నికలకు ముందు దిగజారిన జో బైడెన్ పలుకుబడి కారణంగా డెమోక్రటిక్ పార్టీకి తగలనున్న ఎదురు దెబ్బల గురించి అందరూ విశ్లేషణలు చేశారు. నష్ట నివారణకు బైడెన్ ఎన్ని తిప్పలు పడినా ఫలం దక్కలేదని తీరుతెన్నులు వెల్లడించాయి. రద్దయిన దిగువ సభలో డెమోక్రటిక్ పార్టీకి 220, రిపబికన్ పార్టీకి 212, మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కొత్త సభలో బలాబలాలు అటూ ఇటూ కావచ్చు. అమెరికా పార్లమెంటు ఎన్నికల చరిత్రను చూసినప్పుడు ఒక పార్టీ అధ్యక్ష స్థానాన్ని గెలుచుకొని అధికారానికి వస్తే రెండేండ్లకు జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్షం మెజారిటీ సాధించటం ఒక ధోరణిగా ఉంది. దాని కొనసాగింపుగానే ఈ సారీ అదే జరగనుంది. అందుకే ఎన్నికల ముందు గాండ్రింపులు, హూంకరింపులు, ఘీంకరిపులు, వీరశూర ప్రతిజ్ఞలు చేసినా, ప్రగల్భాలు పలికినా ఈసారి కూడా లెక్కింపు పూర్తిగాక ముందే జో బైడెన్ అవన్నీ మరిచిపోదాం అన్నట్లుగా మాట్లాడటం మొదలు పెట్టాడు. అంతిమంగా ఎవరికెన్ని సీట్లు వచ్చినప్పటికీ రిపబ్లికన్లతో కలసిపనిచేసేందుకు సిద్దపడ్డానని, రిపబ్లికన్లు తనతో కలసి పని చేయాలని కోరుకుంటున్నట్లు ఓటర్లు స్పష్టం చేశారని కూడా చెప్పాడు. పార్లమెంటు మీద దాడిచేయించిన డోనాల్డ్ ట్రంప్ ఉగ్రవాదాన్ని సమర్థించిన అనేక మంది రిపబ్లికన్లు ఈ ఎన్నికల్లో ఓడిపోవటం ఒక్కటే బైడెన్‌కు ఊరటనిచ్చినట్లు కనిపిస్తోంది. సెప్టెంబరు నెలలో ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీని డోనాల్డ్ ట్రంప్, అతని మద్దతుదార్లు, అమెరికాకు అగ్రస్థానం అనే శక్తులు నడుపుతున్నందున దేశానికి ఇది ముప్పని వర్ణించిన బైడెన్ ఇప్పుడు అదే పార్టీతో కలసి పని చేస్తానని, మద్దతు కావాలని కోరటం రాజకీయ వంచన తప్ప మరొకటి కాదు.
డోనాల్డ్ ట్రంప్ ఏలుబడిలో ప్రజాప్రతినిధుల సభలో మెజారిటీగా ఉన్న డెమాక్రాట్లు ప్రభుత్వానికి పెద్దగా అడ్డుపడింది లేదు. చైనా మీద వాణిజ్య పోరుతో సహా అన్నింటికీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రిపబ్లికన్లు కూడా అంతకు మించి అడ్డుకొనేదేమీ ఉండదు. గత ఎన్నికల ఫలితాన్ని అంగీకరించని ట్రంప్ 2024లో తిరిగి తాను పోటీ చేస్తానని చెబుతున్నందున బైడెన్‌కు ఆటంకాలు ఎక్కువ కావచ్చు. తమ మద్దతు లేనిదే ఏదీ నడవదు అని నిరూపించుకొనేందుకు కొన్ని బడ్జెట్ ప్రతిపాదనలను గతంలో డెమాక్రాట్లు అడ్డుకున్నట్లే ఈసారీ రిపబిక్లను అదే చేస్తారు. చైనా అనుమతిలేని తైవాన్ పర్యటనకు రెండు పార్టీల నేతలు చెట్ట పట్టాలు వేసుకొని వెళ్లిన సంగతి తెలిసిందే.
పార్లమెంటులో ఎవరికి మెజారిటీ వచ్చినా ఈ ఎన్నికల ఫలితాలతో తన విధానాల్లో ఎలాంటి మార్పు ఉండదని బైడెన్ స్పష్టం చేసినందున యుద్ధం, కార్మికులకు హాని కలిగించే పొదుపు చర్యలు, జనం మీద భారాలు మోపే విధానాలను కొనసాగిస్తానని చెప్పటమే. అమెరికాలో అధికార ప్రతిపక్షాలు పెద్ద రాక్షసులు - చిన్న రాక్షసులు అన్న తేడా తప్ప జనాన్ని పీక్కుతినటంలో రెండూ ఒకటే. రాజకీయ వాస్తవాలను మరింతగా అర్థం చేసుకొని గతంలో మాదిరే ఇప్పుడూ తమ ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను కాపాడుకొనేందుకు పోరుబాట తప్ప అక్కడి కార్మికవర్గానికి మరో దగ్గరదారి లేదు.