Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నో ఎంట్రీ టూ తెలంగాణ''.... ఇప్పుడు హైద్రాబాద్ నగరంలో వెలసిన బ్యానర్లివి. నేడు ప్రధాని రాకపై నిరసనలకు సంకేతాలివి. ఆయన రామగుండం 'ఎరువుల కర్మాగారాన్ని' జాతికి అంకితం చేస్తానంటూ వస్తోంటే, రావద్దంటూ రాష్ట్రమంతటా ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. కేవలం రాజకీయ పార్టీల నుండే కాదు, ప్రజాసంఘాలూ పౌరసమాజం నుండి కూడా ప్రధాని పర్యటన సందర్భంగా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. పైగా మునుగోడులో ఓడి, దానికి తోడు ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారంలో పట్టుబడి... బీజేపీ పరిస్థితి కన్నంలో దొరికిన దొంగలా తయారైన నేపథ్యంలో ఈ పర్యటనకు తెరతీయడం పలు సందేహాలు రేకెత్తిస్తోంది. బెడిసికొట్టిన తమ వ్యూహాలు, బట్టబయలైన అనైతిక, అప్రజాస్వామిక చర్యలు, ఫలితంగా కోల్పోయిన పరువు, ఎదురైన పరాభవాల నుండి ప్రజల దృష్టిని ఏమార్చేందుకే ఈ సమయాన్ని ఎంపిక చేసుకున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. లేదంటే ఎప్పుడో ప్రారంభ మైన ఎరువుల ఫ్యాక్టరీని ఇప్పుడు జాతికి అంకితమివ్వడమేమిటీ? ఇందుకు ప్రధానికి గల కారణాల సంగతెలా వున్నా, ప్రజల నిరసనలకు మాత్రం కారణాలు స్పష్టంగానే ఉన్నాయి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుండీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నది. మరి ఈ ఎనిమిదేండ్లలో వీరు రాష్ట్రానికి వొరగబెట్టిందేమిటన్నది ఈ సందర్భంగా ప్రజలడుగుతున్న ప్రశ్న. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఇవ్వాల్సిన చేయూత ఇవ్వకపోగా, హక్కుగా రావాల్సిన నిధులను కూడా అడ్డుకుంటున్నారు కదా..! మరి ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకొస్తున్నారు? కనీసం విభజన చట్టాన్నైనా అమలు చేశారా? కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఎటుబోయింది? బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏమైంది? ములుగు గిరిజన విశ్వవిద్యాలయం ఎక్కడుంది? కాళేశ్వరానికి జాతీయ హౌదా ఎందుకు రాకుంది? ఇవన్నీ విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా, వీరిచ్చింది మాత్రం గుండుసున్నా..! ఉమ్మడి ఆస్తుల విభజన ఇప్పటికీ కొలిక్కిరాలేదు. పైగా రాష్ట్రానికి రావాల్సిన అనేక ప్రాజెక్టులను పనిగట్టుకుని పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు! కాంగ్రెస్ హయాంలో రాష్ట్రానికి మంజూరైన ప్రతిష్టాత్మక ''ఐటీఐఆర్''ను ఎవరెత్తుకెళ్లారు? ''అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రం'' ఏర్పాటుకు దేశంలో హైదరాబాద్ అనువైన కేంద్రమనీ, దీనిని అక్కడే ఏర్పాటు చేస్తామనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ప్రకటించింది. అయినప్పటికీ దాన్ని గుజరాత్‌కు దారిమళ్లించింది ఎవరు? ప్రధాని మోడీ కాదా? ఇవ్వాల్సిన తెలంగాణకు మొండి చెయ్యి చూపి, రైల్వేకోచ్ ఫ్యాక్టరీని మహారాష్ట్రకు మంజూరు చేసింది ఎవరు? మోడీ ప్రభుత్వం కాదా? వీటికి సమాధానం చెప్పకుండా మళ్లీ ఏం మాయచేయడానికొస్తున్నారు? అంటూ తమ నిరసనకు కారణాలను స్పష్టంగా ప్రకటిస్తోంది తెలంగాణ సమాజం. మరి ప్రధాని వద్ద సమాధానాలున్నాయా?
నిర్లజ్జగా ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరతీసిన తన రాజకీయ బేహారులు చెరసాలలో ఉండగానే వేంచేస్తున్న ప్రధాని, ఇప్పటివరకూ ఈ ఉదంతంపై నోరు విప్పింది లేదు. కనీసం ఇప్పుడైనా మౌనం వీడుతారా? వారితో తమకెలాంటి సంబంధం లేదంటున్నారు రాష్ట్రంలోని కమలదళాధిపతులు. అదే నిజమైతే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ''సిట్''ను ఏర్పాటు చేసిన 24గంటల్లోనే ఎందుకు హైకోర్టును ఆశ్రయించారు? తమ ప్రమేయమే లేనప్పుడు ''సిట్'' విచారణకు ఎందుకు భయపడుతున్నారు? మునుగోడు పరాభవం ముగియగానే ''అసలు ఆట ఇప్పుడు మొదలవుతుంద''ంటూ బీజేపీ నేతలు ప్రకటించడం, ఆ వెంటనే ప్రత్యర్థులపై ఐటీ, ఈడీ దాడులు మొదలవ్వడం వెనుక మతలబేమిటి? వీటిలో దేనికీ జవాబు చెప్పలేని బీజేపీ నేతలు, ప్రధాని కర్మాగారం ప్రారంభానికి వస్తుంటే ముఖ్యమంత్రి పరారవు తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఆ కర్మాగారంలో రాష్ట్ర ప్రభుత్వం వాటాదారు అన్న సంగతి తెలిసికూడా ముఖ్యమంత్రిని ఆహ్వానించడంలో ''ప్రొటోకాల్'' పాటించని కేంద్రం తీరును మాత్రం అత్యంత తెలివిగా విస్మరిస్తున్నారు. ప్రతిదీ రాజకీయం చేసి లబ్ధి పొందాలన్న దుగ్దతప్ప, ఎక్కడా ప్రజాస్వామ్య విలువల పట్ల, ప్రజా ప్రయోజనాల పట్ల పరిణితి చూపని ఈ నేతల తీరు మరీ దౌర్భాగ్యం.
ఎనిమిదేండ్లుగా తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్న వీరు, ఇప్పుడీ ''ఎరువుల కర్మాగారాన్ని'' జాతికి అంకితం చేసి ఉద్ధరిస్తారట! నిజానికి 70దశకంలోనే ప్రారంభించబడిన ఈ పరిశ్రమ ఉత్పత్తిలో అద్భుత ప్రగతిని సాధించింది. మధ్యలో ఏలినవారి విధానాల పుణ్యమా అని ఒడిదుడుకులకు గురై నిలిచిపోయింది. తిరిగి రెండేండ్ల క్రితమే పునఃప్రారంభమై కొనసాగుతున్న పరిశ్రమను ఇప్పుడు కొత్తగా ప్రారంభించడంలోని ఆంతర్యమేమిటీ? దక్షిణాదిన ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలంగాణలో అవన్నీ ఆవిరైపోతుండటంతో, ప్రజలను మాయచేయడానికీ, ప్రజల అసంతృప్తిని దారిమళ్లించడానికీ ఇదో సాకు. అందుకే ప్రధాని రాక సందర్భంగా ఇన్ని ప్రశ్నలు, ఇంత నిరసన. మరి ప్రధాని ఈ ప్రజా నిరసనను గౌరవించి జవాబు చెపుతారో, తనకలవాటైన మాయాజాలాన్నే ప్రదర్శించిపోతారో వేచి చూద్దాం...