Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'న్యాయం గాయమై, సంవత్సరాల తరబడి సలుపుతున్న బాధే కోర్టు'... ఈ అలిశెట్టి ప్రభాకర్ కవితావాక్యం నిత్యం రుజువవుతున్న సత్యం. న్యాయమే అన్యాయంగా గాయాలు చేస్తే ఆయుధం అనివార్యమేనని తెలవటానికి ఎంతో సమయం పట్టదు కదా! అందుకే చట్టపరిధిలోనే ఉన్నత హౌదాలో పనిచేస్తున్న అధికారిణికి కూడా ఆయుధావసరం గుర్తుకొచ్చిందంటే, పరిస్థితులు ఎంత దిగజారిపోతున్నాయో అర్థమవుతుంది. ''దేశంలో న్యాయపరంగా ఇలాంటి నిరాశలే కొనసాగితే ఆయుధాలు కలిగివుండే హక్కును మహిళలకు కల్పించడానికి ఇది సరైన సమయం కావచ్చు. న్యాయం, చట్టం రెండూ వేర్వేరు అంశాలు కాకూడదు'' అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిణి తన అభిప్రాయం తెలియజేసే సందర్భం, న్యాయవ్యవస్థలో చోటు చేసుకుంటున్న అన్యాయాల తీవ్రతను ప్రస్పుటం చేస్తుంది. దేశంలో మహిళలకు న్యాయం తిరస్కరించబడటం, దోషులు బలాదూర్‌గా విడుదల కావటం ఆ మహిళా అధికారిణి గుండెను చలింపచేసి ఆయుధ ఆలోచనకు పురికొల్పింది. చట్టం, న్యాయం, ధర్మం అన్నీ విఫలమయ్యేచోట, అన్యాయాన్ని ఎదిరించటానికి ఆయుధం వినామరోదారేముంటుంది. ఆమె ఏ హౌదాలో ఉన్నా ఒక బాధిత హృదయపు స్పందనగానే భావించాలి. దేశంలో స్త్రీలు పడుతున్న వేదనకు ఇదో ఉదాహరణ.
ఇప్పుడే కాదు, ఇంతక్రితం బిల్కిస్ బానో కేసులో నేరం రుజువయి శిక్షననుభవిస్తున్న దోషులను క్షమాభిక్షపేరుతో విడుదల చేసిన సందర్భంలోనూ ఆమె స్పందించారు. నేరస్తులు ఆనందోత్సవాలు జరుపుకోవటం ఎవరికైనా ఆందోళనే కలిగిస్తుంది. దోషులూ అభినందనలు అందుకొంటున్న కాలంలో ఉన్నాం మనం. ఈ దారుణాలను చూస్తున్న అనేక గొంతులూ ఇంకా మూగబోయేవున్నాయి. ఇలాంటి వాతావరణంలోనూ గొంతువిప్పిన ఆమె ధీరత్వానికి అభినందనలు చెప్పాల్సిందే.
'ఇదొక గుడ్డి న్యాయవ్యవస్థ' అని బాధితురాలి తల్లిదండ్రులు వ్యాఖ్యానించడం ఎంతవాస్తవమైనది! చట్టమూ, న్యాయమూ అందరినీ సమానంగా చూస్తాయని అనుకోవడం ఎంత పిచ్చితనం! డేరాబాబాకూ సాయిబాబుకు వేరువేరు న్యాయాలే జరగటం మనం చూడటం లేదూ! ప్రభుత్వ అనుకూలురు నేరస్తులయినా నిర్దోషులుగా విడుదలవుతారు. అదే ప్రభుత్వ వ్యతిరేకులయితే నిర్దోషులూ నిర్బంధంలో మగ్గుతుంటారు. ఇదీ నేటి మన న్యాయవ్యవస్థ ప్రవర్తనాతీరు.
అది 2012. ఢిల్లీకి చెందిన 19ఏండ్ల యువతిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడి, అత్యంతకిరాతకంగా హింసించి చంపారు. ఆ కేసును 2014లో ఢిల్లీ ట్రయల్‌కోర్టు విచారణ జరిపి దోషులు ముగ్గురికీ మరణశిక్ష విధించింది. ఢిల్లీ హైకోర్టు కూడా ఆ శిక్షను ధృవీకరించింది. 'వేట కోసం వెతికే జంతువుల్లా వీరు వీధుల్లో పడి తిరుగుతుంటారని' స్వయానా కోర్టు వ్యాఖ్యానించింది కూడా. కానీ ఆ ముగ్గురు నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తమ శిక్షను తగ్గించాలని మొరపెట్టుకున్నారు. ఎంతో ''దయామయమైన'' సుప్రీంకోర్టు విచారణ జరిపి, ఆ ముగ్గురూ నిర్దోషులని ప్రకటించి విడుదల చేసింది. ఈ సంఘటన ఇటీవలే జరిగింది. దీనికంటే ముందే బిల్కీస్ బానో కేసులో నేరస్తులనూ క్షమాభిక్షపెట్టి విడుదల చేశారు. ఈ ఘటనలే ఐఏఎస్ ఆఫీసర్ని కలవరపెట్టాయి. హత్రాస్‌లో అత్యాచారం, హత్య సంఘటనలోనూ ఇంతవరకు న్యాయం జరగలేదు. దేశంలో నిర్భయకేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆడపిల్లలను కాపాడేవారెవ్వరు? రక్షణ కల్పించేవారెవ్వరు? కాపాడలేకపోయినా, నేరస్తులకు సైతం శిక్షలు వేయించలేని వ్యవస్థపై విశ్వాసం ఎలావుంటుంది! పై కేసులో నేరము తామే చేశామన్న ఒప్పుకోలుతోనే, వాళ్లు శిక్షను తగ్గించమన్నారు. అంతేకాని నేరము చేయలేదని చెప్పలేదు. కానీ కోర్టు మాత్రం మొత్తం శిక్షనే రద్దుచేసింది. ఇలాంటి సంఘటనలు ఈ సమాజంలో సగంగావున్న స్త్రీలను తీవ్ర భయానికి, అభద్రతకు గురిచేస్తున్నాయి.
స్త్రీల పట్ల చులకన భావన, వివక్షత గూడుకట్టుకున్న సమాజపు ఆలోచనల ప్రతిఫలనమే ఈ అన్యాయాలు. ఛాందస భావాలు, సంప్రదాయాల పేరుతో కొనసాగే అసమానతలు సమంజసమేననే తిరోగమన వాదుల ఆధిపత్యం పెరుగుతున్న క్రమంలోనే స్త్రీలకు జరిగే అన్యాయాలు పెరిగిపోతున్నాయి. ఈ అన్యాయాలకు కార్చే దుఃఖాశ్రువులే రేపు తిరుగుబాటు కెరటాలై ఉప్పొంగుతాయి. బాధలు, కన్నీళ్లు ఎప్పుడూ బలహీనతలు కావు. అవి రేపటి యుద్ధానికి సంకేతాలు. అందుకే అధికారిణి చెప్పింది అక్షరాల నిజం. ఆడపిల్లలకు ఇది ఆయుధం అనివార్యమయ్యే సందర్భమే.