Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''వారిజాక్ష్షులందు, వైవాహికములందు, ప్రాణ, విత్త, మాన భంగమందు బొంకవచ్చ''ని శుక్రనీతి పర్మిషన్ ఇచ్చింది. మొదటి రెండు అవకాశాలు, అవసరాలు లేని పెద్దమనిషికి మిగతా మూడింటిలో ఏదో ఒకటి ఉండి ఉండవచ్చు. ఎంత అవసరం లేకపోతే ఇరవయి నెలలుగా ఉత్పత్తి నడుస్తున్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మొన్నటికి మొన్న భారత ప్రధాని జాతికి 'అంకితం' చేస్తారు?! 'జాతికి అంకితం' అనేమాట ఒక్కదెబ్బకి నిఘంటువుల్లో అర్థాలు తిరగరాసుకోవాల్సిన స్థితి తెచ్చారు కదా!?
భారత ప్రధానికి ఆయనమీద ఆయనకి గట్టి నమ్మకం ఉండి ఉండవచ్చు. కానీ ప్రజల్ని శుద్ధ దద్దమ్మలుగా లెక్కిస్తేనే ప్రమాదం. ఆ ఫ్యాక్టరీలో దాదాపు రెండేండ్లుగా ఉత్పత్తి నడుస్తోంది. పాత టౌన్‌షిప్‌ను రిపేర్లు చేసి ఆరువందల మంది ఎగ్జిక్యూటీవ్‌లు, నాన్ ఎగ్జిక్యూటీవ్లకు ఇచ్చారు. మరో ఏడువందల మంది కాంట్రాక్టు కార్మికులున్నారు. వీరందరి చుట్టూ అల్లుకున్న ఆర్థిక వ్యవస్థవుంది రామగుండంలో. అంతేనా? ఈ ఎరువుల కర్మాగారం వల్ల ప్రభావితమైన ఐదారు గ్రామాల ప్రజలున్నారు. దీని వాయు కాలుష్యంతో ఇబ్బంది పడే వందలాది మంది జనం ఉన్నారు. 'డిపెండెట్స్' ఉద్యోగాల సమస్య ఉంది. ఇన్ని ఏనుగుల్ని తివాసి కిందికి నెట్టేసి మీరు 'గజం మిథ్య! పలాయనం మిథ్య!' అంటే కుదరదు మోడీ సాబ్! కబేళాలో మేకలు, గొర్రెలు, పశువుల్ని తెగనరికిన చేతులు హఠాత్తుగా కొన్ని మేకలకి గడ్డిపరకలేస్తూంటే దేశ ప్రజలు వాటిమీద ప్రేమను కోవట్లేదు! ఇప్పుడు మేపేది అప్పుడు కోతకేననేది జనవాక్యం!
సరళీకృత ఆర్థిక విధానాల పుణ్యాన 1995 తర్వాత ఏ ఎరువుల కంపెనీలో అదనంగా పెట్టుబడులు పెట్టలేదు ప్రభుత్వాలు. పైగా 2002లో సింద్రి, బరౌనీ, గోరఖ్‌పూర్, రామగుండం మూసేసింది నాటి వాజ్‌పారు సర్కార్. దీంతో దిగుమతులు విపరీతంగా పెరిగాయి. ప్రయివేటు కర్మాగారాలు మీద ఆధారపడటం పెరిగింది. వాటికి చెల్లించే సబ్సిడీల బిల్లు పెరిగింది. ఇది 2019-20లో రూ.83వేలు కోట్ల నుండి 2022-23 అంతానికి రూ.2.5లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ప్రభుత్వాల బడ్జెట్ అంచనాలే తలకిందులయ్యే ప్రమాదం ఉంది. ఈ దశలో పీపుల్స్ కమిషన్ ఆన్ పబ్లిక్ సెక్టార్ Ê పబ్లిక్ సర్వీసెస్ (పిసిపిఎస్పిఎస్) తరఫున థామస్ ఐజక్, ఇ.ఎ.ఎస్. శర్మ, ఎస్.పి. శుక్లా, సి.పి. చంద్రశేఖర్, ప్రభాత్ పట్నాయక్, దినేష్ అబ్రాల్ వంటి మేధావులు 1978 తర్వాత అమల్లో ఉన్న ప్రభుత్వ ధరల నిర్ణయ విధానమే (అడ్మినిష్టర్డ్ ప్రైసింగ్) మన రైతాంగాన్ని కాపాడిందని, ప్రభుత్వరంగంలో ఎరువుల కంపెనీలను పునరుద్ధరిం చాలని, ఎరువుల ఉత్పత్తికోసం సహజ వాయువును ప్రాధాన్యతా క్రమంలో అందించాలని వంటి సిఫార్సులు చేసింది. ఈ నేపథ్యంలో వీటిని ప్రారంభిస్తున్నారా? బాగా మేపి అస్మదీయులకు కట్టబెట్టేందుకా? మనం వెండితెరపై చూడాల్సిన చిత్రమే.
నేడు కనీస మద్దతు ధరల కోసం రైతాంగ ఉద్యమం తారాస్థాయికి చేరుతోంది. మద్దతు ధర నిర్ణయించడంలో ఎరువుల ధర కీలకం. 1969లో నాటి గృహమంత్రి వై.బి. చవాన్ ''హరిత విప్లవం ఎర్ర విప్లవం''గా మారుతుందేమోనన్న మాటలు మోడీకి గుర్తొచ్చాయో, నాటి గృహ మంత్రిత్వశాఖ తయారుచేసిన నోట్లో రాసిన ''ఒక సంక్లిష్ట కేంద్రకం (కాంప్లెక్స్ న్యూక్లియస్) పెద్ద విస్ఫోటనమవుతుందేమో'' నన్న విషయం చదివారో ఏమో ఎరువుల కంపెనీలకు పచ్చజెండా ఊపారు.
గతవారం నుండి తెలంగాణలో జరుగుతున్న ప్రచారాన్ని కౌంటర్ చేసే ప్రయత్నంలో రామగుండం సభలో ప్రధాని తప్పుల్లో కాళ్ళేస్తూ పోయారు. సింగరేణిని 49శాతం వాటావున్న మేము ఎట్టా ప్రయివేటీకరిస్తామని ఒక చొప్పదంటు ప్రశ్న సంధించారు. తాజాగా 141 బ్లాకులను కేంద్రం వేలానికి పెట్టింది. దానిలో మన సింగరేణివి నాలుగున్నాయన్న సత్యానికి ముసుగేసే ప్రయత్నం చేస్తున్నారు. ''అసలు నేను లెక్కేపెట్టుకోనని నీ యెదవాలోచన'' అనే ముత్యాల ముగ్గులో రావుగోపాల్రావు డైలాగ్ గుర్తుచేసుకుందాం. మన తెలంగాణ జనం ఏ వివరాలు చూసుకోరు, తెలుసుకోరనేది బీజేపీ నేతల నమ్మకంలా ఉంది. మనకి ఈ లెక్కలే కాదు, ఇటీవల కోలిండియాలో ఒకే ఒక్కశాతం వాటా కొన్న కెనడాకి చెందిన ఎంఎన్‌సి ఎన్టిపిసి అమ్మే విద్యుత్ ధర వల్ల తమకొచ్చే లాభం తగ్గుతుందని మోకాలొడ్డిన విషయం కూడా తెలుసు. అంతేకాదు, నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్ పేర లక్షల కోట్ల ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల్ని మీరు బలితీసుకుంటున్నారని కూడా తెలుసు తెలంగాణ సమాజానికి. మీ మూతికి రక్తపు మరకలు అలానే ఉన్నాయి మోడీ సాబ్! మీకు కోరల్లేవని, చారల్లేవని పైన కప్పుకున్న ఆవుచర్మాన్ని సరిచేసుకుంటూ, గడ్డి పరకలే గతుకుతామని చెప్తే నమ్మేవాళ్ళెవరూ లేరు తెలంగాణలో!