Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి ఆకలితో ఆలమటించే పరిస్థితి రూపుమాపాలనే లక్ష్యాన్ని అందుకోవడం కష్టాసాధ్యమేనని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక తేల్చిచెప్పింది. 2030 నాటికి ఆకలి సమస్యను అధిగమించడానికి ఐరాస నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరడానికి మరో ఎనిమిదేండ్లే ఉంది. కానీ, వాస్తవంలో అందుకు విరుద్ధంగా ప్రపంచమంతా ఆకలితో 'అన్నమో రామచంద్రా' అంటూ అల్లాడుతోంది. అత్యంత ఆధునిక సమాజమని చెప్పుకుంటున్న ఈ కాలం కూడా అన్నార్తుల ఆక్రందనలను జయించలేకపోతోంది. నేటి ప్రజాస్వామ్య యుగంలో ఏ ఒక్క పేగూ ఆకలితో కాలిపోకుండా కాపాడుకోవడం ప్రభుత్వాల కనీస బాధ్యత. కానీ ''ఘనమైన'' ప్రభుత్వాలు అది విస్మరించిన ఫలితమే, నేడు సగానికిపైగా ప్రపంచం ఆర్థాకలితో అలమటిస్తోంది. ఆహార సంక్షోభంపై తాజాగా వెలువడిన ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) నివేదిక ఈ అవనిపై ఆకలికేకలకు అద్దం పడుతోంది.
మితిమీరిన సంపద కేంద్రీకరణ, ఆయా దేశాల్లో నెలకొన్న ఘర్షణలు, ప్రకృతి ఉత్పాతాలే ఇందుకు ప్రధాన కారణాలు కాగా, ఆకలి మంటకు కోవిడ్ ఆజ్యం తోడవడంతో కష్టాలు మరింత తీవ్రం అయ్యాయి. పులిమీద పుట్రలా రష్యా, ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు పరిస్థితులను మరింత జటిలం చేస్తున్నాయి. ఫలితంగా ఈ క్షుద్బాధలు ఇంకా ఉధృతమవనున్నాయని నివేదిక ఆందోళన వ్యక్తం చేస్తోంది. 138 దేశాల్లో కనీసం 52 దేశాల జనాభాలో సగం మందికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్థోమత లేదని స్పష్టం చేసింది. ప్రపంచ జనాభాలో అత్యధికులు పేదరికం, అర్థాకలితో అలమటిస్తున్నారు. 53 దేశాల్లో 19.3 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచంలోని ఈ అన్నార్తుల సంఖ్య అదనంగా మరో నాలుగు కోట్లు పెరిగింది.
ఈ ఆకలి మహమ్మారి మన దేశంలోనూ కోరలు చాస్తుండటం విస్మరించలేని నిజం. ప్రపంచానికే ఆహారం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఇటీవల ప్రధాని ప్రకటించారు. ప్రకటనయితే ఆహ్వానించదగ్గదే కానీ, వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రపంచ ఆకలి సూచీలో మన స్థానం 116లో 101వదని ఆయన మరిచిపోవడమే విచారకరం. ప్రపంచంలో తీవ్రమైన 31 ఆకలి రాజ్యాలలో భారత్ కూడా ఉండటం కడు విషాదం. భగ్గున మండుతున్న నిత్యావసరాలు ధరల సెగలకు అసంఖ్యాకులైన సామాన్యులు విలవిలాడుతున్నారు. ఇలా పట్టెడన్నం కోసం పరితపించే అభాగ్యుల సంఖ్య ప్రపంచమంతా పెరిగిపోతుండటం నేటి మహావిషాదం. ఇందుకు ఎవరిని నిందించాలి?
ఒక మనిషి రోజువారీ శక్తి అవసరాలను తీర్చగలిగేదే ఆరోగ్యకరమైన ఆహారమని ఎఫ్ఏఓ నిర్వచిస్తోంది. అలాంటి ఆహారం తినే అవకాశాలు కానీ, వనరులు కానీ ఎంతమందికున్నాయి? నేటికీ పిడికెడు మెతుకులకు నోచని బతుకులు కోకొల్లలు..! నిజానికి ప్రపంచంలో ఇప్పటికే ఉత్పత్తి అయి చలామణిలో ఉన్న సంపద కొన్ని వేల ట్రిలియన్ డాలర్లు ఉంటుంది. అది ప్రపంచ జనాభా అంతా కాలుమీదకాలేసుకుని తిన్నా కొన్ని వందల ఏండ్లకు సరిపోతుంది. ఈ సంపద రోజు రోజుకూ పెరిగినంత వేగంగా జనాభా పెరగటం అసాధ్యం. అసలు ఉన్న సంపదను వాడుకోకుండానే అది ఏటా ఉత్పత్తి చేసే సంపదే ప్రపంచ జనాభాకు కడుపునిండా అన్నం పెడుతుంది. మరి ఇంత సంపద ఉంది కదా..! ఇంకా ఆకలి ఎందుకుంది..? ఇప్పుడు ప్రపంచం ఆకలిని తీర్చగలిగేది ఈ ప్రశ్నకు సమాధానం మాత్రమే.
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆకలి పరిస్థితిని మెరుగు పరుస్తుందన్న ప్రజల ఆశలు ఎప్పుడో అడియాశలు అయ్యాయి. ప్రపంచంతో పోటీపడే సామర్థ్యాలు పెంచామని ఊదర కొట్టే కేంద్ర పెద్దలు ఆకలిని అదుపు చేయటంలో విఫలమైనందుకు మాత్రం సిగ్గుపడటం లేదు. ప్రపంచ ఆకలి సూచికపై దృష్టి పెడితే భారత్ చాలా వేగంగా అభివద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అనే మాటకు వన్నె తగ్గిపోతుంది. అసమాన పంపిణీ, ఆహారం వధా వల్ల కూడా ఆకలి సమస్య పెరుగుతున్నది. నిజానికి ప్రపంచంలో ప్రతీ ఒకరికి తగినంత ఆహారం అందచేసేంత ఆహారం ఉన్నది. ప్రపంచ ఆహార సరుకులు సమానంగా పంపిణీ జరిగితే అందరికీ కావల్పినంత ఆహారం ఉంటుంది. సంపన్నులు వధా చేస్తున్న ఆహారం చాలామంది పేదలకు ఆకలి తీర్చగలదు. నిజానికి ఆహారం వృధా చేయటాన్ని అడ్డుకొని ఆహార భద్రతగా మార్చచ్చు. కానీ ఎవరూ పట్టించుకోవటం లేదు.