Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిపక్ష పార్టీలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాలు తమ పాలనా విధులను నిర్వర్తించకుండా గవర్నర్ల ద్వారా అడ్డుకునేందుకు ప్రయత్నించడం కేంద్ర ప్రభుత్వానికి తగదు. ఇతర పార్టీల తరఫున ఎన్నికైన ఎంఎల్ఎలను బీజేపీకి అనుకూలంగా ఫిరాయింపజేసి, గవర్నర్ల ద్వారా కమలం పార్టీ ప్రభుత్వాలనేర్పాటు చేయించిన సందర్భాలను కూడా అనేకం చూస్తూనేవున్నాం. ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు అడ్డంకులు కల్పించి ఒకవైపు పాలన సాగనీయకుండా చేయడం, మరోవైపున రాజ్యాంగపరమైన ప్రతిష్టంభన ఏర్పడబోతోందన్న గందరగోళాన్ని సృష్టించడం తాజా చర్చనీయాంశంగా ఉంది. ప్రత్యేకించి దక్షిణాదిన కేరళ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్లు ఆయా ప్రభుత్వాలకు తలనొప్పులు తెప్పిస్తున్నారు. ప్రస్తుతం విద్యారంగానికి సంబంధించిన సమస్యల చుట్టూరా ఈ వివాదాలు సృష్టిస్తున్నారు. ఈ గవర్నర్ల దుశ్చర్యలను ఆయా ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామికంగా ఎదుర్కొంటుండటం స్వాగతించదగినది.
విద్య విషయంలో కేరళ రాష్ట్రం దేశానికే ఆదర్శం. విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్ ఆ రాష్ట్ర ఉన్నత విద్యారంగంలో గందరగోళం సృష్టించడానికి, సంఫ్‌ుపరివార్ అనుయాయులను వైస్‌ఛాన్సలర్లుగా నియమించడానికీ విఫలయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ స్థానంలో ఉన్నత అర్హతలున్న విద్యారంగ నిపుణులను ఛాన్సలర్లుగా నియమించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ను రూపొందించి గవర్నర్ ఆమోదానికి పంపారు. రాజ్యాంగ బద్ధమైన బాధ్యతలు నిర్వహించే గవర్నర్ విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్లుగా ఉండటం సబబుకాదని జస్టిస్ పూంచ్ కమిటీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఛాన్సలర్ల బాధ్యతలను గవర్నర్ల నుండి తప్పించాలని కూడా అభిప్రాయపడింది. విద్యారంగ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం పూంచ్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఛాన్సలర్లగా విద్యారంగ నిపుణులను నియమించాలని నిర్ణయించడం సబబే. గవర్నర్ తన రాజ్యాంగ బాధ్యతలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్‌పై సంతకం చేస్తారని పలువురు ఆశిస్తారు. కానీ రాష్ట్ర మంత్రులపైనా, ప్రభుత్వంపైనా తీవ్ర పదజాలంతో అవాకులు చవాకులు మాట్లాడిన వ్యక్తి రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తారా అన్నది ఇంకొందరి సందేహం. మరోవైపున విచారణ పూర్తయ్యే వరకూ వైస్ ఛాన్సలర్లకు జారీ చేసిన షోకాజ్ నోటీసుపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోవద్దంటూ గవర్నర్‌ను కేరళ హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. ఆయన ఇప్పుడైనా రాజ్యాంగం ప్రకారం, హైకోర్టు ఆదేశాలకు తగినట్టుగా నడుచుకోవాలి.
తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామకబోర్డు విషయంలో తనకు సందేహాలున్నాయంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సరికొత్త వివాదం రేపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు లోబడే ఆ బిల్లును రూపొందించినట్టు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. యూజీసీతోపాటు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఎఐసిటిఇ) వంటి సంస్థల మార్గదర్శకాలను పాటిస్తామని ఆ బిల్లులో పొందుపర్చారు. నిజానికి బీహార్, జార్ఖండ్‌లలో విశ్వవిద్యాలయాల నియామకాలకు బోర్డు ఎప్పటి నుంచో పనిచేస్తోంది. ఒడిశాలో వర్సిటీ సిబ్బందిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు నియామక ప్రక్రియలున్నాయి. అయినా తమిళిసై బిల్లును అడ్డుకున్నారంటే ఏదో కిరికిరి పెట్టాలనే కదా!
ఇక తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 20 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ రవి ఆమోదం తెలపకుండా అడ్డుకున్నారు. నీట్‌తో సంబంధం లేకుండా ఎంబిబిఎస్ ప్రవేశాలు కల్పించాలన్నది వాటిలో ఒకటి. ప్రజలెన్నుకున్న శాసనసభ ఆమోదించిన బిల్లులకు మోకాలొడ్డి, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పని చేయకుండా నిరోధిస్తున్న ఆయనను గవర్నర్‌గా తొలగించాలంటూ తమిళనాడు చట్టసభల సభ్యులు రాష్ట్రపతికి విన్నవించారు. ఇలా రాజ్‌భవన్ ద్వారా రాజకీయాలు నడిపే విధానాలను బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా విడనాడాలి. వారందుకు సిద్ధపడకపోతే భారత రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుకునేందుకు ప్రజలు, ప్రజాతంత్రవాదులూ ఒత్తిడి పెంచాలి, ఉద్యమించాలి.