Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు పుచ్చపల్లి సుందరయ్య పార్లమెంటులో ప్రతిపక్ష నేత. ఆ హోదాలో ఆయన మాట్లాడటం మొదలెట్టగానే ఆనాటి ప్రప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సైతం చెవులు రిక్కించి మరీ వినేవారట. ఒకవేళ సుందరయ్య మాట్లాడే సమయానికి సభ వెలుపల ఉన్నా... వెనువెంటనే లోనికి వచ్చి కూర్చోని ఆయన ప్రసంగాన్ని నెహ్రూ శ్రద్ధగా ఆలకించేవారట. కొద్ది నెలల క్రితం రంగారెడ్డి జిల్లా మాల్యాల గ్రామంలో కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణ సభకు విచ్చేసిన సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి... రాజ్యసభలో గతంలో చర్చలు, వాదోపవాదాలు జరిగేవనీ, అయితే అవి ఎంత హుందాతనంగా ఉండేయో సోదాహరణంగా వివరించారు. ఆ కాలంలో యూపీఏ-1 ప్రభుత్వానికి జైపాల్ ప్రతినిధి అయితే... ఏచూరి ప్రతిపక్ష నేత. ఇటీవల కాలంలో రాజకీయాల్లో... ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో వస్తున్న, వచ్చిన మార్పులు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో రాజకీయ నేతలు ఎంత హుందాగా, విలువలతో ఉండాలనే దానికి ఈ రెండు ఉదాహరణలను చెప్పాల్సి వస్తున్నది. సోదర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి నాయకగణ అవాకులు, చెవాకులతో చెవులు చిల్లులు పడుతున్న తరుణంలో ఆ ఆవేదన నుంచి బయటపడకముందే ఇప్పుడు మన రాష్ట్రంలో అదే రకమైన వికృత విచిత్ర విన్యాసాలు మరింత వేదనకు గురి చేస్తున్నాయి. సంకుచిత మనస్తత్వం, కుసంస్కారంతో ఇలాంటి అర్థం పర్ధంలేని విన్యాసాలకు ఆజ్యం పోస్తున్నది కాషాయ పరివారమే. నిత్యం జ్ఞానం, శీలం, ఏకత అంటూ ఊకదంపుదు ఉపన్యాసాలిచ్చే ఈ బ్యాచ్... ఇప్పుడు బరితెగించి నోరు పారేసుకుంటున్నది.
ముఖ్యంగా మునుగోడు ఉపఎన్నిక, దాని ఫలితాల తర్వాత హద్దూ పద్దూ లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం ఆ పరివారానికి రివాజైంది. సమయం, సందర్భం లేకుండా అనవసర విషయాల్లో తలదూర్చటం, వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయటం పరిపాటైంది. మిగతావారి సంగతెలా ఉన్నా... ఈ విషయంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ పదడుగులు ముందే ఉంటున్నారు. తాను ఓ ప్రజా ప్రతినిధిని, స్థాయి ఉన్న ఎంపీననే విషయాన్నే మరిచి అడ్డగోలుగా మాట్లాడుతూ... రాజకీయ నాయకు లంటే అసహ్యం కలిగేలా వ్యవహరి స్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆయన చేసిన కామెంట్లు రాజకీయంగా పెద్ద దుమారాన్నే లేపాయి. విధానాల పరంగా కాకుండా కేవలం వ్యక్తిగత అంశాల ఆధారంగా బురదజల్లటమే పనిగా పెట్టుకున్న ఆయన... ఆది నుంచి ఇదే రకమైన నైజాన్ని ప్రదర్శిస్తుండటం గమనార్హం.
ఇదేదో అరవిందుకే పరిమితమైన అంశం కాదు... బీజేపీ, వెనకుండి దాన్ని ఆడిస్తున్న ఆరెస్సెస్ అసలు సిసలు గారడీ ఇది. మన రాష్ట్రంలోనే కాదు... యావత్ దేశంలో ఏ ఒక్క ప్రజా సమస్యా ముందుకు రావొద్దు... అందుకే దూషణ భాషణలతో కూడిన టక్కు టమారా విద్యలను అవి ప్రయోగిస్తున్నాయి. ప్రజలను సమస్యల నుంచి పక్కదారి పట్టించి తమ పబ్బం గడుపుకునేందుకు ఆయా శక్తులు వేస్తున్న ఎత్తుగడలు... పన్నుతున్న పన్నాగాలివి. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు, నిరుద్యోగం, ఆకలి, దరిద్రం, ద్రవ్యోల్బణం, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ భారాలపై ఎవరి దృష్టీ పడొద్దనేది వాటి వ్యూహం. తెలంగాణకు సంబంధించి రాష్ట్ర విభజన చట్టంలోని అనేక హామీలు అటకెక్కాయి. వాటి గురించి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులెవ్వరూ మాట్లాడరు. ఇక్కడకు రావాల్సిన అనేక ప్రాజెక్టులను గుజరాత్ లాబీయింగ్ గద్దల్లా ఆ రాష్ట్రానికి తన్నుకుపోతున్నా వారి నోరు పెగలదు. ఇక ప్రత్యేకించి నిజామాబాద్‌కు సంబంధించి పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానంటూ హామీనిచ్చి ఎంపీగా గెలిచిన అరవిందుడు ఆ హామీని నెరవేర్చలేక అభాసుపాలవుతున్నారు.
ఈ క్రమంలోనే ఆయన నోటి దురుసుతో విచిత్రకరమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారితోపాటు మిగతా నాయకాగ్రేసరులేం తక్కువ తినలేదు. తగ్గేదే లే... అంటూ వీలు చిక్కినప్పుడల్లా బూతు పురాణంతో తమ నోటికి పని చెబుతున్నారు. ఒకవైపు మునుగోడులో ఓటమి పాలవటం.. మరోవైపు ఎమ్మెల్యేల ఎర కేసులో అడ్డంగా దొరకటం, ఆ పైన సిట్ విచారణ ముమ్మరం కావటం తదితర పరిమాణాల నేపథ్యంలో ఈ వ్యక్తిగత కామెంట్ల దాడి మరింత పెరిగింది. మునుగోడులో ఓడినప్పటికీ తెలంగాణలో బలీయమైన శక్తిగా ఎదగాలన్న ఆశ, ఆకాంక్ష నుంచి బీజేపీ వెనక్కు తగ్గలేదు. అందుకోసం అది 'చేయాల్సిన' పనులన్నింటినీ చేసి తీరుతుంది. ఈ క్రమంలో మొన్నటి ఉప ఎన్నికలో ఆ పార్టీ గూబ గుయ్యుమనిపించిన ప్రజానీకం... మున్ముందు మరింత చైతన్యంతో వ్యవహరించాలి. అప్పుడే ఈ నోటి దూలలకు, విచిత్ర, వికృత రాజకీయ విన్యాసాలకు చెక్ పెట్టగలం.