Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యాయం అందరికీ ఒకటే. చట్టం ముందు అందరూ సమానులే. వంటి మాటలు పదే పదే వింటూ ఉంటాం. కానీ, పరిశీలించి చూస్తే అవి అసత్యాలు అనిపించక మానదు. బీమా కోరేగావ్ కేసులో నాలుగేండ్లుగా నిర్బంధంలో ఉన్న మానవ హక్కుల కోసం పోరాడే వారికి, న్యాయవాదులకు, రచయితలకు, మేధావులకు, విద్యావేత్తలకు బెయిలు మంజూరు చేయడానికి మాత్రం ఎక్కడలేని చిక్కులు అడ్డు పడుతుంటాయి. ఈ కేసులోనే అరెస్టయిన స్టాన్‌స్వామి చివరకు నిర్బంధంలో ఉండగానే మరణించారు. అరెస్టయిన 16మందిలో ఒకరైన మానవ హక్కుల కార్యకర్త గౌతం నవలఖాను తలోజా జైలులో కాకుండా గహ నిర్బంధంలో ఉంచడానికి సుప్రీంకోర్టు గత గురువారమే అంగీకరించడం ఆ వెంటనే 48గంటల్లో ఆయనను జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చాలని కూడా ఆదేశించింది. న్యాయం, చట్టం అందరికీ ఒకటే అన్నది వాస్తవమే అయితే నవలఖాను జైలుగోడలు దాటి ఐదారు రోజులు అయి ఉండేది. కానీ, ఆయన మరోసారి అత్యున్నత న్యాయస్థానం తలుపు తట్టాల్సి వచ్చింది.
అదే లైంగిక దాడులు, హత్య ఆరోపణల కింద జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు సునాయాసంగా పెరోల్ వస్తుంది. బెయిలూ వస్తుంది. 2002 నాటి గుజరాత్ మారణకాండ సమయంలో బిల్కిస్ బానో, ఆమె తల్లిపై, కిరాతకంగా అత్యాచారం చేసి, ఆమె మూడేండ్ల కూతురిని బండకేసి బాది చంపిన 11మంది దోషులు ''అమతోత్సవాల'' వేళ జైలు నుంచి రాచమార్యదలతో విడుదలవుతారు. మహమ్మద్ ప్రవక్తను తూలనాడిన కేసులో అరెస్టయిన తెలంగాణా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిలు మంజూరు అవుతుంది. విద్వేష ప్రసంగాలకు పేరుమోసిన యతి నరసింగానంద బెయిలు షరతులను ఎన్నిసార్లు ఉల్లంఘించినా పోలీసులు పట్టించుకోరు. ఆ విషయాన్ని న్యాయస్థానం దష్టికి తీసుకెళ్లరు. అలాంటప్పుడు నిర్దోషిగా తేల్చకుండా బెయిలు మంజూరు చేయడంలో ఆంతర్యం ఏమిటో అంతుపట్టదు.
నిజంగానే బెయిలు ఒక హక్కు. కానీ నాలుగేండ్లకుపైగా కోరేగావ్ కేసులో నిర్బంధంలో ఉన్నవారికి బెయిలు ఎందుకు మంజూరు కాదో అన్నది అంతు చిక్కని ప్రశ్న. ప్రసిద్ధ కవి వరవరరావు పరిస్థితీ అదే. ఎనిమిదిపదులు దాటిన వరవరరావుకు ఆరోగ్య కారణాలవల్ల బెయిలు కోసం ఎంత పోరాడవలసివచ్చిందో తెలియనిది కాదు. కాన్సర్ వ్యాధి బాధితుడైన 73ఏండ్ల గౌతం నవలఖాను, స్టాన్ స్వామికి పట్టిన గతే తనకూ పట్టగూడదనుకున్నారు. అందుకే తనను కనీసం గృహనిర్బంధంలో ఉంచండి అని మొరపెట్టుకుంటే గత బుధవారం సుప్రీంకోర్టు కరుణించింది. కానీ విధించిన షరతులు పరిశీలిస్తే అవి ఎంత కఠినమైనవో అర్థం అవుతుంది. జైలు ఉన్నప్పుడు ఆయన చదువుకోవడానికి హాస్యరచయిత ఉడ్‌హౌజ్ పుస్తకాన్ని ఆయన కుటుంబసభ్యులు పంపిస్తే జైలు అధికారులకు అది అత్యంత ప్రమాదకరంగా భావించి ఆయనకు అందజేయలేదు. ఇది హాస్యాస్పదంగా ఉంది అని స్వయంగా న్యాయమూర్తులే వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. దానివల్ల ఆయనకు కలిగిన ప్రయోజనం ఏమీలేదు. నవలఖాను తీవ్రమైన నొప్పితో బాధపడ్తున్నా కనీసం ఆయన కూర్చోవడానికి ఓ కుర్చీ అయినా ఏర్పాటు చేయలేదు. ఆయన కళ్లజోడు ఎవరో దొంగిలిస్తే, కుటుంబసభ్యులు మరో కళ్లజోడును అందించడానికి కూడా జైలు అధికారులు అంగీకరించలేదంటే మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా అన్న సందేహం కలగక మానదు. నిందితులు జైలులో ఉన్నప్పుడు కనీస వసతులైనా ఉండేట్టు చేయడం ఈ కేసును కొనసాగిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ బాధ్యత అని న్యాయమూర్తి శుక్రే ఎన్ఐఏకు చురకలంటించారు. 48గంటలలోగా ఆయనను గహ నిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గత వారమే ఆదేశించారు. ఎన్ఐఏ దానిని అమలు చేయకపోవడానికి కుంటి సాకులే కారణమన్న వాస్తవాన్ని సర్వోన్నత న్యాయస్థానం గ్రహించింది. కనుకనే ఎన్ఐఏ పని తీరును తూర్పారపట్టింది. కేంద్ర హౌంమంత్రి కనుసన్నలలో ఉండే ఎన్ఐఏ న్యాయబద్దంగా కాకుండా రాజకీయ లబ్ధి కోసమే పని చేస్తుందనడానికి ఇంత కంటే వేరే రుజువులేమి అవసరం లేదు. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను న్యాయమూర్తులు నిలదీసిన తీరు చూస్తే భవిష్యత్తుపై ఆశలు పూర్తిగా ఆవిరి కాలేదన్న నమ్మకాన్ని సుప్రీంకోర్టు కల్గిస్తోంది. తాజాగా 24 గంటల్లో తమ ఆదేశాలు అమలులోకి రావాలని సుప్రీంకోర్టు హుకుం జారీచేసింది. ఏం చేస్తారో చూడాలి. ఇదీ మన న్యాయం!