Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిన్నా మొన్నా కొన్ని సంస్థల్లో సిబ్బంది తొలగింపు వార్తలు, నేడు గూగుల్ ప్రకటన, రేపు ఏ కంపెనీ ఎందరిని తొలగిస్తుందో తెలవదు. ఈ ప్రకటనల నడుమ హైదరాబాద్‌లో అమెజాన్ కంపెనీ డేటా కేంద్రంలో వేలాది మందికి ఉపాధి కబురు. ఈ పరిస్థితిలో ఇది నిజంగా అమలు జరుగుతుందా! ఒక వైపు ఆర్థిక మాంద్యం గుబులు-మరోవైపు లాభాల వేటలో కంపెనీల కొత్త కేంద్రాల ఏర్పాటు! ప్రపంచంలో ఏం జరుగుతోంది? వర్తమాన సంవత్సరంలో ఇంతవరకు ప్రపంచంలో 853 టెక్ కంపెనీలు 1,37,492 మందిని తొలగించినట్లు తాజా సమాచారం. అదే కరోనా మహమ్మారి తలెత్తినప్పటి నుంచి చూస్తే 1,388 సంస్థలు 2,33,483 మందిని ఇంటికి పంపాయని లేఆఫ్స్ డాట్ ఫై అనే సంస్థ వెల్లడించింది. ఐటి రంగంలో పని చేస్తున్న వారికి, ఉపాధికోసం చూస్తున్న వారికి 2022 సంవత్సరం ఒక పీడకలగా మిగిలిపోనుంది. ప్రస్తుతం ఈ తొలగింపులన్నీ ధనిక దేశాల్లోనే జరుగుతున్నప్పటికీ మన దేశానికి మినహాయింపు ఉంటుందని చెప్పలేం. నవంబరు తొలిపక్షం నాటికి అమెరికాలో ఫేస్బుక్, ట్విటర్, సేల్స్‌ఫోర్స్, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలు 73వేల మందిని తొలగించాయి. హెచ్‌పి, అమెజాన్, గూగుల్ వంటి సంస్థల సంఖ్యలను కలుపుకుంటే ఇంకా పెరుగుతాయి.
లాభాలు తగ్గకుండా కంపెనీలు చేసే సవరింపుల్లో భాగంగా 2023లో కూడా కొత్త తొలగింపులు కొనసాగవచ్చని అనేక మంది సీఇఓలు చెబుతున్నారు. తమ కంపెనీలో సరిగా పనిచేయని పదివేల మందిని (మొత్తం సిబ్బందిలో ఆరుశాతం) తొలగిస్తామని గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ప్రకటించింది. ఒక్కో కంపెనీ ఇలా ఒక్కోసాకును ముందుకు తెస్తోంది. మన దేశంలో బైజూస్, వేదాంతు, అన్అకాడమీ వంటి 44 అంకుర సంస్థలు ఇప్పటికే 16వేల మందికి ఉద్వాసన పలికాయి. గత పన్నెండు నెలల్లో 61శాతం మంది పర్మనెంటు సిబ్బందిని ఇంటికి పంపాయి, వచ్చే ఏడాది, ఏడాదిన్నర తరువాత పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని చెబుతున్నారు.
పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభానికి గురైనపుడల్లా కార్మికవర్గం మీద దాని భారాలను మోపి తాను తప్పించుకొనేందుకు చూస్తుంది. 2008లో తలెత్తిన సంక్షోభం తరువాత కూడా అదే జరుగుతోంది. దానిలో భాగంగా ఐటి కంపెనీలన్నీ రోబో ప్రోసెస్ ఆటోమేషన్ (ఆర్పీఏ) వైపు కేంద్రీకరించాయి. ఇది ఏదో ఒక దేశానికే పరిమితం కాదు. బాంక్ ఆఫ్ అమెరికా గతంలో ఒక విశ్లేషణలో పేర్కొన్నదాని ప్రకారం 2022 నాటికి మన దేశంలోని కోటీ 70 లక్షల ఐటి, ఐటి సంబంధిత ఉద్యోగాల్లో 30లక్షలు రద్దవుతాయని అంచనా వేసింది. నిజంగా అది జరిగిందా లేదా అంటే మరో సంస్థ లేదా ప్రభుత్వం విశ్లేణ వెలువడే వరకు అవుననీ చెప్పలేం, కాదనీ అనలేం. పరిశ్రమల్లో కార్మికుల బదులు రోబోలు పని చేస్తాయి. ఐటి రంగంలో రోబో ప్రాసెస్ అంటే ఇంజనీర్ల బదులు రోబోలు పని చేస్తాయని కాదు, ప్రోగ్రామ్స్‌లో చేసే మార్పులతో ఎక్కువ మంది సిబ్బందితో పనిలేకుండా చేస్తాయి. ఈ క్రమం గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. మరోవైపు కరోనా ప్రభావం తగ్గిన తరువాత తలెత్తిన డిమాండ్‌ను సొమ్ము చేసుకొనేందుకు అనేక కంపెనీలు సిబ్బందిని తీసుకున్నాయి, ఇప్పుడు ఆ గిరాకీ కొనసాగుతుందనే నమ్మకం లేదు, దానికి తోడు మాంద్యం సూచనలు రోజు రోజుకూ బలపడుతున్నాయి.
ఒక అంచనా ప్రకారం 2022లో ఆర్పీఏ సాఫ్ట్వేర్ 20శాతం పెరుగుతుందని, అందుకోసం కంపెనీ 290 కోట్ల డాలర్లను ఖర్చు చేయనున్నట్లు అంచనా వేసింది. ప్రపంచమంతటా 2023లో ఈ సాఫ్ట్వేర్ మార్కెట్ రెండంకెల వృద్ధి సాధిస్తుందని పేర్కొన్నది. అంటే అది పెరిగే కొద్దీ తీసివేతలు మరింతగా ఉంటాయి, కొత్త అవకాశాలు తగ్గుతాయి. ఆర్పీఏ సాఫ్ట్‌వేర్‌తో పని చేసే కంప్యూటర్ల మీద పనిచేసేందుకు సాంకేతిక అర్హతలున్నవారే ఉండనక్కరలేదు. ఇప్పుడు ప్రపంచమంతటా కంపెనీలన్నీ ఆర్పీఏ లాభ నష్టాల గురించి మదింపు చేసుకుంటున్నాయి.
పశ్చిమ దేశాల్లో ఆర్థికరంగంలో సంభవించే మార్పుల పరిణామాలు, పర్యవసానాల గురించి సమాచారం ఎక్కువగా ఉంటుంది, విశ్లేషణలు కూడా వెంటనే వెలువడతాయి. మన దేశంలో దానికి విరుద్దం. సమాచార ప్రభావం ఎక్కడ తమ ఎన్నికల లబ్ది మీద పడుతుందో అని అధికారంలో ఉన్నవారు తొక్కి పట్టటం, ప్రభావాన్ని తక్కువగా చూపటం జరుగుతోంది. ఉదాహరణకు 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు నాలుగు దశాబ్దాల రికార్డును నిరుద్యోగం బద్దలు కొట్టిందని సమాచారం తెలుపగా దాన్ని వెల్లడించకుండా కేంద్ర ప్రభుత్వం తొక్కిపట్టింది. తీరా అది అనధికార మార్గాల ద్వారా బహిర్గతం కావటంతో అది తప్పుల తడక అని దాన్ని నమ్మవద్దంటూ కేంద్రం చెప్పింది. తీరా ఎన్నికలు ముగిసిన తరువాత అదే వాస్తవమంటూ ఆ విశ్లేషణను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఐటి కంపెనీల్లో జరుగుతున్న లేఆఫ్‌లు, తొలగింపులు ప్రధానంగా అమెరికాలో జరుగుతున్నాయి. ఆర్థిక మాంద్యం మహా సంక్షోభంగా మారినప్పుడు ప్రతి దేశాన్ని ఆవహిస్తుంది.