Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక వివాదాన్ని పరిష్కరించటం చేతగాని అమెరికా ప్రభుత్వం... మూడు సంవత్సరాలుగా వేచి చూసిన కార్మికులు తలపెట్టిన సమ్మెను అణచివేసేందుకు ఏకంగా పార్లమెంటునే రంగంలోకి దించింది. దీనికి ప్రతిపక్ష రిపబ్లికన్లు కూడా వంతపాడారు. అధికార డెమోక్రటిక్ పార్టీ కార్మిక పక్షపాతి అని వర్ణిస్తున్నవారు ఈ తీరుతో విస్తుపోతున్నారు. ఈనెల తొమ్మిది నుంచి తలపెట్టిన రైల్వే సమ్మెను అడ్డుకొనేందుకు జో బైడెన్ సర్కార్ పార్లమెంటులో చట్టాన్ని చేసింది. ప్రభుత్వ మధ్యవర్తిత్వంలో సెప్టెంబరులో రైల్వే కంపెనీలు ప్రతిపాదించిన ఒప్పందాన్ని కొన్ని కార్మిక సంఘాలు తిరస్కరించాయి. దీంతో దాన్ని బలవంతంగా రుద్దేందుకు పార్లమెంటు దిగువ సభలో 290-137 మెజారిటీతో ఒక బిల్లును ఆమోదించారు. డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీలకు చెందిన ఇరు పక్షాలూ సమ్మెను భగం చేసేందుకే పూనుకున్నందున ఎగువ సభ సెనెట్ ఆమోదం కూడా లాంఛనమే.
ఐరోపాలోని బ్రిటన్‌తో సహా అనేక దేశాల్లోని రైల్వే కార్మికులు కూడా పోరుబాట పట్టారు. ఇప్పటికే కొన్ని చోట్ల సమ్మెలు జరపగా ఈ నెలలో మరికొన్ని జరిపేందుకు ముందుకు సాగుతున్నారు. కరోనా సాకుతో అనేక మంది సిబ్బంది తొలగింపు, సాధారణ స్థితి ఏర్పడిన తరువాత కూడా తొలగించిన మేరకు కొత్త వారిని తీసుకోకపోవటంతో పని భారం పెరిగింది. పాత ఒప్పందాల గడువుతీరిన తరువాత కూడా కొత్త వాటిపై సంప్రదింపుల పేరుతో సాగదీస్తున్నారు. దీనికి తోడు పులి మీద పుట్రలా పెరుగుతున్న దవ్య్రోల్బణం, ధరల పెరుగుదలతో నెల తిరక్కుండానే జేబులు ఖాళీ అవుతుండటంతో నిజవేతనాలు పడిపోయి విధిలేని స్థితిలో కార్మికులు వీధుల్లోకి వస్తున్నారు. జనానికి ఇబ్బంది కలగకుండా విరామం ఇస్తూ వారానికి ఒక రోజు లేదా రెండు మూడు రోజుల సమ్మెలతో జరుపు తున్న ఆందోళనను పాలకులు పెడచెవిన పెడుతు న్నారు. ఇదే వైఖరి కొనసాగితే నిరవధిక సమ్మెలకు దిగినా ఆశ్చర్యం లేదు.
ప్రతి దేశంలో పాలకులు పాడుతున్న పాచిపాటనే అమెరికా అధినేత జో బైడెన్ కూడా పాడాడు. రైల్వే కార్మికులు సమ్మె జరిపితే ఇతర కార్మికులు, వారి కుటుంబాలు ఇబ్బంది పడతాయంటూ గుండెలు బాదుకుంటూ రెచ్చగొట్టాడు. సమ్మెతో ఇంథనం, ఔషధాలు ఇతర నిత్యావసర వస్తు సరఫరాకు ఆటంకం కలుగుతుందని, రోజుకు రెండు బిలియన్ డాలర్ల మేరకు ఆర్థిక వ్యవస్థకు నష్టం అంటూ కొందరు అప్పుడే చిట్టాలు రూపొందించి జనాన్ని భయపెట్టేందుకు పూనుకున్నారు. నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా 24శాతం వేతనం పెంపుదల అని చెబుతున్నప్పటికీ ఆరోగ్య బీమా ఖర్చు, ఇతర కోతలు పోను పదిహేనుశాతం కంటే ఉండదని కార్మికులు చెబుతున్నారు. దిగజారిన పని పరిస్థితుల కారణంగా ఎయిర్‌లైన్స్ సిబ్బంది కూడా ఆందోళనకు సిద్దం అవుతున్నారు. కరోనాకు ముందు నుంచే కొత్త ఒప్పందం కోసం డిమాండ్ చేస్తుండగా పెడచెవిన పెట్టినందున గత నెలలో కొన్ని చోట్ల ధర్నాలు చేశారు. ఇంతవరకు ఎక్కడాలేని విధంగా ఒకే పైలట్‌తో విమానాలను నడిపేందుకు సిబ్బంది అంగీకరించాలని కంపెనీలు వత్తిడి తెస్తు న్నాయి. అమెరికాలో ఎనిమిది శాతం ద్రవ్యోల్బణం పెరిగితే ఆ పేరుతో విమాన ఛార్జీలను ఏకంగా 42.9శాతం పెంచి ప్రయాణీకులను కూడా దోపిడీ చేస్తున్నాయి. కరోనా పేరుతో సిబ్బందిని తొలగించకూడదంటూ ప్రభుత్వం ఇచ్చిన 54బిలియన్ డాలర్ల సబ్సిడీ పొందిన కంపెనీలు 80వేల మందికి ఉద్వాసన పలికాయి.
ఐరోపాలోని బెల్జియం రైల్వే కార్మికులు కూడా ఆందోళన బాటపట్టారు. మొత్తం సిబ్బంది ఒక రోజు సమ్మె జరపగా డ్రైవర్లు మూడు రోజులు సమ్మె చేశారు. పనివత్తిడి ఎంతగా ఉందంటే డ్రైవర్లు నడుపుతూనే భోజనం చేయాలి, బాత్రూమ్కు పోవాలంటే రెండు స్టేషన్ల మధ్య త్వరగా పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది. సిబ్బంది కొరత కారణంగా రైళ్లను రద్దు చేస్తున్నారు. బ్రిటన్‌లో ఈ నెలలో ఎనిమిది రోజులు ఆందోళన చేపట్టేందుకు రైల్వే సిబ్బంది పూనుకున్నారు. దీంతో ఐరోపాలోని ఇతర దేశాలకు వెళ్లే రైళ్ల మీద కూడా ప్రభావం పడనుంది. ఆస్ట్రియాలో ఒక రోజు హెచ్చరిక సమ్మె చేశారు. ఫ్రెంచి రాజధాని పారిస్‌లో మెట్రో సిబ్బంది, ఇటలీలోని రైల్వే, మెట్రో సిబ్బంది కూడా ఆందోళనలు జరుపుతున్నారు. బ్రిటన్‌లో ఈ ఏడాది అతి పెద్ద పారిశ్రామిక ఆందోళనగా వర్ణిస్తున్న లక్షలాది మంది పోస్టల్, కాలేజీ, విశ్వవిద్యాలయాల సిబ్బంది ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు.
మినీ బడ్జెట్ పేరుతో నూతన ప్రధాని రిషి సునాక్ ప్రకటించిన పధకాలేవీ వారి డిమాండ్లను పరిష్కరించేవిగా లేకపోవటంతో రానున్న రోజుల్లో మరింతగా ఆందోళనలు చెలరేగే అవకాశం ఉంది. నిజవేతనాలు పడిపోవటం, ఇటీవలి ధరల పెరుగుదల కార్మికుల జీవన పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. కార్మికవర్గం కదులుతున్న తీరును చూసిన కార్పొరేట్ పత్రిక ది టైమ్స్ పాలకవర్గాలను హెచ్చరించింది. నిజంగా బ్రిటన్ చలికాలంలో నూతన అసమ్మతిని ఎదుర్కొంటున్నదని అనుకుంటే అది నిన్ననే ప్రారభమైంది. కార్మిక సంఘాలలో నూతన తరం మిలిటెంట్స్ వచ్చారని నమ్మితే ఇది ప్రారంభం మాత్రమే అని కూడా అది హెచ్చరించింది. ఇది ఒక్క బ్రిటన్‌కే అనుకుంటే పొరపాటు, అన్ని దేశాల పాలకవర్గ బాకాల సందేశాల సారం ఇదే!