Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్పొరేట్లకు రాయితీల వర్షం కురిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం పేదలకు మాత్రం ఊపిరి కూడా అందకుండా చేస్తోంది. వారికి ఎంతో ప్రయోజనకారిగా ఉన్న ఉపాధి హామీ చట్టం ఉసురు తీసేందుకు ప్రయత్నించడం ఆందోళనకరం. నరేంద్ర మోడీ గద్దెనెక్కినప్పటి నుండి 'ఉపాధి' పట్ల చిన్నచూపే చూస్తున్నారు. వామపక్షాలు అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి చేసి తీసుకొచ్చిందే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. వ్యవసాయ కార్మికులు, పేద రైతులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ చట్టం రూపుదిద్దుకుంది. కనీసం వంద రోజులైనా పని కల్పించాలని, కోరుకున్న వారందరికీ పని ఇవ్వాలనేది ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఈ చట్టం కాంగ్రెస్ వైఫల్యాలకు సజీవ స్మారక చిహ్నమని, చాలా ఏండ్లు అధికారంలో ఉన్న తర్వాత పేదవాడికి కొన్ని రోజులు గుంతలు తవ్వే పని అప్పగించడమే వారు చేయగలిగిందంటూ 2015లోనే ప్రధాని నరేంద్రమోడీ ఎద్దేవా చేశారు. నాటి నుంచి ఈ చట్టానికి తూట్లు పొడిచేందుకు కాషాయ సర్కారు చేయని ప్రయత్నం లేదు. అందులో భాగమే తాజాగా గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి అమర్జిత్ సిన్హా నేతృత్వంలోని కమిటీ నియామకం. ఈ చట్టంలో తీసుకురావాల్సిన మార్పులు, కేటాయించే పనులు, వాటిలో తీసుకురావాల్సిన మార్పులు, ఖర్చులు, రాష్ట్రాల మధ్య తేడాలు లాంటి అంశాలను పరిశీలిస్తారని సర్కారు చెబుతోంది. కానీ, అసలు లక్ష్యాలు వేరుగా ఉన్నాయని పరిశీలకుల భావన.
తొలుత దేశవ్యాప్తంగా వంద జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయగా, 2008-2009 నుంచి దేశమంతటికీ విస్తరించారు. నాటి నుంచి 2014 వరకూ గ్రామీణ ప్రాంత కుటుంబాల్లో 30శాతం మందికి ఉపాధి లభించగా, మోడీ సర్కారు వచ్చిన తరువాత 2014 నుంచి 2020 వరకూ చూస్తే 26శాతం మందికే ఉపాధి కల్పించింది. ఉపాధి హామీ పనుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 18శాతం మంది తిరస్కరణకు గురవుతున్నారని అధికారిక గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ తొలి అర్ధ సంవత్సరంలోనే కోటిన్నర మందికి ఉపాధిని తిరస్కరించింది కేంద్రం. దరఖాస్తు చేసుకున్న అందరికీ ఉపాధి కల్పించాలన్న చట్టం లక్ష్యానికి మంగళం పాడింది. మరోవైపు ఏదో ఒక కొర్రీ పెడుతూ పథకం నిధుల చెల్లింపులో జాప్యం చేస్తూ ఉండటం షరామామూలుగా మారింది.
ఉపాధి హామీ చట్టం ప్రకారం కార్మికుల మస్తరు రోల్స్‌లో నమోదు చేసిన 15రోజుల్లో వేతనం చెల్లించాల్సి ఉంది. ఈ 'ఉపాధి' పీక నులమాలని చూస్తున్న కేంద్రం సకాలంలో నిధులు చెల్లించకపోవడంతో, కూలీలకు నెలల తరబడి బకాయిలుంటున్నాయి.
కరోనా కాలంలో వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలకు ఈ చట్టం సంజీవనిగా మారింది. నగరాల్లో పనులు లేక, బతకలేక కాలినడకన బయల్దేరిన కష్టజీవికి స్వగ్రామంలో ఇంత కూడు పెట్టింది ఈ చట్టమే. కానీ, 2022-23 బడ్జెట్లో ఈ పథకానికి కేవలం రూ.73వేల కోట్లే కేటాయించారు. ఇది 2021-22 సవరించిన అంచనాల కంటే 25 శాతం తక్కువ. వామపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు త్రిపురలో పట్టణ ప్రాంతాల్లో సైతం ఉపాధి హామీ అమలు చేశారు. దేశవ్యాప్తంగా పట్టణాల్లో ఈ చట్టాన్ని అమలు చేయాలని వామపక్షాలు, ప్రగతిశీలురు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా నియమించిన అమర్జిత్ సిన్హా నేతృత్వంలోని కమిటీకి ఇచ్చిన మార్గదర్శకాలను బట్టి చూస్తే ఈ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలే కనిపిస్తున్నాయి. ఈ కమిటీ జనవరి నాటికి నివేదిక ఇస్తే, బడ్జెట్లో ఈ చట్టానికి కేటాయిస్తున్న నిధులకు మరింతగా కోతపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
కేంద్రం లెక్కల ప్రకారమే దేశంలో 23 కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారు. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల సంఖ్య పెరుగుతూనే ఉందని గణాంకాలన్నీ ఘోషిస్తున్నాయి. అయినప్పటికీ కేంద్రం పేదల రక్తం పీల్చి పెద్దలకు పంచే కుట్రలకే పూనుకొంటోంది. ఈ కుట్రల్లో భాగమే ఉపాధిహామీపై అమర్జిత్ సిన్హా కమిటీ. కేంద్రం కుతంత్రాలను తిప్పికొట్టి ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకునేందుకు వ్యవసాయ కార్మికులు, పేదలతోపాటు పట్టణ పేదలు కూడా ఉద్యమించాలి.