Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంపదంతా ఒకచోట పోగుబడిన ప్రస్తుత దశలో సగటు జీవికి అడుగడుగునా ఆకలి, పేదరికమే మిగిలాయి. కానీ, భారత్‌లో పేదరికం 52 నుంచి 16శాతానికి తగ్గిందని కేంద్ర ప్రభుత్వం గప్పాలు కొడుతోంది. తాము అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు పేదరికాన్ని తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని కోతలు కోస్తోంది. అంతర్జాతీయ సమాజం మాత్రం మోడీ ప్రభుత్వ గొప్పలను గోబెల్స్ ప్రచారంగా కొట్టిపారేసింది. అసలు పేదరికాన్ని అంచనా వేయడానికి భారత ప్రభుత్వం అనుసరిస్తున్న కొలమానాలేంటి? అని నిపుణులు కేంద్ర సర్కార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. నాటి ప్రణాళిక సంఘం ఉపాధి హామీ పథకం అమలును పేదరికం ప్రాతిపదికగానే చేసింది. కానీ, ఆ ప్రమాణాలను మోడీ సర్కార్ ఎప్పుడో తుంగలో తొక్కింది. అంతర్జాతీయ నిపుణుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన కేంద్ర పెద్దలు ''ఎగుమతులలో కొత్త సినిమా కలెక్షన్స్‌తో పోటీ పడుతున్నామని'' మన దేశ ఎగుమతులు గురించి జబ్బలు చరుచుకోవడం విడ్డూరం కాకపోతే మరేమిటి?
భారత్‌లో రోజూ 2 డాలర్ల ఆదాయంతోనే కాలాన్ని ఈడుస్తున్న జీవితాలు కోట్లల్లోనే ఉన్నాయి. ఇప్పటికే కార్మికులకు రోజూ రూ.200 చొప్పున నెలకు గరిష్టంగా 20రోజుల పని దొరకడం కూడా గగనమే. ఇంటికి ఒకరికో, మహా అయితే ఇద్దరికో పని దొరుకుతుంది. అది పదిహేను ఇరవై రోజులే. మిగతా రోజులు పస్తులుండాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులున్న దేశంలో కేంద్ర పెద్దలు ఊదరకొడుతున్న సంక్షేమ పథకాల్లో వీరి క్షేమం ఎక్కడుంది? అంతా క్షామమే ఉన్నది. పేదరికాన్ని కేవలం ఆదాయం కొలబద్దగానే కాకుండా దయనీయమైన ఆరోగ్యం, అక్షరాస్యత, పనిలో వెనుకబాటుతనం వంటి అంశాల ఆధారంగా గణించాలి. ప్రపంచ పేదరికాన్ని 2030 నాటికి మూడు శాతం మేర తగ్గించాలన్న ఐరాస లక్ష్యం ఇప్పటిలో నెరవేరదని ప్రపంచ బ్యాంకు ఇప్పటికే స్పష్టం చేసింది. భారతదేశంలో దారిద్య్రం బహువిధాలుగా ఉందని గతేడాది నవంబర్‌లో ''నిటి అయోగ్'' ఇచ్చిన నివేదిక స్పష్టం చేసింది. పోషకాహారం, శిశుమరణాలు, పారిశుధ్యం, తాగునీరు, గృహవసతి వంటి 12అంశాల ఆధారంగా అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి అందించిన నివేదిక ఇది. దేశంలో 25శాతంమంది పేదరికంలోనే మగ్గుతున్నారని ఆ నివేదిక సారాంశం. నాయకుల మాటలకు, నిటి అయోగ్ నివేదికలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు.
వాతావరణ మార్పుల వల్ల వచ్చే దశాబ్దంలో అదనంగా 10కోట్ల మంది దుర్భర దారిద్య్రంలోకి జారిపోతారని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. దీన్ని ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి. భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా మారుతోందని పాలకులు బాకా బజాయిస్తుంటే, దేశంలో ఆకలి కేకలు పెరుగుతున్నాయని వారి ప్రభుత్వ నివేదికలు, విశ్లేషణలే స్పష్టం చేస్తున్నాయి. కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అస్తవ్యస్త ఆర్థిక విధానాలు, ఆహార పదార్ధాల పై జీఎస్టీ విధింపు, నిరుద్యోగం సమస్య వంటివి ప్రజలను తీవ్ర పేదరికంలోకి నెడుతున్నాయి. పాలకులు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ప్రయత్నాలు చేయకుండా అధికార కాంక్షతో మతోన్మాద చర్యలకు పూనుకోవడమే ఈ పరిణామాలకు కారణం అన్నది వాస్తవం. దేశంలో తీవ్రంగా నెలకొన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంపై ఏనాడూ దృష్టి పెట్టలేదు. కొత్త పరిశ్రమలను స్థాపించకపోగా, ఉన్న పరిశ్రమలను బడా పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను సైతం నిర్వీర్యం చేస్తున్నారు. భారతదేశం నేడు ప్రపంచంలోనే అత్యధిక పేదల కేంద్రీకరణను కలిగి ఉంది. దేశ ప్రజలు ఏమాత్రం సంతృప్తికర జీవనం సాగించలేనప్పుడు ఏలినవారు తమకు కావలసిన రీతిలో వృద్ధి గణంకాలను వెల్లడించినా ఉపయోగం ఉండదు. పాలకుల ఉత్సవాలను నిత్య జీవనానికి సతమతమయ్యే జనం పట్టించుకోరు. వంది మాగద మీడియా వీరికి వంతపాడినా ప్రజలు ఎంతో కాలం నమ్మరు. గతంలో ఏనాడూ లేనంతగా నిరుద్యోగం తాండవిస్తోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోయి సరైన ఆదాయం లేక సతమతమవుతున్న వారికి కనీసం ఆహార భద్రత కల్పించడానికి ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం చర్యలను తీసుకోవాలి. ప్రజలు స్వయం సమృద్ధి పొందాలి. చిత్తశుద్దీ, ఆచరణ లేకుండా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ అంటూ ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, కొత్త కొత్త ఆకర్షణీయమైన నినాదాలిచ్చినా ప్రయోజనం ఉండదు. 'సబ్కా సాథ్, సబ్కా వికాస్' అన్నది కేవలం నినాదమే కానీ, నిజం కాదని మరోసారి రుజువైంది.