Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తను పుండై... ఎందరికో పండై...' వేశ్యల జీవితాలను, వారి అందమైన కన్నుల వెనకున్న కన్నీటి పొరల యదార్థ జీవితగాథలను వివరిస్తూ అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవితా వాక్కులివి. 'ఏ మహిళా కావాలని వ్యభిచారిగా మారదు.. ఏ ఒక్క అమ్మాయీ తనంతట తానుగా ఆ రొంపిలోకి దిగదు...' వేశ్యా వృత్తి గురించి రాసేటప్పుడు ఒక రచయిత పేర్కొన్న అంశాలివి. నిజమే మరి... మహిళ కూడా మనిషే, ఆమెకూ మనసుంటుంది. దానికీ మనస్సాక్షనేది ఒకటుంటుంది. కానీ కుటుంబ సమస్యలు, వాటిలోంచి వచ్చే ఆర్థికావసరాలు, భౌతిక పరిస్థితులు... వెరసి కొందరు మహిళలను 'ఆ కూపంలోకి' దించుతాయి. ఆయా బలహీనతలను ఆసరాగా చేసుకున్న కొందరు మాఫియాగాళ్లు... వారిని వ్యభిచారంలోకి దింపి, ఆ స్త్రీల జీవితాలతో ఆటలాడుతూ... వారి శరీరాలతో వ్యాపారం చేస్తుంటారు. విశ్వనగరం హైదరాబాద్‌లో తాజాగా వెలుగు చూసిన అమానవీయ ఘటన ఆ కోవలోనిదే. ఒకరు కాదు, ఇద్దరు కాదు... పది మంది కాదు, వంద మంది కాదు, ఏకంగా 14,190 మందిని వ్యభిచారంలోకి లాగి వందల కోట్లు గడించారు కేటుగాళ్లు. ఉద్యోగం, ఉపాధి కోసం ఆశగా ఎదురు చూసే అభాగ్యురాళు... పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న అబలల బలహీనతలే ఈ దుర్మార్గులకు పెట్టుబడి. ప్రస్తుత పెట్టుబడిదారీ సమాజంలో ప్రతిదీ సరుకై పోయినట్టు ఆడవాళ్ల శరీరాన్ని కూడా వ్యాపారమయం చేసి పబ్బం గడుపుకుంటున్నారు ఈ నీచులు.
మన రాజధాని నగరంలో 17మందితో కూడిన ముఠా నిర్వహిస్తున్న భారీ సెక్స్‌రాకెట్‌ను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో సైబరాబాద్ పోలీసులు ఛేదించిన దరిమిలా విస్తుగొలిపే వాస్తవాలు బయట కొచ్చాయి. ఈ రాకెట్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని రాష్ట్రం, దేశం దాటి అంతర్జాతీయ స్థాయికి విస్తరించిందంటే ఆ ముఠా దందా ఎంత పెద్దదో విదితమవుతున్నది. ఇదే సమయంలో అమ్మాయిలతో ఆ గ్యాంగ్... డ్రగ్స్‌ను కూడా సరఫరా చేయించటం ద్వారా అది మరింత బరితెగిస్తూ తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగి స్తుండటం విస్తుగొలిపే అంశం. శరవేగంగా విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని, దాన్ని వాడుకుని... ఈ ముఠా సాగిస్తున్న అరాచకం పరాకాష్ఠకు చేరింది.
ఇక్కడే మనం ఒక విషయాన్ని నిశితంగా పరిశీలించాలి. అడుగడుగునా సీసీ కెమెరాలు, అత్యాధునిక నిఘా వ్యవస్థ, అంతర్జాతీయ స్థాయి కమాండెంట్ కంట్రోల్ రూమ్ అంటూ ఊదరగొట్టే మన ప్రభుత్వాధినేతలు... ఇప్పటిదాకా యథేచ్ఛగా సాగిన ఈ రాకెట్ గురించి ఏం చెబుతారు..? ఇన్నేండ్ల నుంచి ఈ వ్యవహారం కొనసాగు తున్నప్పటికీ అది బయటకు రాకుండా అడ్డుకున్నది ఎవరు..? రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి ఈ వ్యాపారం అంతర్జాతీయ స్థాయికి విస్తరించే దాకా మన సర్కారు ఏం చేస్తోంది..? ఇతర దేశాల యువతులను సైతం ఇక్కడకు రప్పించి... పడుపు వృత్తిలోకి దింపుతుంటే మన ఇంటిలిజెన్స్ విభాగం వారు కండ్లు మూసుకుని ఎందుక్కూర్చున్నారు..? ఇవన్నీ ఇప్పుడు శేష ప్రశ్నలుగా మిగిలాయి. ప్రభుత్వంలోని వారు, ఉన్నతాధికారులు వీటికి కచ్చితంగా సమాధానాలు చెప్పాలి.
ఏదేమైనా ఇంత పెద్ద రాకెట్‌కు సంబంధించిన గుట్టును రట్టు చేసి, వేలాది మంది యువతుల చీకటి జీవితాల్లో వెలుగులు నింపిన పోలీసులకు అభినందనలు తెలుపుతూనే... ఇక ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సర్కారు చర్యలు తీసుకోవాలని మనం డిమాండ్ చేయాలి. అందుకనుగుణంగా కార్యాచరణ రూపొందించాలి. అమ్మాయిల ద్వారా నిర్వహిస్తున్న డ్రగ్స్ అమ్మకాలను, వినియోగాన్ని నివారించేందుకు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాలి. మహిళా, యువజన సంఘాలు ఇందుకోసం నడుం బిగించాలి. పౌర సమాజం స్పందించాలి. పాఠశాల స్థాయి నుంచే ఆయా అంశాలపై విద్యార్థులకు చైతన్యం కలిగించాలి. కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఇలా ప్రజల్ని, యువతీ యువకుల్ని భాగస్వాములను చేయటం ద్వారా అలాంటి దందాలకు అడ్డుకట్ట వేయాలి. మత్తు పదార్థాల నుంచి యువతను దూరం చేసేందుకు వీలుగా ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కేరళ ప్రభుత్వాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి అమానవీయ ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. లేదంటే షరా మామూలుగా పేపర్లలో నాలుగు రోజులపాటు వార్తలు, ఛానళ్లలో ఓ వారంపాటు బ్రేకింగ్ న్యూస్‌లు, స్పెషల్ స్టోరీలు వస్తాయి తప్ప మనం ఆశించిన ప్రయోజనం ఒనగూరదు. ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది. అందుకే పౌర సమాజమా... బహుపరాక్.