Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరు చెప్పుకుంటున్నట్టు, మీడియా ఘోషిస్తున్నట్టు ఎన్నికల ఫలితాలేవీ ఏకదిశా ప్రవాహాలు కాదనీ, కాబోవనీ ప్రజలు మరోసారి నిరూపించారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నిటికీ తలా ఒక విజయాన్నీ, ఒక పరాజయాన్నీ అందించి ఓ ఉపశమనాన్నీ ఓ హెచ్చరికనూ జారీ చేశారు. ఢిల్లీలో జరిగినవి కార్పొరేషన్ ఎన్నికలే అయినా అది దేశ రాజధాని కావడం, ఒక రాష్ట్రానికి సరిపడే సంఖ్యలో ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనడం గమనించదగిన ఆంశం.
గుజరాత్లో 182 స్థానాలకుగాను 52శాతం ఓట్లు, 156 సీట్లతో బీజేపీ సాధించిన ఏడవ వరుస విజయం ప్రత్యేకతను కాదనలేంగానీ, ఇది వారి సుపరిపాలనకు పట్టం అని మాత్రం భావించలేం. ఎందుకంటే ఈ దశాబ్దాల పాలనలో అక్కడ వారు సాధించిన పురోగతికన్నా విద్య, వైద్యం, ఉపాధి, పేదరికం, భద్రత మొదలైన సమస్త మానవాభివృద్ధి సూచీలలో అధోగతే ఎక్కువ. పైగా మితిమీరిన అవినీతి, సామాజిక అసమానతలు, అశాస్త్రీయ భావాలకు నిలయంగా మారింది. అయినా ఈ విజయం ఎలా సాధ్యమైందీ? అంటే... అక్కడ దశాబ్దాలుగా అధికారపక్షం సుస్థిరపరిచిన మత విభజనలూ, సుదీర్ఘకాలంగా పెంచిపోషిస్తున్న వ్యాపార, పారిశ్రామిక వర్గాల మద్దతూ, తమ నియంత్రణలోని ప్రచార ప్రసార మాధ్యమాలే కారణంగా కనిపిస్తున్నాయి. పైగా ఈ సారి ఈ బీజేపీ విజయానికి మోడీ ఎంత కారణమో కేజ్రీవాల్ కూడా అంతే కారణమన్న విశ్లేషణలనూ తోసిపుచ్చలేం..! బీజేపీ ఓటింగ్ 49శాతం నుండి 52శాతానికి పెరగగా, కొత్తగా గుజరాత్ ఎన్నికల్లో ప్రవేశించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 13శాతం ఓట్లనూ 5 సీట్లనూ సాధించింది. అంటే అది చీల్చింది కాంగ్రెస్ ఓట్లనే అనేది సుస్పష్టం. వీటన్నింటికీ తోడు విధానపరంగా, వ్యూహాల పరంగా కాంగ్రెస్ వైఫల్యాలు ఉండనే ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీకి ప్రత్యామ్నాయ విధానాలేవీ ప్రజల ముందు ఉంచింది లేకపోగా, ప్రచారవ్యూహాల్లోనూ వెనుకబడింది. మోడీ, కేజ్రీవాల్ సహా ఆయా పార్టీల ప్రధాన నేతలంతా పోటాపోటీగా ప్రచార సభల్లో పాల్గొంటే, కాంగ్రెస్ ప్రచారంలో ఖర్గే మినహా ఆ స్థాయి నేతల జాడేలేదు.
అయితే హిమాచల్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ విజయం చిన్నదేమీ కాదు. అధికారపక్షాన్ని పాతిక స్థానాలకు పరిమితం చేసి 68స్థానాల్లో 40 గెలుచుకుంది. ఇక్కడ ఆప్ గెలుచు కుందేమీ లేకపోగా ఓటింగ్‌లో కూడా సాధించింది కేవలం ఒక్క శాతమే కావడం గమనార్హం. హిమాచల్‌లోనూ ప్రధాని సహా బీజేపీ నేతల ప్రచార హౌరూ, శక్తియుక్తుల కేంద్రీకరణ తక్కువేమీ కాదు. ఇది స్వయానా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా సొంత గడ్డ అన్న సంగతి మరువరాదు. అందుకే తమకే ప్రత్యేకమైన విభజన, విద్వేష రాజకీయాలూ, ఆర్థిక, అంగ బలాలకుతోడు వలదంటూనే అనేక ఉచితాలను కూడా ఎరగా వేసింది. అయినా ఓటమి తప్పలేదు. మరి గుజరాత్లో ప్రజలు ఉచితాలను ఓడించారని ప్రవచించిన అమిత్ షా దీనికే భాష్యం చెపుతారో వేచి చూడాలి! ఇంత చేసినా ఇక్కడ విజయం కాంగ్రెస్‌నే వరించందంటే కారణం ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు అది ఎంతోకొంత ప్రజా సమస్యల మీద స్పందించడమే. ప్రత్యేకించి నిరుద్యోగం, ఆపిల్ రైతుల సమస్యలపై కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలు ప్రభావం చూపాయి. కేంద్రం ప్రవేశపెట్టిన ''అగ్నిపధ్'' పథకం యువతలో కలిగించిన ఆగ్రహం కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. అదే సమయంలో గుజరాత్‌కు భిన్నంగా ఇక్కడ దివంగత కాంగ్రెస్ దిగ్గజం వీరభద్రసింగ్ సతీమణి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైన ప్రతిభాసింగ్తో కలిసి ప్రియాంకా గాంధీ కూడా ధీటైన ప్రచారం నిర్వహించారు. ఫలితంగా లభించిన ఈ విజయం కాంగ్రెస్‌కు పెద్ద ఊరట. అంతేకాదు, ప్రజలతో ఉండటం, ప్రత్యామ్నాయంగా నిలవటం ఎంత అవసరమో నేర్పే గుణపాఠం కూడా.
ఇక ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తీర్పు, బీజేపీ పదిహేనేండ్ల దుర్మార్గపాలనకు చరమగీతం. ఈ ఎన్నికల్లో కూడా తిరిగి గెలవడానికి బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదుగానీ, మతకలహాలతో, వీరి విద్వేష రాజకీయాలతో విసిగిపోయిన ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకీ అవకాశమిచ్చారు. ప్రతిపక్షం బలమైనదన్న విశ్వాసం ఏర్పడితే పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారనడానికి ఈ ఫలితం ఓ సంకేతం.
అంతిమంగా సారాంశంలో ఈ ఫలితాలన్నీ సూచిస్తున్న దొకటే. అపారమైన ఆర్థిక వనరులు, అంతులేని అధికార దుర్వినియోగం, అత్యధిక భాగం మీడియా మద్దతు ఎన్ని ఉన్నప్పటికీ... కమలనాథులు చెప్పుకుంటున్నట్టు బీజేపీ దుర్భేద్యమైనదీ కాదు, మోడీ సర్వశక్తిమంతుడూ కాదని తేల్చి చెపుతున్నాయి. ఇదేమీ కొత్త విషయం కూడా కాదు. గతంలో బెంగాల్, రాజస్థాన్, చత్తీస్ఘడ్ సహా దక్షిణాది రాష్ట్రాలన్నీ ఎప్పుడో నిరూపించాయి. సాగుచట్టాలపై రైతుల చారిత్రాత్మక విజయం కూడా ఇదే చెపుతోంది. ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా విధానపరమైన ప్రత్యామ్నాయాన్ని నిర్మించగలిగితే బీజేపీని ఓడించడం అసాధ్యమేమీ కాదనడానికి ఇంతకన్నా రుజువులేం కావాలి? అయినప్పటికీ బీజేపీ విజయాలకు మోడీని తిరుగులేని ప్రతీకగా కీర్తించే వారంతా హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ పరాజయాలకు సమాధానామేమిస్తారూ? పైగా మోడీ కూడా హిమాచల్ ఎన్నికల్లో ''వ్యక్తులెవరని చూడకండి. నన్ను చూడండి. పువ్వుగుర్తుకు ఓటేస్తే నాకేసినట్టే''నని చెప్పుకున్నారాయే! అయినా తప్పని ఈ ఓటమికి ఎవరిని బాధ్యుల్ని చేస్తారూ?