Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''డాలర్‌కి రూపాయి విలువ ఇప్పుడు 83.2కి పడిపోయింది. ఐసీయూకి చేరిన రూపాయిని ఇంటికి తీసుకురావడానికి ఏంచేస్తున్నారు? ఇంత క్షీణత నమోదు కావడం ఇదే మొదటిసారి, దీనిని ప్రభుత్వం గమనించిందా? పతనాన్ని నిలువరించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలేమిటి? ప్రభుత్వం వద్ద ఓ కార్యాచరణ ప్రణాళిక ఉందా?'' అని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి పార్లమెంట్లో హిందీలో ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పాల్సిన కేంద్ర మంత్రి రూపాయి పతనాన్ని పక్కకుపెట్టి రేవంత్‌రెడ్డి మాట్లాడిన భాషపై నోరుపారేసుకున్నారు. తన మాటల గారడీతో అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి కొత్త వివాదానికి తెర తీశారు. ''తెలంగాణ పార్లమెంట్ సభ్యులు 'కమ్జోర్ హిందీ' మాట్లాడతారని, వారికి నేను కూడా 'కమ్జోర్ హిందీ'లోనే సమాధానం ఇస్తానని తెలంగాణ ప్రజల హిందీ భాషను నిండు పార్లమెంట్లో అవమానించారు. తెలంగాణలో వారికి కూడా పార్లమెంట్ సభ్యులున్న విషయాన్ని కేంద్రమంత్రి మర్చిపోయినట్టు ఉన్నారు. అందుకే ఏకపక్ష వ్యాఖ్యలు చేసినట్టున్నారు.
ప్రధాని మోడీ మొదలు బీజేపీ అగ్రనేతలకు తెలంగాణపై అక్కసు వెళ్లగక్కడం, నిందించడం పరిపాటిగా మారిపోయింది. యాసంగి వడ్లు కొనుగోలు విషయంలో 'తెలంగాణ ప్రజలు నూకలు తినొచ్చుగా' అన్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఎకసెక్కాలాడిన విషయాన్ని తెలంగాణ సమాజం ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు తెలుగింటి కోడలినని చెప్పుకునే నిర్మలమ్మ తెలంగాణియుడి భాషను నిందిస్తూ మాట్లాడటం సమంజసం కాదు. నిజానికి దక్షిణ భారతంలో హిందీ బాగా మాట్లాడేది తెలంగాణ వాసులే. అందుకే తెలంగాణను ఉత్తర- దక్షిణ భారతావనికి భాషా వారిధిగా పేర్కొంటారు. ఇవేవి పట్టని ఆర్థిక మంత్రి అసలు ప్రశ్నకు సమాధానం చెప్పకుండా 'రూపాయి పతనం విషయంలో' దేశాన్ని బురిడి కొట్టించారు. రేవంత్‌రెడ్డి సైతం ఆమెకు ఘాటుగానే సమాధానం చెప్పారు. 'నేను శూద్రుడిని.. నాకు మీ అంత హిందీ రాదు. మీరు బ్రహ్మాణులు కదా! మీకు హిందీ బాగా వస్తుందని' అదే హిందీలోనే చురకలంటించారు.
రూపాయి విలువ తగ్గిపోతే ఆ ప్రభావం అన్ని రంగాలపై పడుతుందని ఒకవైపు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాన్య ప్రజల వెన్నులో చలి పుట్టిస్తున్న హెచ్చరికలు కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం కదిలించడం లేదు. అందుకు నిన్నటికి నిన్న పార్లమెంట్లో కేంద్ర ఆర్ధిక మంత్రి వ్యాఖ్యలే నిదర్శనం. రూపాయి విలువ పతనం గురించి గత యూపీఏ ప్రభుత్వ హయాంలో నానా యాగీ చేసిన నరేంద్రమోడీ గానీ, ఇతర బీజేపీ పెద్దలు గానీ ఇప్పుడు తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండి పోయారు. సమస్య మన రూపాయి పతనం కాదు, డాలరు విలువ పెరగటం అనే వితండవాదం చేస్తూనే ఉన్నారు. మన కరెన్సీ బలహీనత కాదు! డాలరు బలం అని అంగీకరిస్తే 2014కు ముందు పతనానికి కూడా అదే కారణం కావచ్చు కదా! కానీ బీజేపీ నేతల వాదనేమిటి?
2013 ఆగస్టు 20న ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి, నేటి ప్రధాని నరేంద్రమోడీ 'ఈ రోజు దేశం ఆశాభంగం చెందింది, ఎందుకంటే ఆర్ధిక రంగం గురించి గానీ, రూపాయి పతనం గురించి గానీ ప్రభుత్వానికి చింతలేదు. దాని ఏకైక చింతల్లా కుర్చీని ఎలా కాపాడుకోవాలా అన్నదే. గత మూడు నెలలుగా రూపాయి పతనం చెందుతూనే ఉంది. కానీ గత మూడు నెలలుగా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రూపాయి ఇలా పతనం అవుతుంటే ఇతర దేశాలు దీన్ని అవకాశంగా తీసు కుంటాయి. ఇలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుందని దేశం ఎన్నడూ ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి సంక్షోభంలో నాయకత్వానికి ఎటుపోవాలో తెలియకపోతే తరువాత నిరాశ ఆవరిస్తుంది. ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు'' అన్నారు. మోడీ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు రూపాయి విలువ 64.11. మరి ఇప్పుడెందుకు నోరు విప్పరు...!
మన కరెన్సీ పతనమైతే దిగుమతి చేసుకొనే సరకుల ధరలు పెరిగి జనం మీద మరిన్ని భారాలు పడతాయి. ముడిచమురు ధరల పెరుగుదల దానికి ఒక ఉదాహరణ. దిగుమతి చేసుకొనే ఎరువులు, పురుగు మందులు ఒకటేమిటి ప్రతి ఒక్క వస్తువు ధర పెరిగి ప్రజల మీద భారంపడుతుంది. అందువలన ఆ పాపం నాది కాదు. అంతా డాలరు బలపడటమే అనే కుంటిసాకులు ఇంకెంత కాలం చెబుతారో పాలకులు. ధరల పెరుగుదల గురించి అడిగితే అది మన చేతుల్లో లేదు ప్రపంచమంతటా పెరుగుతున్నాయని ఆర్థిక మంత్రి చెబుతారు. మరి ప్రధాని, మంత్రులున్నది ఎందుకో? పార్లమెంట్లో సభ్యులు అడిగిందొకటైతే .. కేంద్రం చెప్పేదొకటి.