Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు నిర్మించబడుతుంది.. నేటి విద్యార్థే రేపటి నాయకుడు...' విద్య గురించి, విద్యారంగ ప్రాముఖ్యత, ప్రాధాన్యత గురించి చెప్పేందుకు ఈ రెండు మాటలు చాలేమో. నాటి స్వాతంత్య్రోద్యమం, ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నిన్న మొన్నటి తెలంగాణ ఉద్యమం దాకా నాయకులందరూ విశ్వ విద్యాలయాల్లో తయారైన వారే. అలాంటి వారిని తయారు చేసే ఖార్ఖానాలుగా అప్పట్లో యూనివర్సిటీలు ఉండేవి. పలు సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సమాలోచనలకు అవి వేదికలుగా వర్ధిల్లేవి. తద్వారా వివిధ ప్రజా సంఘాలకు, రాజకీయ పార్టీలకు నాణ్యతతో కూడిన నాయకులు లభించేవారు. ఆ రకంగా బయటకొచ్చిన నేతలు... ప్రజల ఐకత్య, జాతి సమైక్యత కోసం పాటుపడిన దాఖలాలు కోకొల్లలు. దేశ నిర్మాణంలో వారు క్రియాశీలక పాత్రను పోషించటం ద్వారా చిరస్మరణీయులయ్యారు.
అలాంటి విశ్వ విద్యాలయాలు నేడు బీజేపీ తిరోగమన విధానాల వల్ల అథోగతి పాలవుతుండటం ఆవేదనా భరితం. పీజీలు, పీహెచ్‌డీలు చేసిన వారు సైతం యూనివర్సిటీల్లో రకరకాల వివక్షను ఎదుర్కోవటం మన దౌర్భాగ్యం. పీజీయే కాదు... ప్రాథమిక స్థాయిలోని కేజీ విద్య సైతం నిధుల్లేక కునారిల్లుతుండటం అత్యంత బాధాకరం. గతంలో కాంగ్రెస్ సరళీకృత ఆర్థిక విధానాలను అమల్లోకి తెస్తే... వాటిని మోడీ సర్కార్ జెట్ వేగంతో అమలు చేస్తున్నది. ఈ క్రమంలో గత ఎనిమిదిన్నరేండ్ల కాలంలో ప్రభుత్వ విద్యారంగ బాధ్యత నుంచి అది పూర్తిగా తప్పుకుని కార్పొరేట్ శక్తులకు ఆ రంగాన్ని ధారాదత్తం చేసింది. తద్వారా విద్యా వ్యాపారీకణ.. కార్పొరేటీకరణ..కాషాయీకరణ అనే ఏకైక అజెండాతో అది ముందుకు సాగుతున్నది. ఇది దేశానికి పెనుముప్పును తెచ్చి పెడుతుందంటూ విద్యావేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నా చెవికెక్కించుకోని మోడీ సర్కార్... నూతన విద్యా విధాన(ఎన్ఈపీ) మంటూ మరో దిక్కుమాలిన పాలసీకి తెరతీసింది. ఆరెస్సెస్ భావజాలాన్ని విద్యారంగంలోకి ప్రవేశపెట్టటం, ఆ క్రమంలో సిలబస్‌ను పూర్తిగా మార్చేయటం, తద్వారా చరిత్రను వక్రీకరరించటమే ఆ విధానపు అసలు సిసలు లక్ష్యం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ను నిర్వీర్యం చేయటం.. దాని స్థానంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఈసీఐ)ని ఏర్పాటు చేయాలనే కుట్ర కూడా ఇందులో దాగుండటం రాబోయే ప్రమాదానికి సంకేతం. మరోవైపు వివిధ యూనివర్సిటీల్లోని ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుండటాన్నిబట్టి ఉన్నత విద్యారంగం పట్ల దానికున్న చిత్తశుద్ధి ఏ పాటిదో విదితమవుతున్నది. ఇదే సమయంలో ఉన్నత విద్యలో అణగారిన వర్గాలకు చోటు దక్కకుండా ఉండేందుకు రకరకాల కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు. ఆరెస్సెస్‌కు చెందిన వ్యక్తులనే యూజీసీ చైర్మెన్‌గా నియమించటాన్నిబట్టి బీజేపీ పక్కా వ్యూహంతో సాగుతోందని విదితమవుతున్నది. దీంతోపాటు ఘనత వహించిన మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్... విశ్వ విద్యాయాల పట్ల తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తూ నిధులివ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. వర్సిటీల్లో ఫీజులను భారీగా పెంచటం ద్వారా పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నది. 'బేటీ బచావో.. బేటీ పడావో...' అనే ముద్దు ముద్దు నినాదాలిస్తూ ఆచరణలో మాత్రం మొద్దు నిద్దుర పోతున్నది. ఒకవైపు శరవేగంగా విద్యా కార్పొరేటీకరణ చేస్తూనే..మరోవైపు ఆ రంగాన్ని హిందూత్వీకరణ చేసేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తున్నది. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి.. వారిలోకి మత భావాలను జొప్పించటం ద్వారా దేశం మొత్తాన్ని హిందూ రాజ్యంగా భావించొచ్చన్నది బీజేపీ, ఆరెస్సెస్ ఎత్తుగడ. అందువల్ల విద్యారంగ సమస్యలపై పోరాటంతోపాటు ఇప్పుడు దేశాన్ని, దాని భవిష్యత్తును కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత విద్యార్థి సంఘాలపైన్నే ఉంది. ఆ దిశగా ఆయా సంఘాలు సమాయత్తం కావాలి. ఇదే సమయంలో ప్రాథమిక, మాధ్యమిక, సాంకేతిక, ఉన్నత విద్యారంగాలనే తేడాల్లేకుండా అన్ని స్థాయిల్లోని విద్యను ఈ రకంగా భ్రష్టు పట్టిస్తున్న దివాళాకోరు విధానాలపై పోరాడాల్సిన తరుణం ఆసన్నమైంది. అందుకనుగుణంగా విద్యార్థి లోకం సమరశంఖం పూరిస్తూ తమ శక్తిని చాటి రణభేరి మోగించాలి. ఈ నేపథ్యంలోనే భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) నేతృత్వంలో విద్యార్థిలోకం మంగళవారం హైదరాబాద్‌లో కదం తొక్కింది. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు నడుం బిగిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ఆ సంఘం మహాసభ కొలువుదీరింది. నాలుగు రోజులపాటు కొనసాగే ఈ అఖిల భారత మహాసభ ప్రస్తుత సంక్లిష్ట, సంక్షుభిత పరిస్థితుల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. విద్యారంగ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆ మహాసభ చేయబోయే తీర్మానాలు, తీసుకోబోయే కర్తవ్యాలు యావత్ విద్యార్థి లోకానికి దశా దిశా నిర్దేశం చేయనున్నాయి. ఆ మహాసభ జయప్రదమవ్వాలనీ, అక్కడి పిలుపులనందుకుని విద్యార్థిలోకం కార్యోన్ముఖులు కావాలని ఆశిద్దాం.. ఆకాంక్షిద్దాం.