Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గురువారం నాటికి రష్యా - ఉక్రెయిన్ సంక్షోభం 295వ రోజులో ప్రవేశించింది. జరుగుతున్న పరిణామాలను చూస్తే దాని ముగింపు సూచనలు కనుచూపు మేరలో కనిపించటం లేదు. మరింతగా రెచ్చగొట్టేందుకు అమెరికా చేయాల్సిందంతా చేస్తోంది. ఇటీవల మాస్కోకు సమీపంలోని మూడు మిలిటరీ కేంద్రాలపై ఉక్రెయిన్ డ్రోన్, క్షిపణుల దాడి జరిపింది. మూడు దాడుల్లో ముగ్గురు సైనికులు మరణించగా రెండు విమానాలు ధ్వంసమయ్యాయి. అమెరికా హస్తం, పరిజ్ఞానం లేకుండా ఇది జరిగేది కాదు. డిసెంబరు ఐదవ తేదీ నుంచి రష్యా చమురు ధరలపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు వాటి ప్రభావం పెద్దగా లేదు, వచ్చిన వార్తల ప్రకారం 60డాలర్లకు మించి ఎవరూ కొనుగోలు చేయకూడదని ఆదేశించినప్పటికీ అంతకంటే ఎక్కువ ధరకే ఆసియా దేశాలకు విక్రయిస్తున్నది. రష్యా దాడులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు మద్దతుగా ఇంతవరకు ఏ నాటో దేశమూ ప్రత్యక్షంగా పాల్గొన్న దాఖలాలు లేనప్పటికీ అందుకు సిద్దపడుతున్నట్లు కనిపిస్తోంది. దానికి నాందిగా రష్యా మీద ఇటీవల జరిగిన మూడు దాడులు అమెరికా ప్రమేయంతో జరిగినట్లు స్పష్టమైంది. క్రిస్మస్ ఖర్చును తగ్గించుకొని పొదుపు చేసిన మొత్తాన్ని ఉక్రెయిన్‌కు పంపాలని పోప్ ఫ్రాన్సిస్ కోరారు. క్రిస్మస్ పేరుతో కాల్పుల విరమణకు అంగీకరించేది లేదని మాస్కో పేర్కొన్నట్లు వార్తలొచ్చాయి.
గతవారంలో మాస్కోకు రెండు వందల మైళ్ల దూరంలోని వైమానిక కేంద్రంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి జరిగింది. అంతకు ముందు మరో రెండు స్థావరాల మీద కూడా జరిగింది. ఇది సంక్షోభాన్ని మరింత తీవ్రతరం గావించే అమెరికా ఎత్తుగడలో భాగం తప్ప మరొకటికాదు. ఇలాంటి రెచ్చగొట్టుడుతో పుతిన్ దెబ్బకు దెబ్బ తీసేందుకు పూనుకుంటే ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టటంతో పాటు ఆ పేరుతో నేరుగా జోక్యం చేసుకొనేందుకు నేపధ్యాన్ని సిద్దం చేసేందుకే అన్నది స్పష్టం. అంతకు ముందు అక్టోబరు, నవంబరు నెలల్లో నోర్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్ ధ్వంసం, క్రిమియా వంతెనపై దాడి, సెవాస్తపూల్ నౌకా హార్బర్లో పేలుళ్లు, పోలెండ్ గ్రామంలో పేలుడు ఉదంతాలను చూసినపుడు వాటి వెనుక అమెరికా హస్తం ఉందన్నది స్ఫష్టం. ఈ ఉదంతాలన్నింటిని జరిపింది ఉక్రెయిన్ దళాలు, తమకేమీ సంబంధం లేదని అమెరికా నమ్మబలికింది. ఇవన్నీ ఒక ఎత్తుకాగా రష్యా మిలటరీ స్థావరాల మీదకు దాడికి దిగటం వేరు. వీటి మీద కూడా అమెరికా అలాగే స్పందించింది. శిఖండిలా జెలెనెస్కీ సేనలను ముందు పెట్టి వెనుక నుంచి నడిపించే అమెరికా నూతన ఎత్తుగడలో ఇది భాగం. ఒక ప్రమాదకరపోకడ. మాస్కో సమీపంలోని వైమానిక స్థావరం మీద ఉక్రెయిన్ దాడికి తమ ప్రోత్సాహం గానీ, సహకారం గానీ లేదంటూ దాడి జరిపిన కొద్ది గంటల్లోనే అమెరికా ప్రకటించింది. ఉక్రెయిన్ మిలిటరీ వద్ద ఉన్న పూర్వపు సోవియట్ తయారీ టియు-141, ఇతర డ్రోన్లను నవీకరించి క్రూయిజ్ క్షిపణిగా మార్చి అమెరికా ఉపగ్రహాల జీపీఎస్‌తో అనుసంధానం చేసి ప్రయోగించారు. ఇది అమెరికా నిపుణులు తప్ప మరొకరు చేయగలిగింది కాదు. ఇది ప్రత్యక్షంగా నాటో పాల్గొనటం తప్ప వేరు కాదు. ఇలాంటి చర్యలకు పుతిన్ స్పందనను ఆ కూటమి చూస్తోంది. పరిణామాలను మరో మలుపు తిప్పే కసరత్తులో నాటో ఉందన్నది స్పష్టం. తాజా ఉదంతంపై స్పందించిన పుతిన్ వెంటనే ఉన్నత సమావేశాన్ని ఏర్పాటు చేశాడు, అమెరికా ఎత్తుగడను గ్రహించి సంయమనం పాటించాడు.
ఈ దాడులతో పాటు దశలవారీగా ఉద్రిక్తతలను పెంచే రీతిలో అమెరికా తన పథకంలో భాగంగానే ఉక్రెయిన్‌కు తమ పేట్రియాట్ క్షిపణి వ్యవస్థలను అందచేయాలని తాజాగా నిర్ణయించింది. ఉపరితలం నుంచి గగనతలంలోకి సంధించే వీటిని 1980దశకంలో అమెరికా రూపొందించింది. ఇరాక్‌పై జరిపిన దాడిలో వీటి పనితీరును పరీక్షించింది. యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, స్వల్ప శ్రేణి ఖండాంతర క్షిపణులను నిలువరించేందుకు ఇది తోడ్పడుతుంది. దీన్ని ట్రక్కుల మీద ఒక చోటి నుంచి మరొక చోటికి తరలించవచ్చు. పుతిన్‌కు ఇరాన్ సరఫరా చేసిన క్షిపణులను, డ్రోన్లను దెబ్బతీసేందుకు దీన్ని ఉద్దేశించినట్లు భావిస్తున్నారు. ఇరాన్ డ్రోన్ల విలువ 50వేల డాలర్లుంటే వాటిని కూల్చేందుకు ప్రయోగించే పేట్రియాట్ లాంచర్ ఖర్చు పదిలక్షల డాలర్లు ఉంటుంది. ఉక్రెయిన్ను రక్షించే పేరుతో అమెరికా తన కంపెనీలకు లాభాలను చేకూర్చేందుకు కూడా వీటిని అందచేస్తున్నది. ఒక్కో క్షిపణి వ్యవస్థ నిర్వహణకు 90 మంది సైనికులు కావాలి, వారిని అమెరికా నుంచి పంపినా లేక శిక్షణ పొందిన ఉక్రెయిన్ సేనలు ఆత్మరక్షణకు బదులు రష్యా మీదకు వదిలినా పుతిన్‌ను మరింతగా రెచ్చగొట్టినట్లు అవుతుంది. క్రిమియా వంతెనపై దాడి తరువాత రష్యా పెద్ద ఎత్తున క్షిపణులతో ఉక్రెయిన్ విద్యుత్, మంచినీటి సరఫరా వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నది. దీన్ని సాకుగా చూపి అమెరికా పేట్రియాట్ క్షిపణి వ్యవస్థలను అందచేస్తున్నది. ఉక్రెయిన్ సంక్షోభానికి తెరదించేందుకు పశ్చిమ దేశాల వైపు నుంచి ఎలాంటి చొరవ లేకపోగా ఇలాంటి రెచ్చగొట్టే చర్యలతో మరింతగా ఆజ్యం పోస్తున్నాయి. ఉక్రెయిన్ సర్వనాశనమైనా వాటికి పట్టదు.