Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట'' అన్నారు పోతనామాత్యులు. నేడు మోడీ గారి నోట 'ఉచితాలన్నీ అనుచితాలే'ననే ప్రపంచబ్యాంకు విరచిత ప్రవచనాలు వింటుంటే ఆ వాక్కులు గుర్తుకురాక మానవు. అందువల్ల ''పలికెడిది ప్రధానమంత్రట పలికించెడిది ప్రపంచబ్యాంకట'' అని అర్థం చేసుకోవాలి మనమిప్పుడు. ఇప్పటికే ఉచితాల పేరుతో సంక్షేమ పథకాలపై ప్రధాని సహా ప్రభుత్వ పెద్దల వ్యాఖ్యానాలు ఆందోళన కలిగిస్తుండగా, తాజాగా మోడీజీ వీటిపై మరోసారి విరుచుకుపడ్డారు. ఆదివారం తన మహారాష్ట్ర పర్యటనలో నాగపూర్ కేంద్రంగా ప్రసంగిస్తూ, సంక్షేమపథకాల మీద, వాటిని అమలు చేయాలని కోరుతున్న రాజకీయ పార్టీల మీదా తీవ్రమైన దాడి చేశారు. సంక్షేమపథకాలను అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావాలన్న యావే తప్ప, ఈ ఉచితాల వల్ల ఆర్థిక వ్యవస్థ నాశనమ వుతుందన్న ధ్యాసే ప్రతిపక్షాలకు లేదని శెలవిచ్చారు. ఇది పన్ను చెల్లింపుదారుల డబ్బును వృధా చేయడమేనని వాపోయారు. (ఆచెల్లిం పు దారులు ప్రజలేనన్న సంగతి మరిచి పోయారు) ఇవన్నీ పలుకుతున్నది ప్రధానీ, పాలకపార్టీ నేతలే అయినా పలికిస్తున్నది మాత్రం ప్రపంచబ్యాంకేనన్నది విజ్ఞుల మాట!
నిజమే... నయా ఉదారవాద విధానాలు అంతిమ దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఏలినవారి లీలావిన్యాసాలివి. తమ యజమాను లైన కార్పొరేట్, బహుళజాతి సంస్థల ప్రయోజనాలకోసం, అసాంఖ్యాకులైన పెదల నోటికాడి కూడూ లాగేసుకునే కుతంత్రాలివి. లేదంటే ఇది సంక్షేమరాజ్యమన్న మౌలిక సూత్రాన్నే మరిచి, అదే దేశాభివృద్ధికి ఆటంకమ నడంలోని ఉద్దేశమేమిటి? నిజంగా పేదలకిచ్చే ఈ అరాకొరా సంక్షేమమే ఆర్థికవ్యవస్థకు భారంగా మారిందా? మరి రాయితీలు, ప్రోత్సాహకాల పేరుతో పెద్దలకిచ్చే కానుకల మాటేమిటి? మంగళవారం నాడు పార్లమెంటులో సీపీఐ(ఎం) సభ్యులు జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ ఇచ్చిన సమాధానం ఇక్కడ గుర్తుచేసుకోవాలి. రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారం, కేవలం ఈ అయిదేండ్లలోనే కార్పొరేట్లకు అక్షరాలా పదిలక్షల తొమ్మిదివేల అయిదువందల పది కోట్ల బ్యాంకు రు ణాలు మాఫీ చేశామని లిఖిత పూర్వకంగా తెలియ జేసారు. ఇది ఆర్థిక వ్యవస్థకు భారం కాదా? వీరు అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజలపై పరోక్ష పన్నులను, సెస్సులను భారీగా పెంచి భారాలు వేసి, ఈ కార్పొరేట్లకు మాత్రం అనేకానేక రూపాల్లో రాయితీలిస్తున్నారు..! ప్రత్యేకించి బడ్జెట్లోనే 8శాతం కార్పొరేట్ పన్ను రాయితీ ద్వారా లక్షలాదికోట్ల లబ్ది చేకూరుస్తున్నారు..! ఇవి ఉచితాల కిందకి రావా? ఇది చాలదన్నట్లు ప్రజల ఆస్తులన్నిటినీ కారు చౌకగా కార్పొరేట్లకే అప్పగిస్తున్నారు కదా! అది ఖజానాకు భారం కాదా? ప్రతి ఏటా డిజిన్వెస్ట్‌మెంట్ పేరుతో ప్రభుత్వరంగ సంస్థలన్నిటినీ ఈ ప్రయివేటు కార్పొరేట్ శక్తులకే కట్టబెడుతున్నారు కదా? ఆ సొమ్మంతా ఎవరిదీ..? ఇలా జనం సొమ్మంతా సంపన్నులకు దోచిపెడుతూ, వాటికేమో రాయితీలు, ప్రోత్సాహకాలు, ఉద్దీపనలని ముద్దు పేర్లు పెడుతారు. సామాన్యులకిచ్చే సంక్షేమపథకాలనేమో ఉచితాలంటూ ఎద్దేవా చేస్తారు. పైగా రానున్న 25ఎండ్లలో ''దేశాభివృద్ధిని'' దృష్టిలో పెట్టుకునే ఈ ఉచితాలను వద్దంటున్నామని సుద్దులు చెపుతారు..!
అంటే ఇకపై ప్రభుత్వం ద్వారా ప్రజలు పొందుతున్న సమస్త సేవలనూ ఉచితాలనే ముద్ర వేసి ఉపసంహరిస్తారన్నమాట. ఈ పేరుతో దేశంలోని 30కోట్ల కుటుంబాలకు చౌకగా ఆహారధాన్యాలు అందిస్తున్న ప్రజాపంపిణీ వ్యవస్థను రద్దు చేస్తే... కనీస ఆదాయం లేని అసంఖ్యాకులైన ప్రజల ఆకలి తీరెదెలా? బహుశా ఉద్యోగంలో ఉన్నంత కాలం జీతాలిచ్చాం, రిటైరైన తరువాత ఇచ్చే పెన్షన్లు, పిఎఫ్‌లు ఉచితాలే అవుతాయని వాటిని కూడా రద్దు చేస్తారేమో! సీనియర్ సిటిజన్స్‌కు రైల్వే రాయితీలు కూడా ఇవ్వలేమని చెపుతున్నారు కదా? ఇప్పటికే విద్యా, వైద్య రంగాలలో ప్రయివేటీకరణను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం పూర్తిగా ఆ బాధ్యతల నుంచి వైదొలగితే భావితరాల భవిష్యత్తుకు, పేదల ఆరోగ్యానికీ దిక్కెవరు? విత్తనాలు, ఎరువుల సబ్సిడీనీ ఎత్తేస్తే వ్యవసాయం ఏమైపోవాలి? విద్యుత్తు, రవాణా మొదలు పోస్టల్, టెలీఫోన్ సేవల వరకూ... మంచినీటి సరఫరా మొదలు డ్రైనేజీ నిర్వాహణ వరకూ సమస్త ప్రభుత్వసేవలూ ఈ ఉచితాల పేరుతో అందుబాటులో లేకుండా పోతే జరుగబోయేది ఏమిటి? ప్రతిదీ ప్రయివేటు సేవగా మారిపోవడమేగా...?
అంతిమంగా ప్రతిదీ ప్రయివేటు పరమేననే ప్రపంచబ్యాంకు విధానమే అమలు జరుగుతుందన్నమాట. ప్రధాని ప్రవచనాలన్నీ ప్రపంచబ్యాంకు ప్రాయోజితమేననడానికి ఇంతకన్నా ఉదాహ రణలేం కావాలి? ఈ లెక్కన వీరు ప్రజాసేవకులా? ప్రపంచబ్యాంకు సేవకులా? ఈ నయాఉదారవాద నయవంచనను మరుగునపెడుతూ, రాబోయే 25ఏండ్లలో అభివృద్ధిని పరుగులు పెట్టించడానికే ఇదంతా అని ప్రధాని చెపితే నమ్మడానికి ప్రజలేమీ అమాయకులు కాదు. ఏది ఉచితమో ఏది అనుచితమో వారే తేల్చి చెపుతారు. ఎందుకంటే, సంక్షేమం ప్రభుత్వాల భిక్ష కాదు... ప్రజల హక్కు...