Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుస్తకాల వనం మన నగరానికి రాబోతున్నది. వనమంతా పరిమళ భరితమే. ఈ వనాన వికసించేవన్నీ వెలుగు విరులే. ఇక చీకట్లకు తావుండదు. పరిమళ పరివ్యాప్తిలో జ్ఞాన మంచు సొనలు మన మస్తకాలకు మధుర రుచులనందిస్తాయి. పుస్తకమంటే జీవరహిత పదార్థం కాదు. మానవ పరిణామంలో కార్యాలలో, కారణాలలో వెల్లువెత్తే ఆలోచనల అనుభవాల సముజ్వల సజీవ సముచ్ఛయం. అలాంటి పుస్తకాలన్నీ ఓ పది రోజులు మన ముంగిట పండుగ చేయటం గొప్ప సందర్భం. భాగ్య నగరానికి నిజమైన జ్ఞాన భాగ్యాన్ని అందించే సందడి ఇది. అందమైన ముఖపత్రాలతో నన్నందుకోమంటూ కనువిందు చేస్తాయి అక్షరగుచ్ఛాలు. మనందరం ఇక సన్నద్దమవ్వాలి ముప్పయి ఐదవ పుస్తక ప్రదర్శన శాలకు. నగరంలో ఎన్నో ఎక్స్పోలు జరుగుతుంటాయి. కొత్త కొత్త వాహనాలు, నగలు, నగిశీల వస్తువులు, వస్త్రాలు, సమ్మోహన సరుకులు కళ్లు జిగేల్మనే కాంతులతో మనసులో కోర్కెల జడులు రేపే వ్యాపార కళాత్మక మాళ్లూ, మహా ప్రదర్శనలూ మరెన్నో ఉంటాయి. వాటిని కొని తెచ్చుకుంటే ఇళ్లంతా నిండొచ్చు. కొన్నాళ్లకు కనుమరుగైపోతాయి. కానీ పుస్తకాలు కొత్త ఆలోచనలను నింపుతాయి. అనుభూతులతో, ఆనందాలతో జీవిత మంతా పరుచుకుంటాయి. అక్షరమంటేనే క్షయం లేనిది. ఒక మంచి పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం అనుభవిం చిన వాళ్లకే తెలుస్తుంది. పుస్తకం అమ్మలా లాలిస్తుంది. నాన్నలా ఆదరిస్తుంది. గురువులా హితబోధ చేస్తుంది. ఒంటరి తనంలో స్నేహితుడిలా అక్కున చేర్చుకుం టుంది. ఒక కొత్త బలం సమకూరుస్తుంది. మనకెదురయ్యే సవాళ్లకు సమాధానాలనూ అందిస్తుంది. ఓదారుస్తుంది. అనేక జీవితాల అనుభవాల సారాన్ని తెచ్చి చేతుల్లో పెడుతుంది. మనల్ని పురికొల్పుతుంది. చైతన్య పరుస్తుంది. ప్రేరణనిస్తుంది. ప్రేమనూ పంచుతుంది. అందుకే పుస్తకం మన మస్తకాలకు పదునుపెట్టే ఆయుధం. అయితే అన్ని పుస్తకాలూ చదవాల్సినయే అయినా మంచి పుస్తకాలను ఎంచుకోవటం ముఖ్యమైన విషయం. ఏ పుస్తకాలు నిజమైన జ్ఞానాన్ని అందిస్తాయో, మనసును వికసింపజేస్తాయో ఏరుకోవాల్సిందే మరి.
కంప్యూటర్లు, డిజిటల్ ఈ బుక్కుల విజ్ఞానం ఎంత పెరిగినా, అందుబాటులోకి వచ్చినా పుస్తకం విలువ పుస్తకానిదే. పిల్లలకు టీవీ ఛానళ్లు పెరిగి విపరీత పరిణామాలు సంభవిస్తున్న కాలాన, వాటిల్లోని ఆటలూ, పోటీలూ, శారీరక, మానసిక ఆరోగ్యా లను దెబ్బతీస్తున్న సమయాన, వాళ్ల చేతుల్లో ఒక మంచి పుస్తకాన్ని పెట్టాల్సిన అవసరం ఈనాడు ఎక్కువగా పెరిగింది. ఒళ్లో కూచో పెట్టుకుని కథలు చెప్పే అమ్మమ్మలు, నానమ్మలు కనబడటం లేదు. వింటే స్కూళ్లల్లో లేకుంటే సెల్లుల్లో అంతే. అందుకే పిల్లల తల్లిదండ్రులు, పెద్దలు ఈ సందర్భంగానైనా కొన్ని పుస్తకాలు బహుమతిగా ఇవ్వండి. ఇప్పుడే కాదు. ఏ బహుమతి ఇచ్చే సందర్భంలోనైనా పుస్తకమే ఇవ్వండి. చరిత్రలోని సంఘటనలను తిరిగేయండి. పుస్తకాలు తీర్చిన మహామహుల చరిత్ర మనకు బోధపడుతుంది. చదవడమంటే తరగతి గదికి, బడికి మాత్రమే చెందినది కాదు. జీవితంతో పాటు కొనసాగేది. మనం చదవాల్సినది బడి బయటనే చాలా ఉందనే ఎరుకను పిల్లలకు కలిగించాలి. ఏదో ఒకటి చదవడం కాదు. మూఢత్వంలోకి దింపే పుస్తకాలూ వుంటాయి. విశ్వాసాల పేర మనుషుల్నీ విభజననూ, విభేదాన్ని పెంచే రచనలు కూడా ఉంటాయి. జాగ్రత్త వహించాల్సిందే. ఇప్పుడు నవతరంలో రచనలు చేస్తున్న వాళ్లు పెరుగుతున్నారు. మానవసంబంధాలలో వచ్చిన మార్పులను, ఎదురౌతున్న సవాళ్లనూ సృజనాత్మకంగా చెబుతున్నారు. ఈ సూపర్ టెక్నాలజీ పరుగులో, ఒత్తిడిలో పడి మనుషులు కొల్పోతున్నదేమిటో ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు యువకులు. వారి ఆలోచనలెలా ఉన్నాయో వినాలి మనం. అందుకు ఇదో సందర్భం. పిల్లలకు, పెద్దలకు, విద్యార్థులకు, ఉపయయోగపడే వేలవేల పుస్తకాలు ఒక్క ప్రాంగణంలోకి వస్తున్న సమూహపు సమయాన సందర్శనే ఒక ఉత్సవం. పుస్తకాలే కాదు మనుషులు కలుస్తారు, సాహిత్య చర్చలు, కొత్త కొత్త ఆవిష్కరణలు, భావాల కలబోతలు, కవులు, సృజన కారులు, రచనా ప్రియులు- అందుకే అది పుస్తకాల పండుగ. పరిమళాలు వెదజల్లును నిండుగా. 'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, ఒక కొత్త పుస్తకం కొనుక్కో' మన్న సంస్కర్తల పిలుపు జ్ఞాన సమాజ నిర్మాణం కోసం ఇచ్చిందే. అందుకే పుస్తకాల పండుగలు వర్ధిల్లాలి!.