Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తరాలు మారుతున్నా కులం పేరుతో జరుగుతున్న హత్యలు మాత్రం ఆగడం లేదు. కులం మారి పెండ్లిళ్లు చేసుకుంటే అయినోళ్లే పొట్టనపెట్టుకుంటున్నారు. మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న భయంకరమైన జబ్బు కులవ్యవస్థే. కుల ప్రభావం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే దేశం వివిధ రంగాల్లో అభివృద్ధి చెందకపోవడానికి కారణం కుల వ్యవస్థే అని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలోని ప్రతి మనిషికి ఏమున్నా లేకున్నా కులం మాత్రం గ్యారంటీ. స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లు అవుతున్నా ఇప్పటికీ దాదాపు 30కోట్ల మంది అంటరానితనం, కులవివక్షతో అణచివేయబడుతున్నారు. మనదేశంలో కులం కొందరికి వరమైతే... ఎందరికో శాపంగా మారుతోంది. కులాల చిచ్చుతో రగులుతున్న మన సమాజానికి శస్త్రచికిత్స తక్షణ అవసరం. 'ప్రతి యేటా వందల సంఖ్యలో యువకులు కులానికి బలైపోతున్నారు. దేశంలో కుల దురహంకార జాఢ్యం ప్రమాదకర సమస్యగా మారిందని' స్వయంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారంటే దేశంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
దేశం ఆధునికతను సంతరించుకునే కొద్దీ అంతరించపోవాల్సిన కులం మన రాజకీయ వ్యవస్థ పుణ్యమా అని వెర్రితలలు వేస్తోంది. మర్రి ఊడల్లాగా వేళ్లూనుకుంటోంది. ప్రేమానురాగాలను దునుమాడుతున్నది. నేడు ప్రపంచంలో జరుగుతున్న ఈ దురహంకార హత్యల్లో ప్రతి ఐదింటిలో ఒకటి భారత్లోనే జరుగుతున్నదంటే ఇది ఎంతటి తీవ్రరూపం దాల్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాద తీవ్రతను గుర్తించిన సుప్రీంకోర్టు ''అత్యంత హేయమైన, అమానుషమైన, ఘోరమైన ఈ హత్యల వెనుక పరువు ఎక్కడుంది. ఉన్నదల్లా రాక్షసత్వం, భూస్వామ్య ఆధిపత్య మనస్తత్వమే... ఇటువంటి ఘాతుకాలకు ఒడిగట్టేవాళ్లు కఠిన శిక్షలకు అర్హులు'' అంటూ తీర్పునిచ్చింది. దేశ అత్యున్నత న్యాయస్థానమే ఇంత తీవ్రంగా హెచ్చరించినా ఇవి ఆగకపోగా మరింత పెచ్చరిల్లడం దేనిని సూచిస్తోంది..!? అభివృద్ధిక్రమంలో అంతమొందించాల్సిన ఈ మనువాద ఆధిపత్య భావజాలాన్ని తమ అధికారం కోసం పెంచిపోషిస్తున్నాయి పాలకవర్గాలు. ఫలితంగా నేటికీ కుల రక్కసి కోరల్లో విలవిలలాడుతున్నది మాత్రం అమాయక ప్రజలే. సీజేఐ వ్యాఖ్యలే అందుకు తాజా ఉదాహరణ.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ సమస్య మరింత తీవ్రమైనట్టు జాతీయ నేర గణాంక సంస్థ నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2014లో దేశ వ్యాప్తంగా 28 కుల దురహంకార హత్యలు జరుగగా 2015కి ఆ సంఖ్య 251కి ఎగబాకడం మచ్చుకు ఓ ఉదాహరణ మాత్రమే. జరుగుతున్న ఘటనల్లో కేవలం 10శాతం మాత్రమే నమోదవుతున్నాయంటే వెలుగులోకి రాని అకృత్యాలెన్నో అంచనా వేయొచ్చు. కమలనాథుల పరిపాలనలో ఈ కులదురహంకార హత్యలు ఏకంగా 792శాతానికి పెరగడం ఆందోళన కలిగించే అంశం. కాగా ఇప్పుడీ జాడ్యం దక్షిణాదికి అంటుకోవడం మరింత కలవరపరుస్తోంది. ప్రత్యేకించి గత ఏడాది రెండేండ్లుగా మధుకర్ నుంచి జుబ్లీహిల్స్ పబ్ ఘటన వరకూ వరుస ఘటనలతో తెలంగాణ అట్టుడుకుతున్నది. వీటిలో అనేక ఘటనలలో నిందితులపై సరైన కేసులు, శిక్షలు ఉండకపోవడం మన ప్రభుత్వాల వైఫల్యాలకు, స్వభావాలకు అద్దం పడుతోంది.
నిజానికి కలిసి బతికేందుకు మనసులే తప్ప కులాలు కలవాల్సిన పని లేదు. అయితే, యువత కులాంతర వివాహాల బాట పడితే అసలు కులమే బతికి బట్టకట్టే పరిస్థితి లేదు. కాబట్టి, కులం ద్వారా ప్రయోజనం పొందే శక్తులు ఎలాగయినా కులాంతర వివాహాలను అడ్డుకుని కులాన్ని బతికించుకునేందుకు కంకణం కట్టుకున్నాయి. అందుకు అనుకూలమైన సామాజిక వాతావరణాన్ని సృష్టించి, కాపాడుకునేందుకు పకడ్బందీ వ్యూహం పన్నుతున్నాయి. అమ్మాయి తరపు రక్త సంబందీకులను రెచ్చగొట్టడం, హత్యలకు పురిగొల్పడం, అందుకు సహకరించడం నుంచి తమకున్న రాజకీయ పరపతిని ప్రయోగించి నేరస్తులను రక్షించడం వరకూ చేస్తున్నాయి. కుల వ్యవస్థను సమూలంగా నిర్మూలించడం మనందరి బాధ్యత. కులాంతర వివాహం చేసుకున్నా అది కుల రహిత సమాజానికై జరుగుతున్న పోరాటంలో ఒక భాగమేనని గుర్తించాలి. 'ప్రేమలకూ, పెండ్లిలకు కులాలు అడ్డుకారాదు' అన్న చైతన్యం పెరగాలి. అందు కోసం దేశంలో ఒక సాంస్కృతిక విప్లవం రావాలి.