Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కొన్ని విషయల్లో ఘనం.. కానీ పలు విషయాల్లో అథమం...' అన్నట్టుగా ఉంది మన రాష్ట్ర పరిస్థితి. తెలంగాణ ఏర్పాటు అనంతరం విద్యుత్్, సాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించామంటూ మన ప్రభుత్వాధినేతలు ప్రకటిస్తూ వస్తున్నారు. రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు తదితర సంక్షేమ కార్యక్రమాలు సైతం చేపట్టామంటూ వారు చెప్పుకొస్తున్నారు. ఆయా రంగాలు, కార్యక్రమాలకు సంబంధించి వారు చెప్పే దాంట్లో కొంత వాస్తవముంది కూడా. దాన్ని కాదనలేం. కానీ ఆయా పథకాలు, ప్రోగ్రాములే సర్వరోగ నివారిణులు కావు.
ఇప్పుడీ చర్చ ఎందుతకొచ్చిం దంటే... ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఇటీవల విడుదల చేసిన సామాజిక పురోగతి సూచికల్లో తెలుగు రాష్ట్రాలు దిగువ మధ్యస్థాయిలో నిలిచాయి. ఈ సూచికల్లో విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, గూడు, వ్యక్తిగత భద్రత, వ్యక్తిగత స్వేచ్ఛ, ఛాయిస్, పర్యావరణ నాణ్యత ఆధారంగా రాష్ట్రాల సామాజిక పురోగతిని అంచనా వేశారు. మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 707 జిల్లాల్లో సామాజిక పరిస్థితుల కొలమానంగా నివేదికను రూపొందించారు. ఈ నేపథ్యంలో మన రాష్ట్రానికి సంబంధించి పలు ఆందోళన కలిగించే అంశాలు వెలుగు చూశాయి. వాటిని మనం లోతుగా పరిశీలించుకోవాలి. ఆయా సూచికల ప్రకారం... మహిళలపై అత్యధిక నేరాలు కొనసాగుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. విద్యార్థుల ప్రాథమిక జ్ఞానానికి సంబంధించి ఎన్ఏఎస్ (నేషనల్ అచీవ్మెంట్ సర్వే)లో అది చివరి స్థానంలో ఉంది. వ్యక్తిగత భద్రత విషయంలో సైతం తెలంగాణ జాతీయ సగటు స్కోరు (61.89) కంటే 20 పాయింట్ల దిగువన ఉంది. మానవ అక్రమ రవాణాలో ఇక్కడి మేడ్చల్ జిల్లా 52మార్కులతో దేశంలో రెండో స్థానంలో ఉండటం భీతిగొలిపే అంశం. రాష్ట్రంలో బాలకార్మికులు అత్యధికంగా ఉండటాన్ని కూడా ఆ సూచికలు విశదీకరించాయి. ఉన్నత విద్యలో లింగ వివక్ష కొనసాగుతున్నది. ప్రతి లక్ష జనాభాకు అతి తక్కువ కళాశాలలున్న తొలి 10జిల్లాల్లో వికారాబాద్, వనపర్తి, మహబూబాబాద్ ఉండటం గమనార్హం.
ఇదే సమయంలో ఆయా సర్వేలు, సూచికల ప్రకారం... పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్ల నిర్మాణంలో 85శాతానికిపైగా లక్ష్యాన్ని పూర్తిచేసి ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానాన్ని సాధించింది. గ్రామీణ ప్రాంతాలకు వంద శాతం నల్లా నీటిని (మిషన్ భగీరథ) అందిస్తున్న రాష్ట్రాల జాబితాలోనూ మన రాష్ట్రం చేరటం హర్షణీయమే. తెలంగాణలోని 90శాతానికి పైగా ఇండ్లలో వంట కోసం స్వచ్ఛ ఇంధనాన్ని వాడుతుండగా, ఈ అంశంలో 95.87శాతంతో హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలూ ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నాయి.
ఈ సానుకూల, ప్రతికూల సూచికలను కాసేపు పక్కన పెడితే తెలంగాణ వచ్చి ఎనిమిదిన్నరేండ్లు పూర్తయిన తర్వాత కూడా ముఖ్యమైన రంగాలు, మౌలికమైన అంశాల్లో ఇంకా మనం వెనుకబడే ఉన్నామనే విషయం విదితమవుతున్నది. సామాజిక రంగాల్లో మన పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఆయా రంగాలకు బడ్జెట్లో కేటయింపులు ఘనంగా ఉంటున్నా... వాటి ఖర్చులో మాత్రం సర్కారు వారు తమ పిసినారితనాన్ని ప్రదర్శిస్తూ అంతులేని నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నారు. ఇది ఎంతమాత్రమూ సరికాదు. ముఖ్యంగా రేపటి పౌరులైన నేటి బాలలకు సరైన తిండి, పోషణ, విద్య కోసం వెచ్చించే నిధులను ఖర్చుగా కాకుండా పెట్టుబడిలాగా చూడాలి. ప్రభుత్వం చెబుతున్నట్టు గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు బ్రహ్మాండంగా ఉంటే, బడిబాట (పిల్లలను బడుల్లో చేర్పిచేందుకు వీలుగా ఉపాధ్యాయులు విస్తృత ప్రచారం నిర్వహించి... తల్లిదండ్రులకు అవగాహన కల్పించటం) కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తుంటే బాల కార్మిక వ్యవస్థ ఇంకా ఎందుకు కొనసాగుతున్నదో అర్థం కావట్లేదు. ఈ నేపథ్యంలో ఇలాంటి వాస్తవాలను గుర్తెరిగి పాలకులు తమ లోపాలు, లొసుగులు, బలహీనతలను సరి చేసుకోవాలి. ఇలాంటి రుగ్మతల నుంచి తెలంగాణను బయటపడేయాలి. ఒక రాష్ట్రం సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలన్నింటిలో అభివృద్ధి సాధించినప్పుడే అది సమతుల్య అభివృద్ధిని సాధించినట్టు. ఆ దిశగా ప్రభుత్వ ప్రయాణం సాగాలి. అప్పుడే 'బంగారు తెలంగాణ' అనే నినాదానికి సార్థకత చేకూరుతుంది.