Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా గురించి మరోసారి వాట్సాప్ యుూనివర్సిటీ ''నిపుణులు'' రెచ్చిపోతున్నారు. జనాలను భయపెడుతున్నారు. వారికంటే మేమేమీ తక్కువ కాదన్నట్లుగా మీడియా ''పండితులు'' కూడా కట్టుకథలు, పిట్టకథలను వండి వార్చుతున్నారు. దీని వెనుక ఎవరి అజెండా వారికి ఉంది. ఇలా చెప్పటమంటే కరోనా ముప్పును తక్కువ చేసి చెప్పటం కాదు. ఆ మహమ్మారి పూర్తిగా అదుపులోకి వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించేంతవరకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అదే సమయంలో మహమ్మారులను కూడా తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకొనే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
చైనాలో కరోనాను పూర్తిగా అదుపు చేసేందుకు నిన్నమొన్నటి వరకు కొన్ని పట్టణాలు, ప్రాంతాలలో ప్రకటించిన పాక్షిక లాక్డౌన్లు, ఆంక్షలను చూపి అతిశయోక్తులతో కథనాలు రాశారు. వారే ఇప్పుడు అక్కడ ఆంక్షలను సడలించిన తరువాత కొత్త కథలు మొదలు పెట్టారు. తిట్టే నోరు తిరిగే కాలూ ఊరికే ఉండవన్నారు కదా పెద్దలు. చైనాలో లక్షల మంది మరణిస్తున్నారని, శ్మశానాల్లో వందల శవాలు కనిపిస్తున్నట్లుగా గతంలో రాసిన వాటికే తేదీలు మార్చి జనానికి అందిస్తున్నారు. జీరో కోవిడ్ విధానంలో భాగంగా కరోనా లక్షణాలు ఉన్న వారికి, లక్షణాలు కనిపించకున్నా అనుమానం ఉన్నవారికి అక్కడి ప్రభుత్వం పరీక్షలు పెద్ద ఎత్తున చేసింది. జనం పట్ల దానికి ఉన్న నిబద్దతకు అది నిదర్శనం. కరోనా ఆంక్షల వలన అక్కడి ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగినప్పటికీ జనారోగ్యంపట్ల కమ్యూనిస్టులు చూపిన శ్రద్దలో భాగం అది. ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగని విధంగా స్వల్పకాలంలో సంపదలను పెంచిన తమకు ఒకటి రెండేళ్లు తగ్గినా తిరిగి పూర్వపు స్థితికి చేరగలమన్న ఆత్మవిశ్వాసం దానిలో కనిపిస్తుంది. కానీ, చైనా వారు చెప్పిందాన్ని నమ్మకూడదని ఒక వైపు చెబుతూ మరోవైపు అక్కడి వృద్ది రేటు గురించి మాత్రం అంగీకరించే ఒక విచిత్ర వైఖరిని మనం చూస్తున్నాం.
తొలుత వచ్చిన దానితో పోలిస్తే కరోనా వైరస్ తీవ్రత, ముప్పు కూడా తగ్గిందన్నది ఒక వాస్తవం. వందేళ్ల క్రితం 1918-20లో అమెరికాలో ప్రారంభమై అనేక దేశాల్లోని 50కోట్ల మందికి సోకిన (జలుబు మహమ్మారి) ఫ్లూ -స్పానిష్ ఫ్లూ కోటీ 70లక్షల నుంచి పది కోట్ల మంది ప్రాణాలను బలితీసుకున్నదని అంచనా. చిత్రం ఏమిటంటే అమెరికాలో జలుబుతో గత పదేండ్లలో ఏటా 34వేల మంది వంతున మరణించినట్లు అంచనా. ఈ ఏడాది ఫ్లూ సీజన్లో కోటిన్నర మందికి సోకుతుందని, వారిలో లక్షన్నర మంది ఆసుపత్రి పాలవుతారని, తొమ్మిదివేల మందికి పైగా మరణించవచ్చని అక్కడి ప్రభుత్వ సిడిసి అంచనా వేసింది. ఈ పరిస్థితి అక్కడి ఆసుపత్రులు, బీమా సంస్థలకు కాసులు కురిపిస్తోంది గనుక ఫ్లూను పూర్తిగా నిరోధించేందుకు పూనుకోవటం లేదన్నది స్పష్టం. వీటి గురించి మనకు మీడియాలో సమాచారం ఉండదు!
ఇప్పుడు ప్రపంచమంతటా తగ్గినా చైనాలో ఎందుకు ఉన్నదనే ప్రశ్నను కొందరు లేవనెత్తవచ్చు. అది కూడా వాస్తవం కాదని వరల్డోమీటర్ సమాచారం వెల్లడిస్తున్నది. వరల్డో మీటర్ అందించిన తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు మొత్తంగా 66కోట్ల మందికి కరోనా సోకగా పదిశాతం మంది మరణించారు. డిసెంబరు 20న నమోదైన కొత్త కేసులు మూడు లక్షలు కాగా మరణించిన వారు 561మంది. తైవాన్ ప్రాంతంలో ఇరవై వేలు, రష్యాలో ఏడున్నరవేలు, ఆస్ట్రేలియాలో మూడున్నరవేల మందికి సోకగా చైనాలో 3,030కేసులు నమోదైనట్లు ఆ వెబ్సైట్ పేర్కొన్నది. ఇప్పటికి మొత్తంగా అమెరికాలో పదకొండు లక్షలమంది మరణించగా చైనాలో మృతులు 5,241 మంది ఉన్నారు. చైనా సంఖ్యల గురించి మేం నమ్మం అని నిత్యశంకితులు ఎవరైనా అంటే చేసేదేమీ లేదు. గత వారంలో జపాన్లో కొత్తగా పదిలక్షలకు పైగా కేసులు నమోదైనట్లు అంతకు ముందు వారంతో పోల్చితే రెండు లక్షల వరకు ఎక్కువ ఉన్నట్లు, మొత్తంగా ఇప్పటి వరకు రెండు కోట్ల 71లక్షల మందికి వైరస్ సోకినట్లు జిజి ప్రెస్ ప్రకటించింది. మన దేశంతో సహా అనేక దేశాల్లో పరీక్షలను నిలిపివేయటానికి ఇప్పుడు ఉన్న రకాలు అంత ప్రమాదకరం గాకపోవటమే. ప్రయివేటుగా చేస్తున్న పరీక్షలు లెక్కల్లోకి రావటం లేదు. వివిధ కారణాలతో చైనాతో సహా అనేక దేశాల్లో రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నందున స్వల్ప ప్రమాదకారిని కూడా ఉపేక్షించకూడదన్నది అక్కడి ప్రభుత్వ వైఖరి. కొందరికి ఇది అతిగా కనిపిస్తుంది కాబోలు... చైనా అనుసరిస్తున్న జీరో కోవిడ్ విధానం గురించి, అవాస్తవమైన లక్షల మరణాల గురించి పుంఖాను పుంఖాలుగా కట్టుకథలు పుట్టిస్తున్నారు. దేశ రహస్యాలు, మిలిటరీ గురించి దాచారంటే అర్థం చేసుకోవచ్చు, ఏ దేశమూ బహిరంగ పరచదు. మానసిక సమస్య తప్ప కరోనా మరణాలను దాచినందున చైనాకు వచ్చే లాభం లేదా ప్రపంచానికి కలిగే నష్టం ఏమీ ఉండదు.