Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకటేమిటి! ఏదైనా కావచ్చు! మతం కావచ్చు, కులం కావచ్చు, ప్రాంతం కావచ్చు! భాషా, భక్తీ, భజనా ఇవ్వి మాత్రమేకాదు, విద్వేషాలను రగల్చడానికి ఒంటికి కప్పుకునే వస్త్రాలూ వాటి రంగులు కూడా వాళ్లకు విభజన శస్త్రాలుగా మారతాయి. ద్వేషం రంగుల్లో ఉండదు. దాన్ని వాడుకునే వారి ఆలోచనల్లో ఉంటుంది. రంగులు ప్రకృతి జనితాలు. ఎవరి సొంతమూ కాదు. రంగులను వాడే సందర్భమూ, ఆ రంగుల ధరించినవారి ఆలోచనలను బట్టే వాటికా భావాలు సమకూరుతాయి. ఒక వస్త్రం, అది ఏ రంగైనా శరీరానికి చుట్టుకుంటే అంగీ అవుతుంది. అదే వస్త్రం కర్రకు కట్టిపై కెత్తితే జెండా అవుతుంది. అంతే. తెల్లని వస్త్రాలు ధరించినవారందరూ శాంతికాముకులు కానట్టే, కాషాయ వస్త్రధారులందరూ తాత్వికులు, తపస్వికులు కారు. ఈ మాత్రం జ్ఞానం లేకకాదు వాళ్లకు. సాకును వెతికేవాళ్లకు రంగులూ ఉపయోగపడతాయి.
ఈ మధ్య షారుక్‌ఖాన్, దీపికా పడుకొణె నటించిన పఠాన్ సినిమాలో ''బేషర్మ్రంగ్'' పాటపై పెద్ద ఎత్తున విద్వేషాన్ని రెచ్చకొడుతున్నారు. ఆ పాటలో దీపిక కాషాయ వస్త్రాలు ధరించి డ్యాన్స్ చేసింది కాబట్టి మా మనోభావాలు దెబ్బతింటున్నాయని సినిమాను, షారుక్‌ఖాన్‌ను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. ఇక అయోధ్యకు చెందిన తపస్వి తగలపెడతానని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ మంత్రి తమ రాష్ట్రంలో సినిమా ఆడనివ్వమని ప్రకటించారు. ధర్నాలూ దహనాలకూ పాల్పడుతున్నారు. దీనికి కాషాయ రంగు వస్త్రం ధరించడం అనేది ఒక సాకు మాత్రమే. అసలు కారణం షారుక్ ఖాన్ మతం. రెండోది, దీపికా పడుకొణె మీద రాజకీయ కక్ష. అప్పుడు ఢిల్లీ జెఎన్‌టియూలో విద్యార్థులపై జరిగిన దాడుల సందర్భంగా వారిని పడుకొణె కలిసి పరామర్శించడం, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడిందనే ద్వేషమూ ఇందులో యిమిడివుంది. ఇంత హీనంగా దిగజారి వ్యవహరించడం వీళ్లకు మాత్రమే సాధ్యమైన విషయం.
నిజంగా రంగు మాత్రమే కారణమయితే, దానివల్లనే మనోభావన దెబ్బతింటోంది అనుకుంటే అలాంటి చిత్రాలు మరెన్నో ఉన్న విషయాన్ని మనం చూడవచ్చు. తమ కాషాయ భావాలనే వల్లెవేస్తూ పేరెన్నికగన్న హిరోయిన్ కంగనారనౌత్ కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తి భుజాలపై తన కాలును మోపి తొక్కి దర్జాగా నిలబడ్డ సినిమా దృశ్యం వారికి కనపడకపోవచ్చు గానీ సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతూనేవుంది. అంతేకాదు వాళ్ల అడుగులకు మడుగులొత్తే అక్షయకుమార్ నటించిన సినిమాలో హరేరామ, హరేకృష్ణ అని రాసున్న కాషాయం వస్త్రాలతో అశ్లీల నృత్యాలు చేస్తున్న పాటకూడా వీళ్ళ మనోభావాలను గాయపరిచిన దాఖలాలు లేవు. వాళ్ల రాజకీయ ప్రయోజనాల కోసమే ఏ రాద్ధాంతాన్నయినా సృష్టించగలుగుతారు. సినిమాలపైన, సినీ నటులపైనా తమ ఆధిపత్య మత దురహంకార భావాలను రుద్దాలనే ప్రయత్నాలు పెరిగిపోతున్నాయి. అలా విద్వేషాలను రెచ్చగొట్టి తీయించిన కాశ్మీర్ ఫైల్స్ సినిమా అంతర్జాతీయ వేదికల మీద నవ్వులపాలు కాక తప్పిందికాదు.
'ప్రపంచ ఆకలి సూచీలో భారత్ 101 నుండి 107వ ర్యాంకుకు పడిపోయింది. నిరుద్యోగం పెరుగుతున్నది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నవి. కానీ మనం మరే విషయంలేనట్లు కాషాయం రంగు బికినీ గురించి మాట్లాడుకోవడం చిత్రంగా ఉందని' సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ వ్యాఖ్యానించడం ఎంత సత్యమైనదో కదా! కాషాయ దుస్తులు వేసుకున్నవారు రేపిస్టులకు, హంతకులకు పూలదండలు వేయవచ్చు! విద్వేష ప్రసంగాలూ చేయవచ్చు, కాషాయం ధరించిన స్వామీజీలు, బాబాలు మైనర్లపై అత్యాచారమూ చేయవచ్చు, ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలూ చేయవచ్చు. కానీ సినిమాలో ఆ రంగు డ్రెస్ వేసుకుని డ్యాన్స్ చేయరాదా? ఇంతకూ ఆ దృశ్యంలోని అశ్లీలతపై వారికేమీ అభ్యంతరం లేదు. కేవలం ఆ కాషాయ రంగుపైనే అని చెప్పటంలోని వారి సంప్రదాయతను అర్థం చేసుకోవచ్చు. ఇలా సినిమారంగంపై నియంత్రణనూ, ఆంక్షలను, బహిష్కరణలను అమలు చేయాలని, తమ మతోన్మాదానికి అనుకూలంగా లేని వాటిపై దాడులకు దిగడం వారి అసలు స్వరూపాన్ని బయటపెడతాయి. ఈ సందర్భాన కలకత్తాలో జరుగుతున్న చలన చిత్రోత్సవంలో బిగ్ బి అమితాబచన్ మాట్లాడుతూ ''దేశంలో వ్యక్తి స్వాతంత్య్రం, స్వేచ్ఛ గురించి, సౌభ్రాతృత్వం గురించి మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తోంది. విభజన ఆలోచనలు ఎప్పుడూ మంచివికావు. ప్రశ్నలు వెల్లువెత్తటానికి స్వేచ్ఛ కొనసాగాలి'' అని వక్కానించాడు అంటే అభివ్యక్తి స్వేచ్ఛాపై నియంత్రణ పెరుగుతుందని పరోక్షంగా పేర్కొనటం నేటి పరిస్థితికి అద్దం పడుతోంది. ఎందరు ఎన్ని చెప్పినా విచ్ఛిన్నతను, విభజనను, విద్వేషాన్ని కోరుకునే వారికి తలకెక్కుతుందా!