Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలాలు రిపీట్ అవుతుంటాయి. రుతుచక్రం తిరుగుతూనే ఉంటుంది కాబట్టి! జెండాలు చాలా మారాయి. పాలించే పార్టీలు మారుతున్నాయి కాబట్టి! రంగు రంగుల విధానాలు జనాన్ని ఏమారుస్తూ స్థిరపడే ప్రయత్నంలో ఉన్నాయి. ఇదంతా 'గతికీ-స్థితి'కీ మధ్య ఉండే వైరుధ్యం కాదు. అంతా 'గతి' గురించే! అన్నీ గతి సం'గతు'లే!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ 2005లో ఆర్టీసీ అధికారులు పోగేసిన ఆర్టీసీ కార్మికులతో ''రూట్లన్నీ మీ గుత్త సొమ్మా?'' అని ప్రశ్నించినప్పుడు అది ప్రయివేటీకరణ కోసమేనని పసిగట్టిన కార్మికులు అందరూ కలిసికట్టుగా ''కుడి ఎడమల కత్తులు మెరియగ'' ఐదురోజులు సమ్మె కట్టారు. ''అవును! రూట్లన్నీ మావే!'' నంటూ ప్రభుత్వాన్ని జరంత వెనక్కి నెట్టింది ఆ సమ్మె. కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం వచ్చింది. గుప్తులకాలం నుంచీ పాపులర్ అయిన స్వర్ణయుగం కాన్సెప్ట్ కేసీఆర్ సొంతం చేసుకుని ''బంగారు తెలంగాణ'' అని వినియోగంలోకి తెచ్చారు. ఎనిమిదేండ్లు నెట్టుకొచ్చారు. ఎండమావుల వెంట ఎంత పరిగెట్టినా దూప తీరట్లేదు. 2022 చివరి వారంలో ప్రయివేటుతో పోటీపడి ఆక్యుపెన్సీ రేషియో(ఓ.ఆర్) పెంచుకుంటేనే పి.ఆర్.సి. అని రవాణశాఖామాత్యులు చెపితే 2005 వై.ఎస్.డైలాగ్ పదిహేడేండ్లకి ప్రతి ధ్వనించడం విని రాష్ట్రం విస్తుపోయింది. ప్రపంచ బ్యాంకుతో కలసి బొందితో కైలాసానికి వెల్తామని, దాన్నే తెలంగాణ పునరుజ్జీవనమని ఇంకా బిఆర్ఎస్ నేతలు ప్రజల్ని నమ్మించే ప్రయత్నంలో ఉన్నారు.
ఆర్టీసీని లాభాపేక్షలేని సేవారంగంగా కాక లాభాల గుడ్లుపెట్టే బంగారు బాతులాగ భావించాలని ప్రపంచబ్యాంకు చంద్రబాబుకు ధర్మోపదేశం చేసింది. ఆ విధంగా ప్రపంచ బ్యాంకు గజ్జిలా తగులుకుందని నేడర్థంకావట్లేదా? మొదట్లో మాట వరుసకైనా ప్రయివేటు ట్రావెల్స్‌ను నియంత్రిస్తామనే వారు. ఇప్పుడూమో రవాణా మంత్రి తాజా ప్రకటనలో ప్రయివేటుతో పోటీపడి లాభాలు మూటకట్టుకుంటేనే ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ అని ముక్తాయించారు.
2019 సమ్మె కంటే ముందున్న 10,500 బస్సుల్లో టిఎస్ ఆర్టీసీకి 1,500 బస్సులు ఎవరు తగ్గించారు? ఎందుకు తగ్గించారో, ఎలా తగ్గించారో మంత్రి చెప్పగలడా? కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌లోనే వెయ్యి బస్సుల్ని ఎందుకు తగ్గించారు? ఆర్టీసీ బస్సులోనే నియోజకవర్గాలకి వెళ్ళాలని మిగిలిన వారికి సూచనలు చేసే రవాణా మంత్రి తనదారిలో ఉన్న మలక్‌పేట బస్టాప్‌లో, నల్లగొండ చౌరస్తా బస్టాప్‌లో సాయంత్రాలు దిగి బస్సుల కోసం పడిగాపులు పడే జనం అవస్థలు చూశారా? వాళ్ళ శాపనార్థాలు విన్నారా? రాష్ట్రంలోని 12,765 గ్రామ పంచాయతీల్లో నేడు 8,800 పంచాయతీలకే బస్సు లెందుకున్నాయి? తట్టలు నెత్తిన పెట్టుకున్న కూరగాయల వ్యాపారులు, ఫ్యాక్టరీల కెళ్ళే కార్మికులు, బడికెళ్ళే పోరగాండ్లు పడే అవస్థలు, చేసుకునే ఖర్చులు వీరికి ఎవరూ చెప్పలేదా? ఒక్క నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి, కొల్చారం, కౌడిపల్లి, చిరిపిచేడు మండలాల నుండే వెయ్యి మందికి పైగా జీడిమెట్ల, కాళ్లకల్, పటాన్చెరువు, లింగంపల్లిలకు ఆటోల్లో పొద్దున్నే డ్యూటీలకొచ్చి, సాయంత్రం ఇండ్లకి చేరతారని, దాని కారణం ఆర్టీసీ బస్సులు రద్దు కావడమేనని మంత్రిగారికెవరైనా చెప్పి పుణ్యం కట్టుకోండి. ఇది ఒక్కఉదాహరణే. ఇటువంటివి ఎన్నో!
కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ యాక్ట్‌కి సవరణ చేసి టూరిస్ట్ పర్మిట్ తీసుకుని ''స్టేజి క్యారేజీ''లు దేశంలో ఎక్కడికైనా పోవచ్చన్న విషయం ఆర్టీసీలకు ఉరేస్తోందని మంత్రికి తెలియదా? తాజాగా 2021లో డీజిల్ 'బల్క్ బయ్యర్లు' (గుత్తగా కొనేవారు) లీటర్ పదిరూపాయలు ఎక్కువకి కొనాలన్న హుకుంనామా అన్ని రాష్ట్ర ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్లనూ దెబ్బతీస్తోంది. దీన్ని కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? కర్ణుడి చావుకి ఆర్గురు కారణమన్నట్లు ఇవన్నీ ఆర్టీసీ దెబ్బతినడానికి కారణాలు. ఇందులో ఒక్కదానికి కూడా కార్మికుల కారణం కాదు! మరి కార్మికుల్ని మీరే బతికించుకోమంటే న్యాయమేనా అమాత్యా! కోవిడ్‌వల్ల విమానాలు నష్టపోతే సులభవాయిదాల్లో తీర్చుకునే అప్పులిచ్చింది కేంద్ర సర్కార్. మెట్రో రైలు నష్టపోతే రూ.1500 కోట్లు రాష్ట్ర సర్కార్ 'గిఫ్ట్' ఇచ్చింది. మరి ఆర్టీసీ కూడా కోవిడ్ వల్ల నష్టపోయింది. మరి దీని సంగతేమిటి? ఉప ఎన్నిక ముందు వెంటనే పీఆర్సీ ఇస్తామని చెప్పి ఏరుదాటంగానే ఓ.ఆర్. పెంచండని మెలిక పెట్టడం సబబేనా మంత్రిగారూ!? బస్సులన్నింటినీ ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామనడం అన్నింటినీ ప్రయివేటుకిస్తామనడమేనని ప్రజలకర్థం కాదా? సిసిఎస్ డబ్బులు, ఎస్ఆర్బిఎస్ డబ్బు, చివరికి కార్మికుల పిఎఫ్ సొమ్ము సైతం కృష్ణార్పణం చేసేసి కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామంటే ఎలా? విధానాల్లో తేడా లేకపోతే మాటలెన్ని చెప్పినా ఉపయోగం మేంటి?