Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''రాజకీయాలలో మనిషికి ఒక ఓటు, ఓటుకు ఒక విలువ అనే సూత్రాన్ని గుర్తించబోతున్నాం. కానీ మన సామాజిక, ఆర్థిక జీవితాలలో మనుషులందరిదీ ఒకే విలువ అనే సూత్రాన్ని అంగీకరిస్తున్నామా? ఎంత కాలం ఈ వైరుధ్యాల జీవితం? ఈ అసమానతలను వీలైనంత త్వరగా అంతం చేయాలి'' అని కాంక్షించారు రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్. ఆయన ఆకాంక్షలకు భిన్నమైన పరిస్థితులు మన దేశంలో నెలకొన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు 15శాతానికి తగ్గితే... ప్రయివేటు రంగ సంస్థలు 85శాతానికి విస్తరించాయి. ప్రయివేట్‌రంగంలో రిజర్వేషన్లు లేనందువల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు మహిళలు, వికలాంగులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారనేది వాస్తవం. దీంతో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు నిరుపయోగంగా మారుతున్నాయి. సామాజిక, ఆర్థిక అసమానతలు మరింత పెరిగి దేశ ఐక్యతకు, అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. వాటిని అధిగమించాలంటే ప్రయివేటురంగంలో కూడా రిజర్వేషన్లు అమలుచేయాలని సామాజికవేత్తలు, ప్రగతిశీల వాదుల అభిలాష.
పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలతోనే దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది. ఎన్నో తరాలుగా కార్పొరేట్ శక్తులు కష్ట జీవుల శ్రమను దోచుకోవడం వల్ల మెజారిటీ ప్రజానీకం ఆర్థికంగా, సామాజికంగా అణచివేతకు గురవుతున్నారు. విద్యా, ఉపాధి రంగాల్లో ప్రభుత్వ రంగానిది కీలక పాత్ర ఉన్న కాలంలో రిజర్వేషన్ల ప్రయోజనం కొద్దిమేరకైనా ఉండేది. ప్రభుత్వ పెట్టుబడి, ప్రభుత్వ రాయితీలు, పన్ను మినహాయింపులు, ప్రభుత్వ రక్షణ లాంటి అనేక సదుపాయాలు పొందుతున్న కార్పొరేట్ సంస్థలు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కలిపిస్తే ప్రతిభ దెబ్బ తింటుందనే చిలుక పలుకులు పలుకుతున్నాయి.
రిజర్వేషన్లు ఇంకెన్నాళ్లు, రిజర్వేషన్ల వల్ల ప్రతిభ దెబ్బ తింటోందని, క్రీమిలేయర్ విధానం తీసుకురావాలని ఇలా ఎన్నో వాదనలను, చర్చను న్యాయ స్థానాల ద్వారా చేస్తూనే ఉన్నారు. బీసీ గణన డిమాండ్‌ను కూడా ఈ ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి. మన దేశంలో కుల వ్యవస్థ, ఆకలి, అవమానాలు, అసమానతలు ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. అసలు రిజర్వేషన్లను చూసే విధానమే మారాలి. అప్పుడే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు సరైన న్యాయం జరుగుతుంది. ఇందుకోసం పార్లమెంట్లో చట్టం చేయాలి. అప్పుడే అన్ని వర్గాలకు ఉపాధి అవకాశాలు దక్కుతాయి. సామాజిక, ఆర్థిక అసమానతలు కొంతైనా తగ్గుతాయి.
మన పాలకులు మొదటి నుంచి రిజర్వేషన్లను చిత్తశుద్ధితో అమలు చేయలేదు. జనాభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషను ్ల అమలు కావడం లేదు. ఇప్పటికీ 1981 జనాభా లెక్కల ప్రకారమే రిజర్వేషన్లు అమలు పరుస్తున్నారు. అంటే రాజ్యాంగంలో గ్యారంటీ ఇచ్చిన చట్టాలకే దిక్కు లేకుండా పోయింది. భవిష్యత్తులో ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల కోసం చట్టం చేసినా... కార్పొరేట కంపెనీల ముందే ధర్నాలు చేసుకోండని చెప్పి చేతులుదులుపుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేపీ, దాని సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్లది రిజర్వేషన్ల పట్ల తొలి నుంచీ వ్యతిరేక వైఖరే. ఇదే విషయాన్ని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ వారి అధికారిక పత్రిక 'ఆర్గనైజర్'లో స్పష్టంగానే సెలవిచ్చారు.
రాజకీయ పార్టీలు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల అమలు అంశాన్ని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టినా... ఆ తర్వాత వాటి ఊసే ఎత్తడం లేదు. యూపీఏ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ చట్టం చేయకుండానే వెనక్కి తగ్గింది. మోడీ ప్రభుతం అసలు దీన్ని లెక్కలోకే తీసుకోవడం లేదు. బీ(టీ)ఆర్ఎస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎస్టీలు, మైనార్టీల రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చినా నేటికీ అది అందని ద్రాక్షగానే ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను పొందేందుకు, ఆర్థిక సమానత్వం సాధించేందుకు ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్ల అమలు అత్యవసరం. ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్ల అమలు కోసం పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు అన్ని వర్గాలు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అప్పుడే అందరికి జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. అసమానతలకు, దోపిడీకి గురవుతున్న శక్తుల మధ్య ఐక్యత పెంచడం పోరాడడం ద్వారానే హక్కులను, లక్ష్యాలను సాధించగలం. అందుకు ప్రగతిశీల శక్తులు కృషి చేయడమే పరిష్కారం.