Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ప్రజారోగ్యంపై దృష్టి సారించి.. సర్కారీ దవాఖనాలను బలోపేతం చేసే దిశగా కార్యాచరణను అమలు చేస్తోంది...' ఎనిమిదిన్నరేండ్ల టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రగతి ప్రస్థానం పేరిట తాజాగా విడుదల చేసిన నివేదికలో వైద్యారోగ్యశాఖ పురోగతిపై ప్రభుత్వం పేర్కొన్న తొలి పలుకులివి. 'ప్రసవ వేదనతో ఐదు ఆస్పత్రులకు.. అయినా దక్కని ప్రాణాలు...' బుధవారం నాటి దినపత్రికల్లో మొదటి పేజీలోని వార్తలకు శీర్షికిది. నాగర్ కర్నూల్ జిల్లాలో వైద్యమందక తల్లీ, ఆమె కడుపులో ఉన్న బిడ్డా కన్నుమూసిన హృదయ విదారక ఉదంతం.. దానికి సంబంధించిన వార్తల సారాంశమిది. ఈ క్రమంలో ప్రభుత్వం చెప్పిన వాక్కులకు.. పత్రికల్లో వచ్చిన వార్తలను పోల్చి చూస్తే వాస్తవ పరిస్థితి ఇట్టే బోధపడుతుంది.
ప్రజారోగ్య వ్యవస్థ బలంగా ఉండాలంటే.. బలపడాలంటే కిందిస్థాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(పీహెచ్సీ)లను బలోపేతం చేయాలన్నది కీలక సూత్రం. వైద్య రంగంలోని నిపుణలు, ఆ రంగానికి చెందిన ప్రముఖులు ఎప్పటి నుంచో నొక్కి చెబుతున్న అంశమిది. ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయకుండా మనం ఎన్ని నిధులు వెచ్చించినా.. మరెన్ని దవాఖానాలు నిర్మించినా అవి పూర్తిస్థాయిలో సత్ఫలితాలు ఇవ్వబోవనేది అనేక సార్లు రుజువైంది. తాజాగా వెలుగు చూసిన ఘటనలో సైతం క్లిష్టమైన కాన్పులు చేయటానికి అవసరమైన పరికరాలు, శస్త్ర చికిత్సలు నిర్వహించటానికి కావాల్సిన థియేటర్లు అందుబాటులో లేకపోవటం వల్లే ఆ గర్భిణీని ఆస్పత్రిలో చేర్చుకోలేకపోయామంటూ వైద్యాధికారులు ఆవేదన వ్యక్తం చేయటం గమనార్హం. చివరకు అన్ని సౌకర్యాలు, వసతులున్న పెద్దాసుపత్రికి వెళ్లినా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోవటమనేది ఇక్కడ మన వైద్య వ్యవస్థను వెక్కిరిస్తున్నది.
ఈ సందర్భంలోనే మనం కేంద్ర ప్రభుత్వ వైఖరిని, దాని విధానాలను కూడా ప్రశ్నించాలి. మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు వైద్య రంగానికి కేటాయించే నిధులను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఆ రంగానికి వెచ్చించే నిధులు దేశ జీడీపీలో ఒక శాతం కంటే తక్కువగా ఉండటం దారుణాతి దారుణం. ఈ క్రమంలో ప్రజలు తమ ఆదాయంలోంచి 60 శాతం కంటే ఎక్కువ సొమ్మును ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. ఇది వారి జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నది. ప్రజారోగ్యానికి మొత్తం బడ్జెట్లో కనీసం ఆరు నుంచి పది శాతం నిధులు కేటాయించకుండా ఆ రంగాన్ని బలోపేతం చేస్తామనటం ఒట్టిమాటే. మరోవైపు రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సైతం పటిష్ట పరచటం ద్వారా తాము ఇన్స్టిట్యూషనల్ డెలివరీ(ఆస్పత్రుల్లో ప్రసవాలు)లకు దోహదం చేస్తున్నామంటూ పాలకులు చెబుతున్నారు. ఎనిమిదిన్నరేండ్ల ప్రగతి నివేదికలో పేర్కొన్నట్టుగా అదే జరిగితే... అటు గర్భిణీలు, ఇటు ఆస్పత్రులు ఇప్పుడీ 'ప్రసవ వేదన' ఎందుకు పడాల్సి వచ్చేదనే ప్రశ్నకు సర్కారు ఏం సమాధానం చెబుతుంది..? కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్ల ద్వారా మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్నామనే మాటలు బాగానే ఉన్నప్పటికీ... పీహెచ్సీల్లో వసతులను మెరుగు పరచటం ద్వారా ప్రసవించేందుకోసం వచ్చే గర్భిణీలు, వారికి పుట్టే నవజాత శిశువులను రక్షించే బాధ్యతలను ప్రభుత్వం తీసుకోకపోవటం అత్యంత శోచనీయం.
మరోవైపు నూతన వైద్య కళాశాలలు, జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నా... గ్రామీణ స్థాయిలోని పేదలకు అందించే వైద్యం నానాటికీ విస్మరణకు గురవటం బాధాకరం. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల్లోని మారుమూల పల్లెలు, దళిత వాడలు, గిరిజన గూడెల ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగానే మారింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు, తెలంగాణ సిద్ధించి ఎనిమిదిన్నరేండ్లు దాటినా ఇంకా అంబులెన్సు సౌకర్యం లేని ప్రాంతాలు, సూది, మందు గోలీ లేని ఆస్పత్రులు ఉండటాన్నిబట్టి మన ప్రజారోగ్య వ్యవస్థ ఎలాంటి దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నదో విదితమవుతున్నది. ఈ క్రమంలో పాలకులు నగరాలు, పట్టణాల్లోని ఆస్పత్రులను, వాటి భవనాలను చూపించి సంబరపడిపోకుండా పల్లె వైద్యానికి సైతం పట్టం గట్టాలి. అందుకోసం బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించి... శాశ్వత ప్రాతిపదికన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని నియమించాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో సౌకర్యాలు, వసతులను మెరుగు పరచాలి. ఇందుకోసం కేరళ నమూనాను ఆదర్శంగా తీసుకుంటే నాగర్ కర్నూల్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవచ్చు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ఇదొక్కటే మార్గం.