Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2022కు వీడ్కోలు, 2023కు స్వాగతం పలికేందుకు ప్రపంచమంతా సిద్దం అవుతోంది. ఒక వైపు మాంద్య భయం. మరోవైపు ఇప్పటికే ఉక్రెయిన్‌లో అమెరికా పెట్టిన చిచ్చు అనేక చోట్ల జనజీవితాలను అంధకారంలోకి నెడుతోంది. ఎంతకాలం అది కొనసాగుతోందో తెలియని స్థితి. తాము ఊహించిన, అంచనా వేసిన విధంగా రష్యాను కట్టడి చేయటంలో విఫలమైన పశ్చిమ దేశాలు మరిన్ని కుట్రలకు తెరలేపుతున్నట్లు జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ప్రలోభాలు, నయాన భయాన, యుద్ధంలో లొంగని దేశాలను దారికి తెచ్చుకొనేందుకు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సదరు దేశాల నేతలను కుట్రలతో అంతమొందించటం లేదా ప్రభుత్వాలను కూలదోసి బందీలుగా చేసిన దుష్ట విధానాన్ని అమెరికా అమలు జరిపింది. దాని కుట్రలకు బలైనవారి లో ప్రజాభిమానం పొందిన నేతలతో పాటు తమ కుట్రలకు సహకరించని లేదా లొంగని నియంతలు, తామే పెంచి పోషించిన బిన్ లాడెన్ వంటి ఉగ్రవాద నేతలు కూడా ఉన్నారు. గత శతాబ్దిలో ఇరాక్ నేత సద్దాం హుసేన్, లిబియా పాలకుడు మహమ్మద్ గడాఫీని బహిరంగా ఎలా అంతమొందించిందీ చూశాం. ఆ కుట్రలను తిరిగి కొనసాగించేందుకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. దానిలో భాగంగానే అమెరికాకు కొరకరాని కొయ్యగా మారిన రష్యా అధినేత వ్లదిమిర్ పుతిన్, ఇతర ముఖ్యనేతలను భౌతికంగా అంతమొందించి తమ లక్ష్యాన్ని సాధించుకొనేందుకు బహిరంగంగానే పిలుపులు ఇస్తున్నారు.
సీఐఏ పాత్రధారిగా ఉండి కుట్రలతో అంత మొందించిన వారి గురించి అమెరికా సెనెట్ కమిటీ 1970వ దశకంలో జరిపిన విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాంతో కొంత వెనక్కు తగ్గినట్లు కనిపించినా కుట్రలను మానలేదు. మరికొందరిని బలిగొన్నారు. ఆ జాబితాలో ఒకరైన ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో అలీన ఉద్యమంలో చురుకుగా ఉండటంతో పాటు కమ్యూనిస్టుల పట్ల సానుకూలంగా ఉండటాన్ని అమెరికా జీర్ణించు కోలేపోయింది. దాంతో సుకర్ణోను పదవి నుంచి కూలదోసి కమ్యూనిస్టులను ఊచకోత కోశారు. కాంగో అధ్యక్షుడు, వామపక్ష పాట్రిస్ లుముంబాను వైరస్‌తో చంపాలని చూశారు, చివరికి కుట్రతో కూలదోసి చంపారు. చిలీ సోషలిస్టు నేత సాల్వెడోర్ అలెండీని కుట్రతో చంపారు. ఇక క్యూబా నేత ఫిడెల్ కాస్ట్రోను అంత మొందించేందుకు చేసినన్ని ప్రయత్నాలు మరొక నేత మీద లేవంటే అతిశయోక్తి కాదు. కాస్ట్రో తాగే చుట్ట మొదలు రాసే పెన్ను వరకు, విశ్రమించే పక్క నుంచి నీటి అడుగున ఈదేందుకు వేసుకొనే సూటు వరకు విషపూరితం గావించేందుకు చేసిన కుట్రలు అమెరికా సెనెట్ కమిటీ విచారణలో వెలుగులోకి వచ్చాయి. అందుకే హత్యాయత్నాలను ఎదుర్కోవడంలో ఒలింపిక్ బహుమతి ఇస్తే అది తనకే వస్తుందని కాస్ట్రో చమత్కరించాడు.
అమెరికన్లు సృష్టించే కట్టుకథలు, పిట్టకథలను పతాక శీర్షికల్లో అందించే పత్రికలు, టీవీలు వారి నేతలు తమకు నచ్చనివారిని అంతమొందించాలని బహిరంగంగా ఇచ్చిన పిలుపులను మాత్రం విస్మరిస్తాయి. అక్టోబరు, నవంబరు నెలల్లో రష్యాలోని కొన్ని వైమానిక స్థావరాలు, ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న క్రియావంతెన పేల్చివేత వంటి ఉదంతాలను చూసిన తరువాత వాటి వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు స్పష్టం అవుతోంది. రష్యన్ నేతలను అంతమొందించేందుకు నిర్వహించిన రిహార్సల్సుగా వాటిని చెప్పవచ్చని చెబుతున్నారు. సీఐఏ మాజీ అధిపతి డేవిడ్ పెట్రాస్, అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్, సెనెటర్ లిండ్సే గ్రాహమ్ వంటి వారు ఇటీవల పుతిన్‌ను అంతమొందించాలని బహిరంగంగానే పిలుపునిచ్చారు. వీటిని ఖండించాల్సిన జో బైడెన్ సర్కార్ మౌనంగా ఉండటాన్ని తాజాగా రష్యన్ విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావరోవ్ ఖండించాడు. రష్యా అధ్యక్ష భవనం మీద దాడి చేసి భౌతికంగా దేశాధిపతిని అంతమొందిస్తామని కొందరు అమెరికా రక్షణశాఖ పెంటగన్ అధికారులు చెప్పారంటూ సెప్టెంబరు చివరి వారంలో అమెరికా పత్రిక న్యూస్ వీక్ రాసిన కథనాన్ని లావరోవ్ ప్రస్తావించాడు. అలాంటి వాటిని అమలు జరపాలని చూసేవారు వాటితో తలెత్తే పర్యవసానాలను కూడా ఆలోచించుకోవాలని హెచ్చరించాడు. ఆ పత్రిక వార్తల మీద స్పందించిన పుతిన్ తమ రక్షణకు అవసరమైతే అణ్వస్త్రాలను ప్రయోగిస్తామని చేసిన ప్రకటనను మాత్రమే ప్రపంచ మీడియా ప్రముఖంగా పేర్కొన్నది. అణుదాడికి తాము సిద్దమని బ్రిటన్ మాజీ ప్రధాని లిజ్ ట్రస్ చేసిన ప్రకటన, నాటో దేశాలు అణుదాడులు జరపాలన్న ఉక్రెయిన్ నేత జెలెనెస్కీ పిలుపులు మాత్రం ఎక్కడా మనకు కనిపించవు.
సీఐఏ కుట్రల గురించి 1975లో సెనెట్ విచారణ తరువాత మరుసటి ఏడాది ''రాజకీయపరమైన హత్యల్లో పాల్గొనటం లేదా కుట్రపన్నటంలో అమెరికా ప్రభుత్వ అధికారి ఎవరూ పాల్గొనరాదంటూ'' నాటి అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్ ఒక ఉత్తరువు జారీ చేశాడు. ఇది సీఐఏ పాత్రను బహిరంగంగా అంగీకరించటమే. కానీ తరువాత కూడా సీఐఏ ఏ మాత్రం తగ్గలేదు, కొత్త పద్ధతులను అనుసరిస్తోంది. కార్లను నియంత్రించే వ్యవస్థలను అదుపులోకి తెచ్చుకొని తాము చంపదలచుకున్నవారు ప్రమాదంలో మరణించినట్లుగా చిత్రించేందుకు పథకాలు వేసినట్లు వికీలీక్స్ వెల్లడించిన సమాచారంలో ఉంది. మేకతోలు కప్పుకున్నంత మాత్రాన పులి స్వభావం మారదు, సీఐఏ కూడా అంతే!