Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముగుస్తున్న సంవత్సరంలో ముసురుకున్న చీకట్లను చీలుస్తూ ఓ వెలుతురు గీతమై నూతన సంవత్సరానికి స్వాగతం పలికిందో జనసందోహం. జీవితాన్ని అభద్రంగా సమాజాన్ని కల్లోలంగా మార్చుతున్న కాలాన్ని సవాలు చేస్తూ ఎరుపెక్కిన కర్తవ్యమై కవాతు చేసింది. వ్యవసాయ కార్మిక సంఘం మూడవ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఖమ్మం నగరంలో లక్షలాదిగా పోటెత్తిన ఆ కష్టజీవుల బహిరంగ సభ, భావి ఉద్యమాలకు ఓ తిరుగులేని భరోసానిచ్చింది. ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన ప్రసంగం దేశంలో రాజ్యమేలుతున్న ప్రజావ్యతిరేక విధానాలనూ, విద్వేష - విభజన రాజకీయాలనూ అవగతం గావిస్తే... సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సందేశం అక్కడ వెల్లివిరిసిన చైతన్యానికి మార్గదర్శనం చేసింది. మొత్తంగా ఈ సందర్భం నేటి మారిన పరిస్థితుల్లో తెలంగాణ సమాజానికి ఓ కొత్త చూపునిస్తోందనడంలో సందేహం లేదు.
మన రాజకీయ వ్యవస్థలో చోటు చేసుకుంటున్న అనేక అవాంఛనీయ పరిణామాణాలను ఈ సభలో విజయన్ ప్రస్తావించారు. దేశంలో మతమూ, రాజకీయమూ కలిసి చెలాయిస్తున్న క్రూరత్వాన్ని తూర్పారబట్టారు. అభిప్రాయాలపై అణచివేతను ఖండించారు. బీజేపీ యేతర రాష్ట్రాల్లో ఫెడరల్ స్ఫూర్తికి కలుగుతున్న విఘాతాన్ని నిలదీశారు. బీజేపీ అనైతిక, అప్రజాస్వామిక, అవినీతి పాలనను ఎండగట్టారు. మధ్యయుగాలనాటి ధార్మిక సూత్రాలను నెత్తికెత్తుకున్న నేతల తీరును ఎత్తిచూపారు. అయితే సమస్త ప్రజారంగాలలో ప్రజా ప్రతిఘటనను నిర్మించడం ద్వారా మాత్రమే వీటన్నిటినీ ఎదుర్కొగలమన్న విజయన్ వ్యాఖ్యలు చాలా కీలకమైనవి. ముఖ్యంగా నదీనదాలు, గనులు, పరిశ్రమలు, అడవులు, కొండలు, సాగర తీరాల వంటి ప్రాకృతిక సామాజిక సంపదలతో పాటు, విద్య, వైద్యం, రవాణా, బ్యాంకింగ్ వంటి సమస్త సేవారంగాలనూ కార్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకు మోడీ సర్కార్ బరితెగించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యల ప్రాధాన్యతను గుర్తించాలి.
ఇప్పటికే దాదాపు సగానికి పైగా ప్రజాజీవితం ప్రయివేటు కౌగిట్లోకి వెళ్ళిపోయింది. మన చేత పన్నులు కట్టించుకునే ప్రభుత్వం కనపడాల్సిన చోట, ప్రజలకు నేనున్నానని ప్రభుత్వం భరోసానివ్వాల్సిన చోట ప్రయివేటురంగమే పళ్ళికిలిస్తూ దర్శినమిస్తోంది. ఇలా మోడీ ఎలుబడి ప్రతీదీ తన ప్రయివేటు కార్పొరేటు మిత్రులకే కట్టబెడుతూ, ఓటేసిన ప్రజలను మాత్రం అనేక ఇక్కట్లకు గురిచేస్తోంది. చివరికి వారికి ప్రభుత్వం నుండి అందే అరకొర సాయాన్ని కూడా ఉచితాల పేరుతో ఉపసంహరించే కుట్రలు చేస్తోంది. అందుకే ''సంక్షేమం ఉచితం కాదు - ప్రజల హక్కు'' అని విజయన్ గుర్తుచేయాల్సి వచ్చింది. రాజ్యం తాను హామీ ఇచ్చిన సంక్షేమానికి తానే విరుద్దంగా వ్యవహరిస్తున్న తీరును కూడా ప్రజా ఉద్యమాల ద్వారానే నివారించగలమని తెలియజేశారాయన. ఈ ప్రయత్నాలేమీ చేయకుండా కేవలం ప్రజల్లో సహజంగా కలిగే అసంతృప్తిని, ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకుని లబ్ధిపొందాలనుకునే ప్రతిపక్ష పార్టీల స్వభావాన్ని కూడా ఆయన పరోక్షంగా హెచ్చరించారు. నేడు బీజేపీ పాలనలో చోటు చేసుకుంటున్న అపసవ్యతల పట్ల, అసమంజసతల పట్ల, అన్యాయాల పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్న మాట నిజం. కానీ, అదే సమయంలో ఆ అసంతృప్తిని దారి మళ్లించేందుకు బీజేపీ సృష్టిస్తున్న జాతి వైషమ్యాలు, రగిలిస్తున్న భావోద్వేగాలు, చేపడుతున్న విభజన రాజకీయాలు అంతకంటే నిజం. దేశంలో ఎన్నికల రాజకీయాలలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఇది గ్రహించడంలో వెనుకబడివున్నాయి. అందుకే అధికారపక్షం బహుముఖాలుగా దాడి చేస్తున్నా ప్రత్యామ్నాయంగా ఉండాల్సినవాళ్ళు చీలికలు పేలికలవుతున్నారు. ప్రజల నుంచి ప్రజాస్వామిక స్పందనలు వెలువడుతున్నా ప్రతిపక్షాలు ఐక్యంగా వాటిని సంఘటితం చేయడానికి పూనుకోలేకపోతున్నాయి.
ఇది గుర్తెరిగి ఇందుకవసరమైన భావ ప్రచారాన్ని కూడా మేళవించి, తదనుగుణమైన ప్రజాభిప్రాయాన్ని నిర్మించి, ప్రజల్ని పోరాటాల ద్వారా సంఘటితపరచడం ద్వారా మాత్రమే వీరి బారి నుండి దేశాన్ని కాపాడుకోగలం. అందుకే ఆచరణలో దీనిని నిరూపించిన ఢిల్లీ రైతాంగ పోరాటాన్ని ఇక్కడ గుర్తుచేశారు తమ్మినేని. మోడీ సర్కారు మెడలు వంచి, మూడు రైతు వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టిన ఆ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆ విజయంలో వ్యవసాయ కార్మిక సంఘం కృషిని కూడా అభినందిస్తూ... మహౌన్నత పోరాటాల చరిత్ర కలిగిన ఈ తెలంగాణ నేల మీద మతోన్మాదులకు అవకాశమివ్వకూడదని పిలుపునిచ్చారు. నిజమే... సమూహాలను సమాయత్తం చేయడం, ఉద్యమాల నిప్పు రాజేయడమే ఇప్పుడు కావల్సింది. ఆ అవసరాన్ని, అందుకు ప్రజల సంసిద్ధతను ఈ వ్యవసాయ కార్మిక సభ ఎలుగెత్తి చాటింది.