Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనకే ఈ కొత్తవన్నీ, నూతన ఆలోచనలకు వేసుకునే ప్రణాళికలన్నీ, ఒక గీతను, ఒక వత్సరాన్ని దాటి మరో అడుగు కొత్తగా వేయాలని, మళ్లీ మళ్లీ మనల్ని మనం పునర్విమర్శించుకుని, వివేచించుకుని పునర్లిఖించుకుంటాం కొత్త భావాల తోరణాలు కట్టుకుని. ఇది మనుషులుగా మనకే దక్కిన అవకాశం. ఆశల్నీ కలల్నీ పండించుకునే కృషి వలులం మనమే. ఆకాంక్షల నెరవేర్చుకోనేందుకు అడుగులు వేసే ఆచరణా మనదే. కాలం కదలుతూ ఉంది. ప్రకృతీ కదులుతోంది. వీటితో పాటుగానే సమాజమూ చలనంలోనే ఉంది. ఈ చలనంలోని మార్పులను అవగాహన చేసుకునే మేధస్సును కలిగున్నదీ మనమే. అందుకే ఈ మూల్యాంకనాలు, మళ్లీ కొత్తగా మొదలవ్వడాలు. పరిణామాల పరిశీలనలో పాఠం, జ్ఞాన రూపమై మేల్కొంటుంది. కొత్త అడుగును కంటుంది. అంతిమంగా ఆచరణే మనిషి మనుగడను నిలబెడుతుంది.
ట్వంటీ ట్వంటీత్రీలోకి అడుగుపెడుతున్న సందర్భాన మళ్ళీ ఒకసారి మన స్థితిని మననం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే భవిష్యత్తును ఎలా తీర్చుకోవాలో ఎరుకపడుతుంది. కాలం సహజమైనది. ప్రకృతీ సహజమైనదే. కానీ సమాజం మనం నిర్మించుకున్నది. మనకు మనమే మార్చుకొంటున్నది. అది బాగున్నా బాగాలేకపోయినా అది మన చైతన్య ఫలితం. ఇప్పుడు మనకెదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో తెలియాలి. ఒక ఉన్నత మానవ జీవనం సాగించడానికి సమాజాన్ని ఎలా నిర్మించుకోవాలో తెలియాలి. అందుకోసం ఆలోచన చేసే సందర్భమే కొత్త ఏడాది ఆరంభ దినం. అందరం మంచి జరగాలనే కోరుకుంటాం. ఆశలు నెరవేరాలని, చదువులో ఉత్తీర్ణులవ్వాలని, ఉద్యోగం దొరకాలని, ఆరోగ్యం బాగుండాలని, దారిద్య్రాలు పోవాలని, హింసా విధ్వంసాలులేని ప్రశాంత జీవనం గడపాలని, యుద్ధం ముగిసి శాంతి వెల్లివిరియాలని, మమతానురాగాలు, మానవీయ పరిమళాలు ప్రసరించాలని, ప్రేమ గెలవాలని, సత్యం విజయం పొందాలని... ఇలా అన్నీ జరగాలనే మనం కోరుకుంటాము. కానీ ఇవన్నీ యేండ్లుగా ఎందుకు సాధించలేకపోయామనే ఆలోచనా చేయాలి. కొందరికి కొన్ని సమకూరి ఉండవచ్చు. ఇంకొందరికి అనుకున్న దానికంటే ఎక్కువా దక్కవచ్చు. కానీ దక్కనివాళ్లే అధికం. దుఃఖమే అధికం, బాధలే అధికం, కన్నీళ్లే అధికం. మనకు దక్కాల్సిన సంతోషాలను, ఆనందాలను ఎవరో తన్నుకుపోతున్నారే విషయాన్ని తెలుసుకోవాలి. గత సంవత్సరాలలో - దేశంలో కరోనా, ఆర్థిక సంక్షోభాల కారణంగా జీవితాలు అతలాకుతలమైపోయాయి. నిరుద్యోగం పెరిగింది. పనికోల్పోయాము.. అసమానతలు పెరిగాయి. దవ్యోల్బనం పెరిగి రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. దేశానికి అన్నం పెట్టే రైతన్న గొంతుకు ఉరితాళ్ళు ముసురుకున్నాయి. దారిద్య్రం పెరిగింది. ఆకలి పెరిగింది. అనారోగ్యమూ పెరిగింది. నేరం పెరిగింది. అణచివేత, ప్రకృతి విధ్వంసమూ పెరిగింది. మరో ప్రక్కన సంపదంతా ఒకవైపునకు పోగుపడుతున్నది. ఒక్కశాతంగా ఉన్న జనాభా దగ్గర నలభైశాతం సంపద పోగుపడింది. గౌతమ్ ఆదానీ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద సంపన్నుడుగా ఎదిగాడు. బడా కార్పొరేటు సంస్థలకు పదిలక్షల కోట్ల రూపాయల రుణాలను ప్రభుత్వం రద్దు చేసి, వారిని కాపాడుకున్నారు. కానీ రైతులు అప్పులతో తిప్పలు పడుతున్నారు. ప్రజలు నిర్మించుకున్న ప్రభుత్వ సంస్థలను ప్రయివేటుకు అప్పనంగా అప్పజెపుతున్నది. ధనవంతులకు దోచిపెడుతూ పేదల, అశేష ప్రజలపై భారాలను ప్రభుత్వాలు మోపుతున్నాయి.
ఈ చర్యలే సమాజంలో అశాంతికి, అలజడికి కారణమవుతున్నది. వీటిపై మాట్లాడటమో, పరిష్కరించడమో చేయకుండా పాలకులు కబుర్లు చెబుతున్నారు. ఉద్వేగాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య విభజనను సృష్టిస్తున్నారు. సాంస్కృతిక జీవనంపైన దాడులను నిర్వహిస్తున్నారు. మనదేశ రాజ్యాంగ సూత్రాలను, విలువలను తుంగలో తొక్కుతున్నారు. 'నూతన భారతం' అనే అందమైన నినాదంతో మెజారిటీ వాదాన్ని ముందుకు తెచ్చి భిన్నత్వంలో ఏకత్వమనే భారతీయ జీవన సారాన్ని ధ్వంసమొనరుస్తున్నారు. ఇక న్యాయదేవత కండ్ల మూతతోపాటు నోటినీ కట్టేస్తున్నారు. ఎన్నికలు, ప్రజాస్వామ్యం ఒక ఈవెంట్ మేనేజ్మెంట్గా మార్చేసారు. ఓటు, నాయకుడు, ప్రభుత్వము అన్నీ ఇప్పుడు సరుకుగా మారిపోయి, అమ్మకాలు, కొనుగోళ్లుగా మారిపోయాయి. ఇప్పుడు నిలిచి వెలుగుతున్నది జ్ఞానం కాదు, ధనమూ, మత ద్వేషమూ.
ఈ పరిస్థితుల నుండి మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాము. ఇది కేవలం రాజకీయ సమస్యనే కాదు, మనందరి బతుకు సమస్య భవిష్యత్తు సమస్య. అయితే ఈ సవాళ్లపై ప్రతిఘన కూడా మొదలవుతున్నది. రైతులు, కార్మికులు, పేద ప్రజలు, ఉద్యోగులు, సామాన్యులూ పోరాటంలోకి వస్తున్నారు. ఈ సమాజ దుష్టత్వంపై సమరం సాగించే సంవత్సరంగా నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుదాం. మన భవిష్యత్తు మన చేతుల్లోనేవుంది. పదండి ముందుకు!