Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'స్వేచ్ఛాఫలాలు సామాన్యులకూ అందాలి... అన్నింట్లో అందరికీ సమానావకాశాలు దక్కాలి... స్వతంత్ర భారతం సుసంపన్న, ప్రజాస్వామ్య, పురోగామి దేశం కావాలి!' తొలి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో తొలి ప్రధాని నెహ్రూ అభిలాష ఇది. అటువంటి భారతావని కోసం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగ ప్రవేశికలోనే ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందాలని కాంక్షించారు. రాజ్యాంగంలోని అనేక ఆర్టికల్స్‌లో సామాజిక న్యాయ స్ఫూర్తి అంతర్లీనంగా ఉంటుంది. రాజ్యాంగంలోని 38(1)వ అధికరణం ప్రజలందరి సంక్షేమాన్ని దష్టిలో ఉంచుకొని న్యాయబద్ధమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను నెలకొల్పాలని చెబుతోంది. చట్టం అందరికీ సమానమే అని రాజ్యాంగం ఘోషిస్తోంది. సామాజికంగా అందరూ సమానం అని చెబుతూ..17వ అధికరణతో అంటరానితనాన్ని నిషేధించింది. ఆర్థిక న్యాయం అందాలనే 24వ అధికరణతో వెట్టి చాకిరిని నిషేధించింది. రాజకీయాల్లో ప్రజలు స్వేచ్ఛగా పాల్గొంటేనే రాజకీయ న్యాయం సాధించినట్లు. అందుకే ఏ వ్యక్తీ రాజకీయ హక్కుల వినియోగంలో ఎలాంటి మత, జాతి, లింగ వివక్షకు గురికాకూడదని 325వ అధికరణాన్ని పొందుపరిచారు. కానీ స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్లల్లో.. చట్టాల అమలు మాత్రం చట్టబండలే అన్న విషయాన్ని ప్రపంచ చట్టబద్ధ పాలనా సూచీ (ఆర్ఓఎల్ఐ) -2022 కూడా ఇప్పుడు స్పష్టం చేస్తోంది.
నిరంకుశ అధికారాలకు తావివ్వని భారత రాజ్యాంగం 'పాలన చట్టబద్ధం'గా సాగాలని నిర్దేశిస్తోంది. కానీ, కేంద్రంలో అధికారాన్ని చలాయిస్తున్న పెద్దలు 'చట్టబద్ధ పాలన'ను ఎండమావిగా మార్చేశారన్న చేదువాస్తవానికి ఈ సూచీ తాజా ఉదాహరణ. ప్రభుత్వాధికారాలకు పరిమితులు, ప్రాథమిక హక్కులు, అందిరికి న్యాయం, అవినీతి లేని పాలన వంటి ఎనిమిది ప్రధానాంశాల ప్రాతిపదికన 140 దేశాల్లో మన దేశానికి 77వ స్థానం దక్కింది. వివక్షకు అతీతంగా అందరూ సమానమే అన్న విషయంలో నైతే భారత్‌ది 117వ స్థానం. అంటే దేశంలో వివక్షత ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. కుల, మత, ప్రాంతీయ వివక్షత 'ఇందు కలదు అందు లేదు' అన్న చందంగా అన్ని రంగాల్లో కొనసాగుతోంది. అసలు దానిని పాలు పోసి మరీ సాదుతున్నది పాలకులే. ఆర్ఓఎల్ఐలో ఇండియాను మెరుగైన స్థానంలో నిలిపేందుకు ఒక ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటుచేసినట్టు కేంద్ర న్యాయశాఖ ప్రకటించింది. అదే నిజమైతే దానిని కచ్చితంగా స్వాగతించాల్సిందే. ఆ సంఘం పని చేసి ఉంటే ఫలితాలు ఇంత ఘోరంగా ఎందుకుంటాయన్న ప్రశ్నను కూడా తట్టుకునే స్థితిలో కేంద్రప్రభుత్వం లేదు. మరి చట్టబద్ధ పాలనా దీపాన్ని దేశవ్యాప్తంగా కొండెక్కిస్తోందెవరు? దేశవ్యాప్తంగా అధికారం చలాయించేందుకు పాకులాడుతున్నదెవరు?
కార్మిక చట్టాల అమలు విషయంలో ఈ దేశానిది 119 స్థానమంటే పాలకులకు కార్మికులపై ఎంత ప్రేమ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దేశంలో బాల్యవివాహాల నిరోధం మొదలు లైంగిక దాడుల నియంత్రణ దాకా చట్టాలకేమీ కొదవలేదు. అమలులోనే అసలు పేచీ అంతా. తరాలు గడుస్తున్నా సామాజిక దురాచారాలు అలాగే కొనసాగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేండ్లలో దేశానికి తలవంపులు తెచ్చిపెడుతున్న జుగుప్సాకర నేరాలూ అంతకంతకూ పెరుగుతూ దేశం అరాచకాలకు అడ్డాగా మారిపోయింది. అదే సమయంలో పాలనలో పారదర్శకతకు ఊపిరైన సమాచారహక్కు చట్టం సైతం నీరుగారిపోతోంది. ప్రజలకు జవాబు దారీగా మెలగాల్సిన ప్రభుత్వాలు చీకటి విధానాలను అపరి మితంగా పెంచిపోషిస్తున్నాయి. అధికారపక్షాల సొంత సేనలుగా రాజ్యాంగ సంస్థలు మారి పౌరహక్కులను కబళిస్తున్నాయి.
సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలన్నిటిపైనా రాజకీయ క్రీనీడలు దట్టంగా అలుముకుంటున్నాయి. రాజ్యాంగ వ్యవస్థల స్వతంత్రత, నిష్పాక్షికతలు ప్రశ్నార్థకాలవుతున్న వాతావరణం నేడు దేశమంతటినీ ఆవహిస్తోంది. తత్ ఫలితంగా రాజ్యాంగ సంస్థలపై కూడా ప్రజల విశ్వాసం అడుగంటిపోతోంది. చట్టం, ధర్మం అన్న మాటలకు ఉద్దేశపూర్వకంగానే తిలోదాకాలిస్తున్న నాయకులు సర్వత్రా అధర్మానికే అగ్రతాంబూలమిస్తున్నారు. డబ్బూ, అధికారమే పరమావధిగా రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్న నేతలు ఎన్నికల వ్యవస్థలను కూడా అపహస్యం చేస్తున్నారు. అవినీతి అక్రమాలు వేయిపడగలతో బుసలుకొడుతుంటే చట్టబద్ధ పాలన సాధ్యమేనా? అన్న ప్రశ్న సర్వత్రా వేధిస్తోంది.