Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక సీనియర్ రాజకీయ నేత విమర్శ చేసినట్టు... 'అసలు ఆయా
దేవుళ్ల మీద కామెంట్లు చేసిన వాణ్ని... కొందరు పొలిటీషియన్లు
ఎందుకు కలిసినట్టు..? అలా కలిసిన తర్వాతే అతడు ఎందుకు
విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసినట్టు...?' ఇప్పుడు ఈ లోగుట్టును
పోలీసులు, ప్రభుత్వం బట్టబయలు చేయాలి. ఇది తేలితేనే
అసలు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
'ఎర్ర చీమలు.. నల్ల చీమల్ని ఒక గ్లాసు జారులో పెడితే ఏమీ జరగదు. కానీ ఆ జారును కదిలిస్తే మాత్రం.. ఆ రెండు రకాలూ పోట్లాడుతాయి. నిజానికి అసలైన శత్రువు ఆ జారును కదిలించిన వారే. సమాజంలో కూడా అంతే. ఒకరితో ఒకరం పొట్లాడుకునేటప్పుడు జారును ఊపిందెవరనే దానిపై మనల్ని మనం ప్రశ్నించుకోవాలి...' జేమ్స్ మెర్విల్ అనే సుప్రసిద్ధ కామెంటేటర్ చేసిన వ్యాఖ్యలివి. ఇప్పుడు తెలంగాణలో సైతం ఇలాంటి జారుల్నే ఎవరో కదిలిస్తున్న అలికిడి వినబడుతున్నది. అలా కదిలించికపోతే అయ్యప్ప భక్తుల గురించి.. సరస్వతీ మాత గురించి కొంతమంది రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు ఎందుకు చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగులుతున్నది.
తెలంగాణ నేల గంగా జమునా తెహజీబ్‌గా వాసికెక్కింది. హైదరాబాద్ సర్వ మతాల.. సకల సాంప్రదాయాల నిలయంగా భాసిల్లుతున్నది. తరతరాలుగా.. కొన్ని వందల ఏండ్లుగా ఇక్కడ హిందూవులు, ముస్లింలు కలిసి 'భాయి భాయి' అనుకుంటూ బతుకుతున్నారు. క్రీస్తు పుట్టిన రోజైన క్రిస్మస్ పర్వదినాన ఆ మతం, ఈ మతమనే తేడా లేకుండా అందరూ వారిచ్చిన కేకులను స్వీకరిస్తారు. తెలుగువారి పండగలైన దసరా, దీపావళి, సంక్రాతి, ఉగాదులకు అటు మహమ్మదీయులు, ఇటు క్రైస్తవులు శుభాకాంక్షలు చెబుతూ ఆయా సందర్భరాలను ఆనందంగా ఆస్వాదిస్తుండటం ఇక్కడి గొప్పతనం. ఇలా సహజీనవమూ.. సమభావనమూ అనేది తెలంగాణకే కాదు.. భారతీయ ఆత్మగా వర్థిల్లుతున్నది.
అయితే జేమ్స్ మెర్విల్ చెప్పినట్టు ఇప్పుడు ఇలా కలిసిమెలిసున్న ప్రజల్ని ఎవరో కదిలిస్తున్నారు. అలా కదిలిన ప్రజలు నిత్య జీవిత సమస్యల నుంచి.. ప్రభుత్వాల విధానాల నుంచి పక్కకు పోవాలన్నది వారి లక్ష్యం. అలా పోవటం ద్వారా కులాల కుంపట్లు.. మతాల కొట్లాటలు జరగాలనీ, ఆ విధంగా వచ్చే వేడి ద్వారా తాము 'రాజకీయ చలి' కాచుకోవచ్చనేది వారి దుర్బుద్ధి. అలాంటి నీచమైన బుద్ధిలోంచే ఇప్పుడు మన రాష్ట్రంలో దేవుళ్లు, దేవతల మీద అసందర్భోచిత వ్యాఖ్యలు పుట్టుకొస్తున్నాయి. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి... అలాంటి వ్యాఖ్యానాలు మున్ముందు దొర్లకుండా ఉండేందుకు సంబంధిత వ్యక్తులను హెచ్చరించాల్సిందే. చట్టపరంగా శిక్షించాల్సిందే. ఇదే సమయంలో ఆ కామెంట్ల వెనుకున్న అదృశ్య శక్తుల పని పట్టకపోతే.. భవిష్యత్తులోనూ ఈ వ్యాఖ్యానాలు పుట్టకమానవనే నగ సత్యాన్ని మనం గ్రహించాలి.
ఒక సీనియర్ రాజకీయ నేత విమర్శ చేసినట్టు... 'అసలు ఆయా దేవుళ్ల మీద కామెంట్లు చేసిన వాణ్ని... కొందరు పొలిటీషియన్లు ఎందుకు కలిసినట్టు..? అలా కలిసిన తర్వాతే అతడు ఎందుకు విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసినట్టు...?' ఇప్పుడు ఈ లోగుట్టును పోలీసులు, ప్రభుత్వం బట్టబయలు చేయాలి. ఇది తేలితేనే అసలు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. లేదంటే షరా మామూలుగా అరెస్టులు.. కోర్టులు.. ఆ తర్వాత విడుదల అనేవి చకచగా జరిగిపోతాయి. పరిస్థితి మళ్లీ పునరావృతం అవుతుంది.
మన దేశంలో పార్లమెంటుకో, రాష్ట్ర శాసనసభలకో ఎన్నికలు వచ్చినప్పుడే... సరిహద్దుల్లో విధ్వంసాలు.. చైనా, పాకిస్తాన్‌తో యుద్ధాలు.. మత కల్లోలాలు.. విద్వేష పూరిత ప్రసంగాలు కొనసాగుతుండటం గత ఎనిమిదిన్నరేండ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు అలాంటి కుయుక్తులు, కుతంత్రాలు మన రాష్ట్రంలోనూ పరాకాష్టకు చేరాయి. ఎందుకంటే... తెలంగాణ శాసనసభకు వచ్చే డిసెంబరులో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి. త్వరలోనే మరి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, ఆ తర్వాత పార్లమెంటుకు సైతం ఎన్నికలున్నాయి. ఈ క్రమంలో 'ఏ మాటలు, ఏ నినాదాల వెనుక ఏ ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోనంత వరకూ జనం మళ్లీ మళ్లీ మోసపోతుంటారు...' అంటూ లెలిన్ మహాశయుడు చెప్పిన హితోక్తిని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. పాలకుల రాజకీయ చదరంగంలో పావులుగా మారకుండా జాగరూకతతో వ్యవహరించాలి. లేదంటే మతాల ఆధారంగా ప్రజలను చీల్చటమే లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యాఖ్యానాలు చేయటం.. వాటి వెనకున్న నిజానిజాలను గ్రహించకుండా అమాయకపు ప్రజలు ఆయా వీడియోలను వైరల్ చేయటం.. వాటి కోసమే కాసుక్కూర్చున్న కొన్ని శక్తులు రెచ్చిపోవటం.. తద్వారా ఎన్నికల దాకా ఇలాంటి తతంగాలను సాగదీయటం.. ఫలితంగా రాజకీయంగా లబ్దిపొందేందుకు ప్రయత్నించటమనేది ఇక్కడ జరిగే తంతు. అందుకే పరమత సహనం కలిగిన తెలంగాణ సమాజం.. భారత ప్రజలు వాటన్నింటికీ ఎంతో తెలివిగా అడ్డుకట్ట వేయాలి. అప్పుడే ఆయా శక్తులకు మూకుతాడు వేయగలం.