Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదేమిటో..! మాట్లాడుకోవడానికి ఏ సమస్యలూ లేనట్టూ మనం మతాల గురించీ, మందిరాల గురించీ, దేవుళ్ల గురించీ, వారి పుట్టుకల గురించీ మాట్లాడుకుంటున్నాం... కాదు కాదు పోట్లాడుకుంటున్నాం. ప్రతిరోజూ, ప్రతిచోటా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే తంతు..! మైండ్‌ను మ్యూట్‌లో పెట్టి ట్రెండ్‌ను ఫాలో అవడమంటే ఇదేనేమో..!! ఇందుకు మన తెలంగాణమూ మినహాయింపు కాదని ఇటీవలి కొన్ని పరిణామాలు తెలియజేస్తున్నాయి.
త్రిపురలో కమ్యూనిస్టుల మీద, కాంగ్రెస్ మీద వీరంగమాడుతూ... ''2024 జనవరి 1 కల్లా అయోధ్యలో రామాలయం సిద్ధమవుతోంది జాగ్రత్త'' అంటూ ఓ హెచ్చరికలాంటి వ్యాఖ్య చేశారు అమిత్‌షా! అంతేనా... ఆలయ ప్రారంభం తరువాత అక్కడి నుండే తమ ప్రధాని ఎన్నికల ప్రచారం మొదలుపెడతారని కూడా సెలవిచ్చా రాయన. ఓ ఎన్నికల ర్యాలీలో ప్రజల సమస్యల గురించో, ప్రభుత్వ విధానాల గురించో మాట్లాడకుండా ఆయన ఈ వ్యాఖ్యలకు పాల్పడటం దేనికి సూచిక బహుశా రాహుల్ గాంధీకీ ఆచార్య సత్యేంద్ర దాస్ అందించిన ఆశీస్సులు వారిని కలవరపరుస్తున్నట్లున్నాయి! ఎందుకంటే ఆచార్య సత్యేంద్ర దాస్ స్వయాన అయోధ్య రామమందిర ప్రధాన అర్చకులు మరి. ''భారత్ జోడో యాత్ర'' ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించిన సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకున్నది. ''ప్రజలందరి క్షేమం - ప్రజలందరి సౌఖ్యం కోసం మీరు తలపెట్టిన ఈ యాత్రకు రామచంద్రుని కృపాకటాక్షాలతో శుభం కాలుగాక'' అని ఆయన రాహుల్‌ను అభినందించి ఆశీర్వదించారు. సహజంగానే ఇది ''పరివారానికి'' మింగుడుపడని అంశం. స్వయంగా రామమందిర ప్రధాన పూజారి ఈ యాత్ర దేశం కోసం, ప్రజల కోసం అని ధృవీకరించడం, పైగా ఈ ''పరివారం'' తమ హక్కుగా భావిస్తున్న రాముడి కృపను రాహుల్‌కు ప్రసాదించడం సాధారణ విషయమేం కాదు. అందుకే ఈ నష్టనివారణ వ్యాఖ్యలు కాబోలు..!
ఎప్పుడైనా ఎక్కడైనా తమ ఎన్నికల ప్రచారానికి మందిరాలు, మత సమీకరణలే అజెండా తప్ప, ప్రజల జీవితాలు కాదని ఈ వ్యాఖ్యలు మరోసారి రుజువు చేస్తున్నాయి. ఎనిమిదిన్నరేండ్లుగా తమది తిరుగులేని పాలన అని విర్రవీగు తున్న వీరు, ఇంకా ఓట్ల కోసం రాముడి మీదే ఆధారపడకతప్పని బలహీనతను సైతం ఇది సూచిస్తున్నది. ప్రజల మనసులు గెలవడానికి వీరు ఇంకా రాముడి పైనే ఆధారపడటం వైచిత్రి! కాంగ్రెస్ సహా ఇతర బూర్జువా ప్రతిపక్ష పార్టీలేవీ వీరి విధానాలకు నికరమైన ప్రత్యామ్నాయాలు నిర్మించకపోగా, ఓ సైద్ధాంతిక భూమిక అంటూ లేకుండా తాము కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా ప్రజా సమస్యలేవీ అసలు అజెండాలోకే రాకుండాపోయి మత రాజకీయాలే దేశాన్ని ఆవహిస్తున్నాయి. ఇదే సమయంలో తెలంగాణలో కూడా కొందరి వ్యాఖ్యానాలు చర్చనీయాంశం కావడం గమనార్హం. సమకాలీన వాస్తవికతను గుర్తించకుండా చేసే ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా అది మతోన్మాదులకే ప్రయోజనమన్న సంగతి విస్మరించకూడదు.
సమస్త ప్రజల జీవితాలు సమస్యలతో సంక్షోభంలో కొట్టుమిట్టాడు తుండగా, దేవుళ్లు, మతాల గురించిన వాదనలు ఎవరికి ఉపయోగపడతాయో తెలుసుకుని మెళుకువతో వ్యవహరించాలి. అందువల్ల కేవలం తెలిసింది మాత్రమే మాట్లాడితే సరిపోదు. తెలివితో మాట్లాడటం కూడా తెలియాలి. మనం ఏం కొనాలో ఎలా బతకాలో మార్కెట్ నిర్ణయిస్తున్నట్టే, ఏం మాట్లాడాలో ఏం మరిచిపోవాలో ఈ మత రాజకీయం నిర్దేశిస్తున్నది. నేడు మన ప్రతి కదలికా వెనుక నుండి ఎవరో తోస్తున్నదేనన్న ఎరుకలో ఉండాలి. ఇప్పుడు దేశంలో 65కోట్ల మంది భారతీయులు 25ఏండ్లలోపు వారు. వీరి చైతన్యం, కార్యాచరణలను నిర్వీర్యం చేయడమేకాదు, ఈ యువతరం విద్యా ఉపాధి అవకాశాల గురించి ఏమాత్రం పట్టించుకోని ఈ ప్రభుత్వం, లక్షల కోట్ల ప్రజాధనాన్ని తన సంపన్న మిత్రులకు అప్పనంగా వడ్డిస్తోంది. కేవలం ఈ నాలుగేండ్లలోనే ఈ కార్పొరేట్ల కోసం బ్యాంకులు వదిలేసుకున్న భారీ సొమ్ము అక్షరాల పది లక్షల కోట్లకు పై మాటే! మోడీ సర్కార్ తన స్నేహితులకు కానుకగా ఇచ్చిన ఈ సొమ్ముతో ఎన్ని పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మాణమయ్యేవో కదా..! దీని గురించి మాట్లాడాలి.
వైద్యం ఎందుకు ఖరీదయిందో, చదువులు ఎందుకు భారమవు తున్నాయో అడగాలి. అధికారంలోకొస్తే ప్రతి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తామన్న వాగ్దానం ఏమయిందో, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న హామీ ఏమయిందో నిగ్గదీయాలి. చాలీచాలని జీతాలతో రోజుకు 12గంటలకు పైగా ఏ హక్కులూ లేకుండా పనిచేస్తున్న అసంఖ్యాకమైన జీవితాల గురించి ప్రశ్నించాలి. మతమౌఢ్యం సమాజాన్ని చీకట్లోకి నెడుతున్న వేళ... వెలుతురులోకి లాగే ఉక్కు పిడికిళ్లు కావాలి ప్పుడు. దేశమంతా అబద్దాల ఊబిలో కూరుకుపోతున్న వేళ... అవసరమైన నిజాలను ప్రజలకు వినిపించే బలమైన గొంతులు కావాలిప్పుడు...