Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచానికే భారత్ దిక్సూచి' అని ఏటేటా భారీగా వెలువడుతున్న పరిశోధనా పత్రాలను ఉటంకిస్తూ ప్రభుత్వ పెద్దలు కొన్నేండ్లుగా ఊదరగొడుతున్నారు. తాజాగా నాగ్‌పుర్ విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభిస్తూ ప్రధాని నరేంద్రమోడీ 'ఆత్మనిర్భర భారత్ ఆవిష్కారానికి శాస్త్రవేత్తలు దోహదపడాలని, జనజీవనంలో మేలిమి మార్పులు తీసుకొచ్చేందుకు తమ మేధాశక్తిని వినియోగించాలి' అని పిలుపిచ్చారు. ప్రధాని ఆశించినట్టు వైజ్ఞానిక అద్భుతాలు సాకారం కావాలంటే పరిశోధనలూ అభివృద్ధి(ఆర్అండ్డీ)కి విరివిగా నిధులు కేటాయించాలి. రెండున్నర దశాబ్దాల క్రితం ఈ రంగానికి ఇండియా, చైనాల వ్యయం దాదాపు సమంగానే (జీడీపీలో సుమారు 0.6శాతం) ఉండేది. తరువాతి కాలంలో చైనా ఆ మొత్తాన్ని అధికంగా పెంచి... నేడు శాస్త్రసాంకేతిక అగ్రశక్తిగా ఎదిగింది. మనం మాత్రం ఇప్పటికీ జీడీపీలో 0.7శాతం మాత్రమే ఖర్చు పెడుతున్నాం. అంటే బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాలకన్నా తక్కువే అని దేశ దుస్థితిని పార్లమెంటరీ సంఘమే నివేదించింది.
కేంద్ర పెద్దలు చెప్పినట్టు శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకుపోతుంటే విశ్వ జ్ఞాన సూచీ(జీకేఐ)లో 138 దేశాలకుగాను 75వ స్థానంలో ఎందుకుంది? ఎందుకంటే ఇప్పుడు దేశంలో నాటి చాందస భావాలను, ఆచార సంప్రదాయాలను నేటి విజ్ఞానంలో మిళితం చేయడానికి అధికారంలో ఉన్న సూడోసైన్స్ ప్రచారకులు ప్రయత్నిస్తున్నారు కాబట్టి. పాఠ్య పుస్తకాలు, మీడియా, రచనలు, సినిమాలు, పత్రికల నుపయోగించి చరిత్రను వక్రీకరిస్తున్నారు. గతంలో 'ఇండియన్ సైన్స్ కాంగ్రెస్' సాక్షిగా మోడీ సహా వారి వంది మాగాధులందరూ డార్విన్ సిద్ధాంతంపై, న్యూటన్ సిద్ధాంతంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు గుర్తుకురాక మానవు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ- క్లాజ్ హెచ్ ద్వారా శాస్త్రీయ దృక్పథాన్ని, మానవ విలువల్ని, నూతన విషయాలను కనుక్కొనే స్ఫూర్తి, సంస్కరణ శీలతను అభివృద్ధి పరచడం ప్రతి పౌరుని ప్రాథమిక బాధ్యతగా నిర్దేశించబడింది. కానీ రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు, శాస్త్రీయ ఆలోచనలతో విజ్ఞానాన్ని అందించాల్సిన ప్రొఫెసర్లే అశాస్త్రీయ భావజాలాన్ని ప్రచారం చేయటం దౌర్భాగ్యం.
ఆర్‌అండ్‌డీకి ప్రభుత్వ కేటాయింపులు ఇతోధికం కావాలని పార్లమెంటరీ సంఘం ఎప్పుడో సూచించింది. 84వేలకు పైగా అంకుర సంస్థలతో నూతన ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా భారత్ అవతరిస్తోందని ప్రధాని సహా వారి నేతలందరూ హౌరెత్తిస్తున్నారు. కానీ, వినూత్న సాంకేతికతలతో ముందడుగు వేస్తున్న స్టార్టప్‌ల సంఖ్య నాలుగు వందలకు మించడం లేదన్నది ప్రభుత్వ వర్గాల అంచనే. పేటెంట్ నమోదు చేసుకోవాలంటే సగటున 42 నెలలు సమయం పడుతోందని 2021-22 ఆర్థిక సర్వే స్పష్టం చేస్తోంది. అమెరికా, చైనా, దక్షిణ కొరియాలతో పోలిస్తే ఇది దాదాపు రెండు రెట్లు అధికం. అటువంటి ప్రగతి విఘాతక వ్యవస్థాగత లోపాలను పరిష్కరించకుండా, ఉన్నత విద్యను పరిశ్రమలతో అనుసంధానం చేయకుండా ప్రధాని ఎన్ని పిలుపులిచ్చి ఏం ఉపయోగం?
కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైజ్ఞానిక సలహాదారు ఆచార్య అజరు కుమార్ సూద్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో మాట్లాడుతూ, మన శాస్త్రీయ ప్రచురణల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన
ఉదాహరించిన లెక్కల ప్రకారం దక్షిణ కొరియా, జపాన్లలో ప్రతి పది లక్షల జనాభాకు వరసగా7498, 5304 మంది చొప్పున పరిశోధకులు ఉన్నారు. అదే భారత్‌లో140 కోట్లకు ఆ సంఖ్య కేవలం 255. మార్కులూ ర్యాంకుల చట్రంలో ఇరుక్కుపోయిన మన విద్యావ్యవస్థ నవతరంలో వైజ్ఞానిక స్పృహ పెంపొందించడం లేదు. పైగా సమాజాన్ని తిరోగమనం వైపు నడిపే నూతన విద్యావిధానాన్నికి తలుపులు తీసి, వైజ్ఞానికంగా దేశం దూసుకుపోతుందంటే ఎలా? మౌలిక పరిశోధనలపై ఆసక్తి కలిగిన యువతకు దాన్నే జీవనోపాధిగా ఎంచుకొనేందుకు అవకాశాలూ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. తత్ఫలితంగా శాస్త్రవేత్తలుగా రాణించగలిగినవారు అనివార్యంగా ఇతర రంగాల వైపు మరలిపోతున్నారని నిటి అయోగ్ గతంలోనే ఆందోళన వ్యక్తంచేసింది. రాశిలోనే కాదు, వాసిలోనూ మన పరిశోధనలు సమాజానికి ఉపయోగపడాలంటే మూస చదువులను సంస్కరించినప్పుడే మన విజ్ఞానశాస్త్ర వెలుగులు దేశ సరిహద్దులు దాటుతాయి.
దేశ సుస్థిరాభివృద్ధికి చోదకశక్తిగా విజ్ఞానశాస్త్రాన్ని గుర్తించి దీర్ఘకాల ప్రణాళికలతో ప్రభుత్వాలు దాన్ని ప్రోత్సహించాలి. విజ్ఞానశాస్త్ర ఫలితాల్ని అనుభవించడమే కాదు, ఆ జ్ఞానానికి బాసటగా నిలబడటం శాస్త్రీయతకు బలం. ఇదే నిజమైన జ్ఞానం. శాస్త్రీయ వివేచన పెంపొందేలా జీవితాన్ని మలుచుకోవాలి. నూతన ఆవిష్కరణలతోనే సమాజం మారుతోంది. అప్పుడే మూఢత్వపు చీకట్లు తొలగి జ్ఞానకాంతులు ప్రసరిస్తాయి. వీన్ బర్గ్ అనే శాస్త్రవేత్త చెప్పినట్టు ప్రస్తుత సమాజంలోని సాంఘిక సమస్యలను ఎదుర్కోవటం విజ్ఞాన శాస్త్రంతోనే సాధ్యం.