Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ నెల తొమ్మిది నుంచి జర్మనీ మినహా జి7లోని ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, కెనడా, అమెరికాలను చుట్టివచ్చే పనిలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా మునిగి తేలుతున్నాడు. మే నెలలో తన స్వస్థలమైన హిరోషిమా పట్టణంలో జి7 శిఖరాగ్ర సమావేశాలకు ఆతిధ్యం ఇస్తున్నాడు. ఆ లోగా కొన్ని ఒప్పందాలను ఖరారు చేసుకొనేందుకు పూనుకున్నాడు. స్థానిక రాజకీయాలలో తన స్థానాన్ని పటిష్ట పరుచుకోవటంతో పాటు సరికొత్త జపాన్ ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపేందుకు తాపత్రయపడుతున్నాడు. ఐరోపాలోని ఉక్రెయిన్‌లో చిచ్చు పెట్టిన అమెరికా, దాని మిత్రదేశాలు దాని నుంచి బయపడే మార్గం కనిపించక ఆసియాలో మరో వివాదం కోసం ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు చూస్తున్నాయి. దానిలో భాగంగానే తైవాన్ విలీనం, దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్చగా తిరిగే హక్కు, అవకాశాల పేరుతో రెచ్చగొట్టేందుకు పూనుకున్నాయి.
అనేక దేశాలపై దురాక్రమణjఱ, దాడులకు పాల్పడిన అమెరికాకు... తగిలిన ఎదురు దెబ్బలతో తలబొప్పి కట్టింది. దాంతో తన చేతికి మట్టి అంటకుండా ఇతరులను ముందుకు తోసి ఆయుధాలు అమ్ముకొంటూ ఒక వైపు ఆర్థిక లబ్ది, మరోవైపు ప్రపంచ పెత్తనాన్ని కాపాడుకొనేందుకు చూస్తున్నది. ఐరోపాలో రష్యాను దెబ్బతీసేందుకు ఉక్రెయిన్ను పావుగా మార్చింది. ఆసియాలో అందుకు విశ్వాసపాత్రురాలిగా జపాన్ కనిపించింది. దాన్ని ముందుకు నెట్టే క్రమంలో ఇప్పుడు అమెరికా, ఇతర నాటో కూటమి దేశాలు ఉన్నాయి. దీనిని అవకాశంగా తీసుకొని తన మిలిటరీ సత్తా ఏమిటో చూపేందుకు జపాన్ పూనుకుంది. ఇంతకాలం మిలిటరీ ఖర్చు లేకుండా పరిశోధన-అభివృద్దికి తన వనరులను మళ్లించి ఎగుమతులతో మూడు లక్షల కోట్ల డాలర్ల మేరకు విదేశీమారక ద్రవ్య నిల్వలను కూడబెట్టుకుంది. అలా జపాన్ ఒక బలమైన దేశంగా ఉన్నా ఆర్థిక వృద్ధిలో ఒక దీర్ఘకాలిక పక్షపాత రోగిలా మారింది. ఆ స్థితి నుంచి బయట పడేందుకు రెండవ ప్రపంచ యుద్ధం నాటి నుంచి ఆత్మరక్షణ విధానానికి పరిమితమై ఇప్పుడు ఎదురుదాడులకు సిద్దం అవుతోంది. మిగతా దేశాల మద్దతుతో పాటు, చైనాను ఎదుర్కొనేందుకు అవసరమైన సత్తా తనకు ఉండాలని చెబుతున్నది. దానిలో భాగంగానే వివిధ దేశాలతో మిలిటరీ ఒప్పందాలు, మిలిటరీ బడ్జెట్‌ను జీడీపీలో రెండుశాతానికి పెంచేందుకు పూనుకుంది.
ఇప్పటికే అమెరికాతో రక్షణ ఒప్పందంలో ఉన్న జపాన్ తాజాగా బుధవారంనాడు బ్రిటన్‌తో కూడా మిలిటరీ ఒప్పందాలు చేసుకుంది. దాని ప్రకారం బ్రిటన్ మిలిటరీ జపాన్ గడ్డమీద అడుగుపెట్టేందుకు అవకావశం ఇచ్చింది. అదే మాదిరి జపాన్ దళాలు బ్రిటన్‌కు రావచ్చు. 1903 తరువాత రెండు దేశాల మధ్య కుదిరిన ఒక కీలక ఒప్పందమిది. చైనా తమకు ఒక వ్యవస్థాపరమైన సవాలు విసురుతున్నదని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాంటి ఒప్పందాన్నే ఆస్ట్రేలియాతో కూడా జపాన్ కుదుర్చుకుంది. జపాన్ లక్ష్యం ఒక్క చైనా మాత్రమే కాదు. రష్యాతో సహా ఆసియా పసిఫిక్ దేశాలన్నింటిలో ఒక ప్రాంతీయ శక్తిగా మారటం అన్నది స్పష్టం.
జపాన్‌కు చెందిన ఒకినావా దీవులు తైవాన్‌కు కూతవేటు దూరంలో ఉన్నాయి. అక్కడి అమెరికా సైనిక కేంద్రాలలో పాతబడిన వాటిని తొలగించి ఆధునిక అస్త్రాలు, శస్త్రాలను సంధించే శక్తిగల మిలిటరీ పరికరాలను శరవేగంతో ఏర్పాటు చేస్తున్నారు. అదనపు నౌకా దళాలను మోహరిస్తున్నారు. అవసరమైతే వెంటనే దాడులకు తెగబడే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ దీవుల్లో పాతిక వేల మంది అమెరికా సైనికులున్నారు. పాతికకుపైగా మిలిటరీ కేంద్రాలున్నాయి. జపాన్‌లోని మొత్తం అమెరికా సైనిక స్థావరాలు, కేంద్రాలలో 70శాతం ఒకినావా దీవుల్లోనే ఏర్పాటు చేశారు. 1951లో జపాన్‌తో అమెరికా కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం ప్రకారం ఏ దేశమైనా జపాన్ భూ భాగంపై దాడికి దిగితే దానికి రక్షణగా అమెరికా సైనికులు రావచ్చు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో సైబర్ దాడులు జరపవచ్చు. అందువలన నాటి ఒప్పందాన్ని నవీకరించి వాటికి కూడా వర్తింప చేసే విధంగా మార్పులు తలపెట్టారు. అమెరికా కూటమి తలపెట్టిన ముప్పు గురించి చైనా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. అంతే కాదు దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ఎత్తుగడలు, రక్షణ ఏర్పాట్లు చేసుకుంటున్నది. వేలకిలో మీటర్ల దూరం నుంచి అమెరికా సేనలు వచ్చి చైనా మీద దాడికి దిగితే పరాభవం తప్పదు. వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్ దురాక్రమణలు దానికి తగిన పాఠాలు నేర్పాయి. అమెరికా అండ చూసుకొని జపాన్ లేదా మరొక దేశమేదైనా దుస్సాహసానికి దిగితే వాటికీ అదే గతి పడుతుంది. అమెరికా-జపాన్ మిలిటరీ సహకారం- ఒప్పందాలు ప్రాంతీయ శాంతి, స్థిరత్వాలకు, మరో దేశానికి హాని కలిగించకూడదని చైనా మృదువుగా హితవు చెప్పింది. ఉక్రెయిన్ సంక్షోభాన్ని, ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలను, తైవాన్ను చైనా బలవంతంగా ఆక్రమించుకోనుందంటూ బూతద్దంలో చూపి దుస్సాహసాలకు దిగిన దేశాలకు తగిన పాఠం చెప్పే స్థితిలో చైనా ఉందన్నది మరిచిపోరాదు!