Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం దేశంలో రాజ్భవన్లు వివాదాలకూ విపరీతాలకూ నిలయాలుగా 'అలరారుతున్నాయి'..! రాజ్యాంగ నియమాలు తుంగలో తొక్కి, ప్రజాస్వామ్య విలువలు ఫణంగా బెట్టి, కేవలం ఏలినవారి మనసెరిగి నడుచుకోవడమొక్కటే ఏకైక పరమావధిగా సాగుతున్న గవర్నర్ల తీరు రోత పుట్టిస్తోంది. తాజాగా తమిళనాడు శాసనసభలో చోటుచేసుకున్న విపరీతం ఈ దురాగతాలకు ఓ పరాకాష్ట!
''పెరియార్, అంబేద్కర్, కామరాజ్ నాడార్, అన్నాదురై, కరుణానిధిల ఆశయాలకు అనుగుణంగా... సామాజికన్యాయం, ఆత్మగౌరవం లక్ష్యాలుగా, సమైక్యత - సామరస్యం అనే విధానాలను అవలంబిస్తున్న ఓ ద్రావిడ తరహా ప్రభుత్వమిది''- తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన గవర్నర్ ప్రసంగ పాఠంలోని వాక్యాలివి. ఇందులో అభ్యంతరకరమైనవేమిటో తెలియదుగానీ ఆ మాటలు ఉచ్ఛరించడానికే ఆ గవర్నర్‌కు మనసొప్పలేదు. కనీసం క్యాబినెట్ ఆమోదించిన ప్రసంగాన్ని చదవడం సభా సంప్రదాయమన్న సంగతి కూడా ఆయన విస్మరించారు! బహుశా 'ద్రవిడ మోడల్ ప్రభుత్వం' అన్న ప్రస్తావన తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవికి రుచించినట్టులేదు. పెరియార్, అన్నాదురై వంటి ద్రవిడ ఉద్యమ దిగ్గజాలతో పాటు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు ఉచ్ఛరించడం కూడా ఆయనకు నచ్చకపోవడం గమనార్హం! తనకు నచ్చినా నచ్చకపోయినా సభా సంప్రదాయాలను గౌరవించడం గవర్నర్‌గా ఆయన విధి. రాజ్యాంగ నియమం. ఈ సంస్కారం కూడా ఆయనకు లేక పోవడం గర్హనీయం!
కనీసం ఆ రాష్ట్రం పేరు కూడా పలకడానికి ఆయన ఇష్టపడటం లేదు. తమిళనాడు అనే పేరే ఆయనకు ప్రాంతీయ వాదానికి ప్రతీకగా కనిపిస్తే... మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ, నాగాలాండ్, బెంగాల్ ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలోని మిగతా రాష్ట్రాల పరిస్థితేమిటీ?! ఇది దేనికి సూచిక! ఇక ఆయన ప్రభుత్వం నిర్ణయించిన ప్రసంగంలోని అనేక అంశాలను కావాలని విస్మరించడమే కాదు, దానికి భిన్నంగా కూడా మాట్లాడాడు. దీనిపై నిరసన వ్యక్తం కావడంతో సభ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించి దిగ్భ్రాంతికి గురిచేశాడు! ఆయన విపరీతపోకడలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. కాగా, ప్రతీ సందర్భంలో ప్రభుత్వానికి అడ్డుతగలడం, తను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానన్న స్పృహ లేకుండా రాజకీయ ప్రకటనలు చేయడం ఆయనకు పరిపాటిగా మారింది.
దీనికి ముందు ఢిల్లీలో లెఫ్టి నెంట్ గవర్నర్ వికె సక్సేనా నిర్వాకం అందరికీ తెలిసిందే. ఆయన ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే కార్పొరేషన్ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహించాలో కూడా నిర్ణయించాడు. ఈ గందరగోళమే మేయర్ ఎన్నిక నిలిచిపోవడానికి కారణమయింది. ఈ విషయంలోనే కాదు, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన కేజ్రీవాల్ ప్రభుత్వ అధికారాలనేకం స్వాధీనం చేసుకోవడం ద్వారా ఆ సర్కార్‌ను అడుగడుగునా బలహీనపరుస్తున్నాడు. నిజానికి 'గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటోరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్1992' ప్రకారం పోలీసు, శాంతిభద్రతల పరిరక్షణ, భూమి సంబంధిత వ్యవహారాలలో మినహా మిగతా అన్ని విషయాల్లోనూ మంత్రిమండలి సహాయం, సలహాకు అనుగుణంగా మాత్రమే లెఫ్టినెంట్ గవర్నర్ తన విధులు నిర్వర్తించవలసి ఉంది. ఈ చట్టం కార్యనిర్వహణా ధికారాలన్నీ ఎన్నికైన ప్రభుత్వ అధీనంలో ఉంటాయనే వాస్తవాన్ని స్పష్టం చేస్తోంది. కానీ ఢిల్లీలో జరుగుతున్నదేమిటి?
ఇక కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ సంగతి చెప్పనక్కర్లేదు. ఆయన పినరయి విజయన్ ప్రభుత్వంతో నిత్యం యుద్ధమే చేస్తుంటాడు. ఈయన కూడా శాసనసభలో ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ పాఠం సరిగా చదవకపోగా, మంత్రులతో గిల్లికజ్జాలకు పూనుకున్నాడు. విద్యామంత్రి రాజీవ్ తనపై విమర్శలు చేశారు గనక ఆయన నియామకానికి తన ఆమోదం ఉపసంహరించు కుంటున్నట్టు ప్రకటించి నవ్వుల పాలయ్యారు. రాజ్యాంగం ముఖ్యమంత్రి సలహామేరకు మంత్రులను నియమించాలని చెబుతున్నదే గాని ఏకపక్షంగా తొలగించే అధికారం గవర్నర్‌కు ఇవ్వలేదన్న కనీస జ్ఞానం లేకుండా పోయిందాయనకు! విశ్వవిద్యాలయాలలో నియామకాలను సైతం శాసించేందుకు సిద్ధపడ్డారు. ఒక వైస్‌ఛాన్సలర్ విషయంలో పేచీకి దిగి అందరు విసిలను రాజీనామా చేయాలని ఆదేశించారు. విశ్వవిద్యాలయ చాన్సలర్లుగా గవర్నర్ల అధికారం రాష్ట్రాల శాసనసభలు ఇచ్చిందేనన్న ఇంగితం లేకుండా వ్యవహరించి దెబ్బతిన్నారు. మహారాష్ల్రలో శివసేన తిరుగుబాటు వర్గంతో కలిసి బీజేపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్ కోషియారీ వ్యవహారించిన తీరు జగమెరిగిన సత్యమే. తెలంగాణలోనూ నేడు రాజ్‌భవన్‌కూ ప్రగతిభవన్‌కూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పంజాబ్‌లో బన్వరిలాల్ పురోహిత్, మేఘాలయలో తధాగతరారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకులు..! వీరంతా ఏకకాలంలో ఆయా ప్రభుత్వాలతో నేరుగా తలపడుతున్నారు. ఈ వివాదాస్పద గవర్నర్ లందరూ పూర్వాశ్రమంలో బీజేపీ కీలక నేతలే కావడం, వీరివల్ల ఇక్కట్లకు గురవుతున్నవన్నీ బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలే కావడం యాధృచ్ఛికమేమీ కాదు. కనుక ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న బీజేపీ ప్రాయోజిత రాజకీయ తతంగమేనన్నది సత్యదూరమూ కాదు.