Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తెల్లా వారకముందే పల్లె లేచింది, తనవారినందరినీ తట్టీ లేపింది' అంటూ పల్లె జీవన దృశ్యాన్ని మల్లెమాల ఎంతో అద్భుతంగా చిత్రిస్తాడీ గీతంలో. అవును పల్లె జీవన దృశ్యమే వేరు. అప్పటికీ ఇప్పటికీ ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ పట్నం కంటే కొంత భిన్నమైన జీవనమే పల్లెది. యంత్ర భూతములపై రెక్కల అమ్మకం పట్నం బతుకు. నమ్ముకున్న భూమిపై రెక్కలతో జీవనం పల్లెబతుకు. నమ్మకానికీ అమ్మకానికీ ఉన్న తేడా ఎంతో కొంత కొనసాగుతూనే ఉంది. అంటే అనుబంధము, అనురాగము అంతో ఇంతో ఉన్నది కూడా అక్కడనే. అందుకనే సంక్రాంతి పండగనగానే రరు రరుమని యాంత్రిక జీవన యానకుల పరుగులు పల్లెలవైపు, తమ తమ ఇండ్లవైపు బారులు తీరుతున్నాయి. వాతావరణ కాలుష్యాల నుండి, ఆలోచనల కాలుష్యాల నుండి గుండె సాంత్వన కోసం పరుగులు తీస్తుంది. అక్కడది దొరుకుతుందా లేదా అనేది వేరే విషయం. పండుగంటే అందరూ కలసిమెలసి తలపులు కలబోసుకోవటమే కదా!
ఒంటిని కొరుక్కుతినే చలిని, ముసురుకునే దిగులును, మంచు పొగల పొరను పారద్రోలే మంటలను ప్రతి ఇంటి ముందర రాజేసే పండుగ. మూఢత్వాలను, మనోమలినాలను కాల్చిపారేసి నూతన ఉషోదయానికి స్వాగతం పలికే పండుగ. వాకిళ్లలో రంగు రంగుల రంగవల్లులతో తమ అభిలాషలను నిండా పరచుకునే ముగ్గుల పండుగ. ముఖ్యంగా రైతులు పండించిన పంటను తమ ఇంటి ముందర చూసుకుని మురిసిపోయే పండుగ. కానీ రైతు మురిసి పోయేంతగా తనని ఆదుకోవటం లేదు పంట. పంటపై పెట్టిన ఖర్చూ రావటం లేదు. ఈ రోజు కూడా తెలంగాణలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పల్లెల్లోని పొలాల్లోకి పెట్టుబడి భూతం తన అడుగులు వేసింది. పంట నేల ఫాంహౌస్ క్షేత్రంగా మారిపోతున్నది. రియలెస్టేట్లో గజాల లెక్కన కొలవబడుతున్నది. బక్కచిక్కిన రైతు ఆశల్ని వొదులుకోలేక, భూమితో ఉన్న సంబంధాన్ని వీడలేక కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు. రైతు బాగున్ననాడే పల్లె బావుంటుంది. పల్లె బావుంటేనే పండుగ బావుంటుంది. పండగంటే సంవత్సర క్యాలెండర్లో వచ్చే తేదీకాదు. బతుకును భాగ్యవంతం చేసేది. మనసులో ఆనందాలు పూసేది.
కొత్త సంవత్సరం ఆదిలోనే సంక్రాంతి వస్తుంది. ఇది మార్పుకు నాంది. మారాలి. చాలా చాలా మారాల్సింది ముందరేవుంది. కానీ ఇప్పుడు మారుతున్నదంతా తిరోగమనంలో ఉంది. విద్వేషాలు పెరుగుతున్నాయి. విభజన వాదం పెచ్చరిల్లుతోంది. సమాజం చీలికకు గురవుతోంది. దేశంలో అత్యున్నత న్యాయస్థానమే అంటున్న మాటలివి. సమాజంలో సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి పాటుపడాల్సిన మీడియా, ముఖ్యంగా ఛానళ్లు వాటికి విఘాతం కలిగిస్తున్నాయని సుప్రీంకోర్టు పరోక్షంగా సమాజంలో వెల్లువెత్తుతున్న విద్వేషాగ్నిని గురించీ, దాన్ని అరికట్టాల్సిన పాత్ర గురించీ వ్యాఖ్యానించింది. ఇక మన ఘనత వహించిన ఉపరాష్ట్రపతి పార్లమెంటు చేసే చట్టాలను కొట్టివేయడం, వాటిపై కలుగ చేసుకోవటం న్యాయాస్థానాలు చేయరాదని, న్యాయస్థానాల ఉనికినీ అధికారాలనూ ప్రశ్నించాడు. కోర్టులను, వాద ప్రతివాదనలనూ, ప్రశ్నలనూ సహించలేని తనం పెరిగిపోతున్నది. పోయిన సంవత్సరం పదవీ విరమణ పొందిన ఉన్నతోద్యోగులు వందమంది ఈ విద్వేష ప్రసంగాలమీద, వాటిని అరికట్టటం మీద ప్రధానికి లేఖ రాయాల్సివచ్చింది అంటే, అసహనం ఎంతలా పెరిగిందో అర్థం అవుతుంది. దేశంలోని మైనారిటీ మతస్తులు మాకు లోబడి జీవనం సాగించాలని స్వయం సేవక దళాధిపతులు బహిరంగంగానే ప్రకటనలు ఇస్తున్నారు. ఇది మన భారతీయుల భిన్నత్వంలో ఏకత్వం అనే జీవన విధానాన్నే విచ్ఛిన్నం చేసే ఆలోచన.
పండుగనాడు కలిసి ఉండటం గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో విడగొట్టే విద్వేషాల పట్ల అప్రమత్తంగా ఉండటం కోసమే ఈ ప్రస్తావనలన్నీ. మనుషుల మధ్య విభేదాలను, విభజనలను తీసుకురావడం కోసం చేసే ఏ ప్రయత్నాన్నయినా ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే ఈ విభేదం, విద్వేషం మన ముందరకీ వస్తుంది. పండుగనాడు ఇంటిల్లిపాదిమి కలిసిన సందర్భాన సామాజిక సవాళ్ల గురించి ఆలోచన చేయాలి. సామరస్యపూరిత సమాజంలోనే ఆనందం వెల్లివిరిస్తుందని గుర్తించాలి. సంఘంలో అసమానత అలజడి చోటుచేసుకుంటే, అందులో భాగమైన కుటుంబం సంతోషంగా ఉండలేదు. సామాజిక వైషమ్యాలలో పడిపోతే ప్రగతిని సాధించడం అసాధ్యమవుతుంది. అభివృద్ధి కుంటుపడుతుంది. జీవనం గతి తప్పుతుంది. ఇది చరిత్ర రుజువు చేస్తున్న సత్యం. అందుకే మానవీయ అనుబంధాలను నెలకొల్పే సమాజాన్ని కాంక్షించడానికి సంకల్పాన్ని పొందాల్సిన సందర్భమూ ఇదే. జీవితాలలోని బాధలను, వెతలను మరిచిపోవటం కాదు పండుగ. వాటిని తుడిచివేసేది నిజమైన పండుగ. అలాంటి సంక్రాంతులు అందరిలో కాంతి నింపాలని, సమతా శాంతులు వెలిగించాలని కోరుకుందాము.
''నీళ్ళు చల్లిన భూమి ముఖంపై రంగులు పూసిన నవ్వులు ఉదయించిన వాకిలి పండుగ. ఎన్నో ఆశల చెమట చుక్కల్ని ఏరి కుప్పేసుకున్న ధాన్యపురాశి పండుగ. మూగిన బాధల చీకట్ల ముంగిలిలో ధైర్యపు దివ్వెల ముగ్గులకర్ర పండుగ'' అన్న కవి అభివ్యక్తిలా పండుగ సమాజ చైతన్యానికై మరో మేలు కొలుపు కావాలి.