Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంతో చేసుంటే ఇంత ఆయాస పడుతున్నారెందుకో ఎంతకీ బోధపడటం లేదు..! అన్ని కోట్లిచ్చాం ఇన్ని కోట్లిచ్చామని ప్రజల్ని బుకాయించి మరీ వాదిస్తున్న ఢిల్లీ పెద్దల్ని, వారి తెలంగాణ అంతేవాసుల్ని చూస్తే ఆశ్చర్యమేకాదు, ఒకింత డౌటుకూడా వస్తుంది. వారిచ్చింది నిజమా? వీరు ఇవ్వలేదనేది నిజమా? ఆ లెక్కల మాయాబజార్లోకెల్తే మనం బయటపడం. ఒకటి మాత్రం నిజం. ఎంతో చేశామనేవారు నిర్దిష్టంగా వాటి సంగతి తేల్చలేక కొత్తమార్గం ఎంచుకున్నట్లున్నారు. కాదేదీ ప్రచారానికి అనర్హమన్నట్లు రైళ్ళు, ఓడలు కూడా మోడీ సేవలో తరించడమే నేటి వైచిత్రి!
ఏలినవారి కబంధ హస్తా లను ఛేదించుకుని బయటకు పొక్కిన దేశీయ లెక్కలు, ఆక్స్ ఫామ్, యు.ఎన్.డి.పి, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు వెలువరించే వివరాలు పరిశీలిస్తే ఈ ప్రచారార్భాటపు డొల్లతనం బహిర్గతమవుతుంది. తెలంగాణలో బీజేపీ ఆడుతున్న రాజకీయ చదరంగంలో 'వందే భారత్' రైలు నేడొక ఆసరాగా దొరికింది. నాయకులతో కార్యకర్తలు సెల్ఫీలు దిగడం నేడు అన్ని పార్టీలకూ విస్తరించింది. కేంద్ర మంత్రులతో, శాసనసభ్యులు సెల్ఫీలు దిగడం ఒకింత విడ్డూరంగా ఉన్నా ఇది సర్వసాధారణమై పోయింది. ఒక కేంద్రమంత్రితో, మరో కేంద్ర మంత్రి సెల్ఫీ దిగడం, దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేయడం, పత్రికలకు పంపడం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలు ప్రారంభాన్నే ఆర్భాటంగా జరపాలనుకున్నారు బీజేపీ నేతలు. తదనంతరం పెరెడ్ గౌండ్‌లో భారీసభ అనుకున్నారు. ఖమ్మంలో బిఆర్ఎస్ ఆవిర్భావ సభతో తోక ముడిచినట్టు కొన్ని కథనాలు వెలువడ్డాయి. కాని రైల్వేస్టేషన్ల చుట్టూ వెలిసిన బ్యానర్లు, కటౌట్లు, తొలిరోజు 21 స్టేషన్లలో ప్రజల సందర్శనార్ధం నిదానంగా వెళ్ళడమో, ఆపడమో చేస్తారట! ఎంతో చేసిన బీజేపీ నేతలు రైళ్ళను కూడా ప్రచారాస్త్రంగా వాడుకో వాల్సిన ఖర్మేం కాలిందో చెప్పగలరా? ఇదంతా గుజరాత్ తరహా అభివృద్ధి కాబోలు! మొన్న గుజరాత్లో గట్టెక్కినట్లే 2024లో లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయతీరాలను చేరుతామనే భ్రమల్లో ఉన్నట్లుంది. భారతదేశ వాస్తవాలు బీజేపీ నేతలు పట్టించుకోకపోయినా ఆ విధానాలపై పోరాడేవారైనా పరిగణనలోకి తీసుకోవడం తక్షణావసరం.
ఢిల్లీ-వారణాసి వందే భారత్ రైలులో సగటున రోజూ 500 ఖాళీలుంటున్నాయి. ఇప్పటివరకు ప్రారంభమైన ఏడు రైళ్ళలోనూ ఇదే స్థితి. మన పరిస్థితి త్వరలో చూస్తాం. బర్రెలను గుద్ది ఇంజన్ అంతా తుక్కుతుక్కు అయిన ఫొటోలు చూసి దేశం విస్తుపోయింది. దేశంలో ప్రజల పరిస్థితులు రోజురోజుకూ దిగజారు తున్నాయి. ప్రపంచంలో అత్యధిక మంది పేదలున్న దేశంలో వందేభారత్ రైళ్ళు, బులెట్ ట్రెయిన్స్‌ని వినియోగించగల సామర్థ్యం ఎందరికుంది? శతకోటీశ్వరులు, శత సహస్ర కోటీశ్వరులు దేశంలో పెరిగిన మాట వాస్తవం. వారుకూడా అప్పులతో చిందులు వేస్తున్నారు. ఏమైనా మోడీ సర్కార్ వారి ప్రయోజనాలకై నిలబడుతోందని వేరే చెప్పక్కర్లేదు. ఇటీవల వారణాసిలో మోడీ జెండా ఊపి ప్రారంభించిన 'గంగా విలాస్' ఓడలో 51రోజుల ప్రయాణానికి 55లక్షల రూపాయలు ఖర్చు. ఈ 'గంగా విలాస్' ఓడలో ఇప్పటికే 2024 మార్చి వరకు బుకింగ్ పూర్తయిందట! ఆయన దగ్గరవున్న 'మీటర్ బద్దే' వేరు. దాంతో సామాన్యులు కొలవబడరు. వాళ్ళంతా తాలూ, తరకే! గాలికి ఎగిరిపోయే వారేనని భ్రమపడుతున్నారు.
మోడీ భక్తులు ఏమి భజన చేసినా, ఎంత భజన చేసినా 2008 నుండి 2021 మధ్య మన దేశం దిగువ, మధ్య ఆదాయమున్న దేశంగానే ఉంది. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు (సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్) చేరుకోవడంలో మన దేశంకంటే శ్రీలంక, బంగ్లాదేశ్ మెరుగ్గా ఉన్నాయని కేటీఆర్ అంటే కిషన్‌రెడ్డి ఉలిక్కిపడ్డాడు. ఆ లెక్క తేల్చింది ఐక్యరాజ్యసమితే! రోజూ పత్రికలు తిరగేస్తే ఆటో మొబైల్ రంగం కునారిల్లుతున్నా రూ.3కోట్ల బెంజ్‌కార్లు, రూ.5కోట్ల రోల్స్రార్సు కార్ల గిరాకి తగ్గలేదు. మన హైదరాబాద్‌తో సహా అనేక పట్టణాల్లో అపార్ట్మెంట్లు అమ్ముడుపోకపోయినా రెండుకోట్ల రూపాయల విల్లాలు బ్రహ్మాండంగా అమ్ముడవు తున్నాయి. బీజేపీ నాయకులు అర్థం చేసుకోవాల్సిన విషయమే మంటే ''మీకిచ్చే వారికే మీరిస్తూ'' అదే పాలననుకుంటే చెల్లుబాటు కాదు.