Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నేరాల కోసం రాజకీయాలు.'' ''రాజకీయాల కోసం నేరాలు..'' అన్నట్టుగా మారిపోయాయి దేశ రాజకీయాలు. హత్యాయత్నం కేసులో పదేండ్లు శిక్ష పడటంతో లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ఫైజల్పై తాజాగా అనర్హత వేటుపడింది. ఎన్సీపీకి చెందిన సదరు ఎంపీపై 2009లో కేసు నమోదైతే, పుష్కరకాలం తరువాత శిక్ష పడింది. ముజఫర్నగర్ అల్లర్ల కేసులో యూపీ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీ శాసనసభ్యత్వం కూడా ఇటీవలే రద్దయ్యింది. విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు గాను అదే రాష్ట్రానికి చెందిన ఎస్పీ ఎమ్మెల్యే ఆజంఖాన్, మరో ఇద్దరు బీహార్ ఆర్జేడీ శాసనసభ్యులు కొద్ది నెలల క్రితమే బహిష్కృతులయ్యారు. ఆరేండ్ల కిందటి కేసులో ఝార్ఖండ్ కాంగ్రెస్ నేత మమతాదేవి గత నెలలోనే తన ఎమ్మెల్యే గిరీని వదులుకోవాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా నాయకులుగా చలామణీ అవుతున్న ఇలాంటి నేరగాళ్ళు ఇంకెందరో..!
ప్రస్తుత లోక్సభలో46శాతం మందిపై క్రిమినల్ కేసులుంటే, కేంద్రమంత్రుల్లో 42శాతం మంది నేరగాళ్లే అని ప్రజాస్వామ్య సంస్కరణ సంఘం స్పష్టం చేసింది. ఇందులో 'తిలా పాపం తలా పిడికెడు' అన్నట్టు అన్ని పార్టీల వారున్నా సింహభాగం మాత్రం పాలక బీజేపీదే. హత్య, హత్యాయత్నం, లైంగికదాడులు, అపహరణలు, బలవంతపు వసూళ్ళు, దోపిడీ తదితర తీవ్ర కేసులు ఉన్నవారు కోకొల్లలు. నేరమయ రాజకీయాలే పరమావధిగా మారిన చోట ఆ పార్టీల నుంచి నేరరహిత నేతలను ఆశించడం అత్యాశే అవుతుంది. పైపెచ్చు ఆ చరిత్ర తమకే కాదు ప్రజలకూ ఉండాలని భావిస్తున్నారు! లేదంటే అధికార పార్టీ ఎంపీనే స్వయంగా కత్తులతో దాడులు చేయండని ప్రజలకు పిలుపు నివ్వడమేమిటీ?
నిరుడు సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ తమ పార్లమెంటులో 'చట్టసభల పవిత్రత - ప్రజాస్వామ్య వ్యవస్థ' అనే అంశంపై స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఆ సందర్భంలో ఆయన భారత ఎంపీల నేరచరితల గురించి ప్రస్తావించారు. దానిపై మన నేతాశ్రీలు ఆనాడే భుజాలు తడుముకొన్నారు. ప్రభుత్వ వర్గాలైతే 'లీ' వ్యాఖ్యలపై అధికారికంగానే అభ్యంతరాలు వెలిబుచ్చాయి. ఎవరు అవునన్నా కాదన్నా నేర రాజకీయాల కబంధ హస్తాల్లో భారత ప్రజాస్వామ్యం విలవిల్లాడు తోందన్నది వాస్తవం. ఇలాంటి నేపథ్యంలో నేరస్తులు చట్టసభలలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంలో చేతులెత్తేసిన ఈసీ చివరికి సుప్రీంకోర్టు తలుపు తట్టింది. దీనిపై 2018 సెప్టెంబర్లోనే బలమైన చట్టం చేయాలని పార్లమెంటును న్యాయస్థానం ఆదేశించింది. అయినా కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూనేవుంది. 'నేరాలు రుజువు కాకుండా ఒక వ్యక్తిని చట్టసభలలోకి రానీయకుండా తాము ఆపలేమని దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది పార్లమెంటే'నని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో నిర్ణయాధికారం పార్లమెంటు చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇంకేముంది మినుకుమినుకుమనే ఆశ కూడా అడుగంటి పోయే పరిస్థితి దాపురించింది. అధికారానికి నేరాన్ని ఒక మెట్టుగా భావించే బూర్జువా పార్టీలు నేర, అవినీతి రహితులను ఎందుకు ఎంచుకుంటాయి? తమ ప్రత్యర్థి పార్టీలకి మించిన నేరగాళ్లను బరిలోకి దింపాలనుకుంటాయి తప్ప సచ్ఛీలుర్ని అక్కున చేర్చుకుంటాయనుకుంటే పొరపాటే అవుతుంది. ఒకరికొకరు కూడబలుక్కున్నట్టు, ఒకరితో ఒకరు కుమ్మక్కు అయినట్టు బూర్జువా పార్టీలన్నీ కలిసి నేరరహితుల్ని ఎన్నికల బరిలోకే రాకుండా నియంత్రించేందుకు యత్నిస్తున్నాయి. ఈ స్థితిలో బూర్జువా పార్టీల నుంచి మనం రాజకీయాల్లో నేరప్రక్షాళన చట్టాలను ఊహించగలమా? తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేస్తూ ప్రజల తరపున పోరాడే వారిపై, ముఖ్యంగా కమ్యూనిస్టులపై పాలకులు అత్యంత తీవ్రమైన నిర్బంధాలకు పాల్పడుతున్న వైనాన్ని మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి, నేరచరితుల విషయంలో సుప్రీంకోర్టే గట్టి చట్టాన్ని తీసుకురావాలని ఆశించడం తప్ప పార్లమెంటుపై ఆశలు పెట్టుకునే అవకాశం ఆవగింజంతయినా లేదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు సైతం చేతులెత్తేస్తే భారత ప్రజాస్వామ్యానికి దిక్కెవరు? ప్రజాస్వామ్యాన్ని నేతస్వామ్యంగా మార్చి మేడిపండు చందంగా చేస్తున్న భ్రష్ట రాజకీయాలకు చరమగీతం పాడాలి. చట్టాలు చేసే వారే చట్టానికి అతీతులుగా మారితే, వారిని దారికి తెచ్చే శక్తి ఒక్క ప్రజలకు మాత్రమే ఉంది. కనుక ప్రజలే ఆ దిశగా ఆలోచించాలి.