Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందరూ సర్వే జనాః సుఖినోభవంతు, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని చెప్పేవారే! కానీ అదేమిటో రోజు రోజుకూ అసమానత పెరుగుతూనే ఉంది. అసమానతను తగ్గించాలన్న చిత్తశుద్ది పాలకుల్లో ఉంటే, ఈ అన్యాయాన్ని ప్రతిఘటించాలన్న చైతన్యం జనంలో ఉంటే 2020 తరువాత సృష్టించిన సంపద 42లక్షల కోట్ల డాలర్లలో మూడింట రెండువంతులను ఒక శాతం ధనికులు జేబులో వేసుకొని ఉండగలిగేవారా? స్విడ్జర్లాండ్లోని దావోస్‌లో ప్రపంచ ధనికుల ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా ఆక్స్‌ఫామ్ అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో అసమానతల గురించి వెల్లడించిన అంకెలను సామాన్యులు నమ్మరంటే అతిశయోక్తి కాదు. గతంలో జరిగిన వాటన్నింటినీ మార్చివేస్తానని, జనానికి అచ్చేదిన్ (మంచి రోజులు) అందిస్తానని వాగ్దానం చేసిన నరేంద్రమోడీ ఏలుబడిల ఈ అసమానతలు తగ్గకపోగా మరింతగా పెరగటం ఏమిటని మోడీ అభిమానుల్లో కూడా ఆలోచన తలెత్తుతోంది. కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శనం చేసే ఆర్ఎస్ఎస్ నేతలు కూడా అసమానతల గురించి మాట్లాడు తున్నారంటే నాటకం ఎంత రసవత్తరంగా నడిపిస్తున్నారో అరం చేసుకోవచ్చు. జనాభాలోని ఎగువన ఉన్న ఒకశాతం మంది దేశ రాబడిలో ఐదోవంతు పొందుతుండగా 50శాతం మందికి కేవలం 13శాతమే వస్తోందని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హౌసబలే చెప్పటం జనాన్ని మాయ చేయడం తప్ప మరొకటి కాదు.
గతంలో నెహ్రూ, కాంగ్రెస్ పాలనా కాలంలో జరిగిన అక్రమాలంటూ ఏకరువు పెట్టిన వారు తమ ఏలుబడిలో ఏంచేస్తున్నారో జనానికి చెప్పాలి. తొమ్మిదేండ్లలో అసమానతలను ఎంత తగ్గించారు, ఏ దిశగా దేశాన్ని నడుపుతున్నారో వివరించాలి. కరోనా మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి 2022 నవంబరు వరకు బిలియనీర్ల (వంద కోట్లు అంతకు మించి సంపద ఉన్నవారు) సంపద 121శాతం లేదా రోజుకు రూ.3,608 కోట్లు పెరిగింది. మరోవైపు గత రికార్డులను జీఎస్టీ వసూళ్లు అధిగమిస్తున్నట్లు ప్రభుత్వం ఒక ఘనతగా చెప్పుకుంటున్నది. 2021-22లో వసూలైన మొత్తంలో జనాభాలోని దిగువ 50శాతం మంది పేదలు 64శాతం చెల్లిస్తే, ఎగువున ఉన్న పదిశాతం మంది ధనికుల నుంచి వచ్చింది కేవలం మూడుశాతమే. తాము చెల్లించిన మొత్తాల నుంచే శతకోటీశ్వరులకు సబ్సిడీలు ఇస్తున్నారని ఎందరు పేదలకు తెలుసు?
ప్రపంచంలో గత దశాబ్ది కాలంలో బిలియనీర్లు రెట్టింపయ్యారు. దేశంలోనే ధనికుడైన వ్యక్తి సంపద 2022లో 46శాతం పెరగటం మన దేశం తీరు తెన్నులకు నిదర్శనం. ఇరవై ఒక్క మంది బిలియనీర్ల దగ్గర 70కోట్ల మంది వద్ద ఉన్నదానికంటే ఎక్కువ సంపద ఉంది. 2020లో 102 మందిగా ఉన్న మన శత కోటీశ్వరులు 2022 నాటికి 166కు పెరిగారంటే ప్రపంచం కంటే వేగం ఎక్కువగా ఉంది. దేశంలో వీరి సంఖ్య ఇంతగా పెరగటానికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణం. మోడీ ఏలుబడిలో కార్పొరేట్ పన్ను 30 నుంచి 22శాతానికి తగ్గించారు. కొత్తగా పెట్టే సంస్థలకు 15శాతమే అని చెప్పటంతో అనేక మంది పాతవాటిని మూసివేసి కొత్త సంస్థల పేరుతో లబ్ది పొందుతున్నారు. పన్ను తగ్గింపు, ప్రోత్సాహకాల ద్వారా 2020-21లో ప్రభుత్వం కోల్పోయిన రాబడి లక్షా మూడువేల 285 కోట్లు. 2017-21 సంవత్సరాలలో బిలియనీర్ల నుంచి వసూలు చేయని 20శాతం పన్ను విలువ రూ.1.8లక్షల కోట్లు. ఇక బాంకుల్లో వసూలుగానీ బాకీల పేరుతో పక్కన పెట్టింది పన్నెండులక్షల కోట్లు కాగా, వాటిలో వసూలు చేసింది కేవలం 13శాతమే. అంటే జనం సొమ్ముతో కార్పొరేట్లకు ఎలా లబ్ది కలిగిస్తున్నారో చెప్పనవసరం లేదు.
కొత్తగా సృష్టి అయిన సంపదలో ఒక డాలరు దిగువ 90శాతం మందికి దక్కితే సగటున ఒక్కో బిలియనీర్‌కు 17లక్షల డాలర్లు వెళ్లింది. అత్యంత ధనికుల సంపద రోజుకు 270కోట్ల డాలర్ల వంతున పెరిగింది. ఇలాంటి అంకెలను అసలు ఊహించలేం, బుర్ర తిరగటం ఖాయం. సంపదలు కొద్ది మంది చేతిలో ఇంతగా పోగుపడిన తరువాత వాటిని కాపాడు కొనేందుకు వారు ఎంతకైనా తెగిస్తారు. గతంలో సీపీఐ(ఎం) నేత జ్యోతిబసును కొందరు ప్రధాని పదవికి ప్రతిపాదించినప్పుడు బోంబే క్లబ్ (కార్పొరేట్ పెద్దలు) ససేమిరా అంగీకరించేది లేదని పార్టీలను హెచ్చరించి వత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే. తమకు అనుకూలురైన అవినీతి పరులకు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే నిరంకుశ శక్తులకు, జవాబుదారీ తనం లేని వారికి మద్దతుగా, రాజకీయ సమీకరణలు, కార్మిక సంఘాల విచ్చిన్నం వంటి ప్రమాదకర పోకడలకు తెరతీస్తారని అనేక దేశాల అనుభవం చెబుతున్నది. ముందు సంపదలను సృష్టి కానివ్వండి తరువాత ఊట మాదిరి సమాజంలో అందరికీ సంపదలు దిగుతాయంటూ అరచేతిలో స్వర్గం వంటి భ్రమలను, పొదుపు మంత్రాన్ని పాటించాలన్న సుభాషితాలను తమ చెప్పుచేతల్లో ఉన్న మీడియా ద్వారా జనాలకు చేరవేస్తుంటారు. ప్రతిదానికి పేదలను, పేదరికాన్ని, పోరాటాలను నిందిస్తుంటారు. రానున్న ఐదు సంవత్సరాల్లో పొదుపు పేరుతో ప్రపంచవ్యాపితంగా 7.8లక్షల కోట్ల డాలర్ల మేర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు, ప్రభుత్వ పెట్టుబడులకు కోత పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయని ఆక్స్‌ఫామ్ చేసిన హెచ్చరికను ప్రతివారూ గమనంలోకి తీసుకోవాలి. గ్రామాల్లో కనీస వేతనం పొందుతున్న కార్మికుడు ఒక దుస్తుల కంపెనీలోని ఉన్నతాధికారి పొందుతున్న వేతనాన్ని పొందాలంటే 941సంవత్సరాలు పడుతుందని వేసిన అంచనా మన దేశంలో అసమానతలకు పక్కా నిదర్శనం.