Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత జాతీయోద్యమాన్ని మార్క్సిస్టు దృక్పథంతో అధ్యయనం చేసిన రజనీపామీదత్ 'ఇండియాటుడే' అనే ఉద్గ్రంథం రాస్తే దానిలో పారిశ్రామిక 'విప్లవం' అని రాసిన ప్రతిచోటా దాన్ని (1930 దశకంలో) సెన్సార్ చేశారట ఆనాటి బ్రిటిష్ అధికార్లు. 'విప్లవం' అనే మాట ఎంత భీతావహరగా ఉండిందో ఆనాడు!
నేడు దావోస్ నుండి కేటీఆర్ బృందం మోసుకొస్తున్న వాటిలో ''సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండిస్టియల్ రివల్యూషన్'' అంటే 4వ తరం పారిశ్రామిక 'విప్లవం' కూడా ఉందట. ఈలోగా 'ఇంట్లో'నే మరో పెద్దమనిషి వందేభారత్ రైలు రైల్వేల చరిత్రలో ఒక 'విప్లవం' అని ప్రవచించాడు. మరి ఇవన్నీ విప్లవాలైతే అసలు విప్లవాల సంగతేమిటని అసలైన విప్లవకారులు ఆందోళన పడాల్సిన పనిలేదు.
ఇది ఔట్ సోర్సింగ్ శకం. ఇక్కడ దేన్నయినా ఔట్‌సోర్స్ చేస్తారు. మాటలు కిరాయికి వాడుకుంటారు. మోడీ కరుణా కటాక్ష వీక్షణాల్లో తరించేందుకు, ఆయన సేవ కోసం తపించే బ్యూరోక్రాట్లు అన్ని దిక్కులా వ్యాపిస్తున్నారు. అబద్ధాలను కెలిడియోస్కోప్‌లో పెట్టి చూపే ప్రయత్నంలో నిమగమయ్యారు. వందే భారత్ రైలు నూటికి నూరుశాతం స్వదేశీ టెక్నాలజీతో చేస్తున్నారట లేదా చేశారట! హతోస్మి! నేడు వారు నాటిన నూతన విద్యావిధానం మొక్కయితే, ఇంకా ముదిరి మానైతే ఇది వేదవిజ్ఞానంతో పురుడు పోసుకుందని చెప్పినా ఆశ్చర్యం లేదు. 'ఒరేరు మంకెన్నా! మా ఊరి మిరియాలు తాటికాయంత ఉండేవిరా!' అన్నప్పుడు నమ్మలేదా!?
ఇటీవల టెలిగ్రాఫ్ పత్రిక ప్రచురించిన వార్త చూస్తే మిరియాలు తాటికయంత ఉంటాయని నమ్మినవారు అవాక్కవక తప్పదు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ 1200 ఎలక్ట్రిక్ ఇంజన్లు సప్లయి చేసి, 35ఏండ్ల పాటు సర్వీసింగ్ సేవలు కూడా అందించేందుకు రూ.26వేల కోట్ల ఆర్డర్ పొందిందట! ఆ కంపెనీ చరిత్రలో ఇంత పెద్ద ఆర్డరు రాలేదని ఆనందంగా ఉంది. వందే భారత్ రైళ్ళకు 39వేల చక్రాలు (వీల్స్) సప్లయి చేయడానికి ఒక చైనా కంపెనీ భారీ ఆర్డర్ పొందిందని గూగుల్ తల్లిని అడిగితే చెపుతుంది. ఇక్కడ మరో వింతేంటంటే... బెంగుళూరులోని మన వీల్స్ ఫ్యాక్టరీని పడావుపెట్టి, ముందే ఒక ఉక్రెయిన్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. రష్యాతో ఆదేశం యుద్ధంలో చిక్కుకోవడంతో తయారైన వాటిని కూడా విమానాల్లో తరలిస్తున్నారట! ఇప్పుడు చైనాకి ఆ ఆర్డర్ దక్కింది. ఈ చక్రాలు, రైలింజన్లు ఇంతకాలం మన దేశంలో 11వేల ఇంజన్లు సప్లయి చేసిన చిత్తరంజన్ లోకో మోటివ్ వర్క్స్కివ్వాలని మన''స్వదేశీ'' పరిజ్ఞానులకు తడుతుందని ఎలా ఆశించగలం? ప్రస్తుత రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ సీమెన్స్లో మాజీ వైస్‌ప్రెసిడెంట్, జనరల్ ఎలక్ట్రిక్ ఎం.డి.గా పనిచేశారు. ఈ మాజీ ఐ.ఎ.ఎస్. అధికారి కొద్దిగా ఖాళీ దొరకంగానే బీజేపీలో చేరితే, ఆయన్ని రాజ్యసభలో కొలువుదీర్చి వెంటనే రైల్వే మంత్రిగా వెలిసేలా చేసిన మోడీ ''నాయకత్వ ప్రతిభ''ను ఎంతని పొగడగలం? ఏమని పొగడగలం?
ఇదంతా ఒకెత్తు. వందే భారత్ రైలుకు రూపకర్తగా కొనియాడబడుతున్న పెద్దమనిషి పెరంబూర్‌లోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్) జి.ఎం. ఈ వందే భారత్ పెట్టెలన్నీ అక్కడే రూపొందాయి. ఈ ఐ.సి.ఎఫ్ నెహ్రూ కాలంలో పుట్టింది. ఆ కాలంలోనే ఆవిర్భవించిన చిత్తరంజన్ లోకో మోటివ్ వర్క్స్ ముందు బొగ్గు ఇంజన్లు, ఆ తర్వాత డీజిల్ ఇంజన్లు, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఇంజన్లు ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసుకుంటూ రూపొందించింది. గత 75 ఏండ్లుగా ఇంజన్లు, బోగీలు మనదేశమే తనకు తాను తయారు చేసుకుంది. ఇదీ నిజమైన స్వావలంబన. ఆత్మనిర్భర్ పేర నేడు సీమెన్స్ ఇంజన్లు సప్లయి చేయడమే కాదు, ఏకంగా 35ఏండ్ల పాటు సర్వీసింగ్ కూడా చేస్తారట! అంటే మన వర్కషాపులు కూడా హాంపట్!
ఇదంతా 'విప్లవం' అని కొందరు చెప్పడం, కొందరు రాయడం, ఎందరో చప్పట్లు కొట్టడం! ఈ పెద్దలనేక మంది చెపుతున్నట్లు ఇవి విప్లవాలు కావు. ఆ పేరుతో ఏదో అభివృద్ధి జరిగిపోతున్నట్లు ప్రజల్ని జోకొట్టే సాధనాలు. ప్రజలు శాశ్వతంగా నిద్రావస్థలో ఉండరు. గూడు కట్టుకుని ఉంటే అది సమాధి కాదు. సీతాకోక చిలుకలు రంగురంగుల లోకాల కోసం బయటికొస్తాయి. రెక్కలు తొడిగి ఎగురుతాయి.
''మీది ప్రయివేటీకరణ సర్కార్, మాది నేషనలైజేషన్ ప్రభుత్వం'' అని నిన్న ఖమ్మం సభలో గర్జించిన కేసీఆర్ నిజంగా ఆచరణలో ఆ మార్గంలో అడుగులేస్తే అది 'విప్లవం!' వారి చేతిలో ఉన్న ఆర్టీసీని, విద్యుత్‌ని ప్రయివేటు బాట పట్టకుండా చూస్తే అదే పదివేలు. రాష్ట్రంలో కార్మికులపై, రైతులపై దాడులు చేస్తూ, రియల్ ఎస్టేట్ దందాగాళ్ళకి వెన్నుకాస్తూ ఉంటే ప్రజలు నిజమైన విప్లవకారులెవరో వెతుక్కుంటారు.