Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశమంతటినీ తాను సృష్టించిన అబద్ధాల ఊబిలో ముంచాలని రాజ్యం ప్రయత్నిస్తున్నప్పుడు... ఒక్క సత్యవాక్కు చాలు దాన్ని ఉలికిపాటుకు గురిచేయడానికి. ఓ అంతర్జాతీయ మీడియా వెల్లడించిన కథనం, దానిపై భారత ప్రభుత్వ కదనం చూస్తుంటే ఇప్పుడు అలాంటి ఉలికిపాటే కనిపిస్తోంది. గుజరాత్లో జరిగిన 2002నాటి అల్లర్లపై బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసి) చేసిన ఓ ప్రసారం ఇప్పుడు దుమారం రేపుతోంది. ''ఇండియా ది మోడీ క్వశ్చన్'' పేరుతో ఇది ప్రసారమైంది. దీనిపై భారత ప్రభుత్వం ఎనలేని ఆగ్రహం ప్రదర్శిస్తోంది. బ్రిటిష్ అంతర్గత విచారణ బృందం నివేదిక ఆధారంగా బీబీసీ ఓ డాక్యుమెంటరీ రూపొందిన ఈ డాక్యుమెంటరీ వలసవాద ధోరణికి తార్కాణమని దుయ్యబట్టింది. భారత ప్రధాని మోడీని అపఖ్యాతిపాలు చేయడానికే ఈ ప్రయత్నమని విరుచుకు పడుతోంది. కారణం... ఇది నాటి గుజరాత్ మత మారణహౌమానికి మోడీని దోషిగా చూపుతోంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనాటి ఆయన ప్రభుత్వాన్ని బోనులో నిలుపుతోంది.
నిజానికి దేశ విభజన తరువాత జరిగిన అతిపెద్ద మారణహౌమం ఇది. అత్యంత అమానవీయమైన, భయానకమైన ఈ హింసాకాండకు దేశమే కాదు, ప్రపంచమే విలపించింది. వెయ్యిమందికి పైగా చనిపోయారని గుజరాత్ ప్రభుత్వ అధికారిక నివేదికే చెప్పిందంటే వెలుగు చూడని మరణాలు ఇంకెన్నో..! ఈ ఊచకోతకు కారణాలేమిటో కారకులెవరో అంతా బహిరంగ రహస్యమే. కానీ ఆరని ఆ నెత్తుటి చారికలు నేటికీ తడిగానే కనిపిస్తున్నా ఘనమైన మన దర్యాప్తు సంస్థలకు, న్యాయస్థానాలకు ఆధారలే లభించకపోవడం వైచిత్రి! ఈ ఘోరం జరిగిన దశాబ్దకాలం తరువాత మన ప్రత్యేక విచారణ బృందం(సిట్) సాక్షాధారాలు లేవని మోడీ సహా నిందితులందరికీ క్లీన్ చిట్ ఇచ్చి చేతులు దులుపుకోగా అత్యున్నత న్యాయస్థాం సైతం దానిని ఆమోదించింది.
తిరిగి ఇన్నాళ్ళకు, రెండు దశాబ్దాల తరువాత, నాటి గుజరాత్ ముఖ్యమంత్రి మోడీయే నేటి దేశ ప్రధానిగా కొలువుదీరి ఉన్న సమయాన ఇప్పుడీ బ్రిటిష్ విచారణ బృందం నివేదిక, దాని ఆధారంగా రూపొందిన బీబీసీ డాక్యుమెంటరీ ఆ ఉదంతాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి. మరి మన ఏలినవారి ఉలికిపాటులో మండిపాటులో ఆశ్చర్యమేముంటుంది?! అసలే ఆ ''గుజరాత్ నమూనా''ను నేడు దేశమంతటికీ విస్తరింపజేసే విపరీత పోకడలు ఒకవైపు సాగుతున్నాయి. మరోవైపు వీరి పాలనా నిర్వాకాల మూలంగా ప్రజల వ్యక్తిగత జీవితం అభద్రంగా, సామాజిక జీవితం కల్లోలంగా మారిపోతోంది. ఇలాంటి ఒకానొక రాజకీయ సందర్భంలో ఇది మళ్ళీ చర్చకు రావడం ఏ ఏలికలెవరికైనా ఎలా సహిస్తుందీ?! పైగా ఆ ఘోరకలికి ఆనాటి ముఖ్యమంత్రీ నేటి ప్రధానమంత్రీ మోడీగారే ప్రధాన బాధ్యులని ఈ నివేదిక తేల్చి చెపుతోందాయే. ఇది పక్కా రాజకీయ ప్రేరేపితమనీ, ఆ అరాచక మూకలకు ప్రభుత్వమే అన్ని విధాలా సహకరించిందనీ, ఏంచేసినా పోలీసులు అడ్డుకోరనే ప్రభుత్వ సంకేతాల వల్లే ఈ ఘోర దారుణాలంటూ బ్రిటిష్ విచారణ బృందం నిర్దారించిందని ఈ డాక్యుమెంటరీ ప్రకటించింది.
ఈ డాక్యుమెంటరీలో బ్రిటిష్ మాజీ విదేశాంగ కార్యదర్శి జాక్ స్ట్రా మాట్లాడుతూ... ''ముఖ్యమంత్రి మోడీ ఒకవైపు ఉన్మాదులను ఉసిగొలిపి, మరోవైపు పోలీసుల చేతులు కట్టేశాడ''ని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ దాడులకు వీహెచ్పి, ఆర్ఎస్ఎస్లే ప్రణాళికలేసాయని, పోలీసుల రక్షణతోనే అల్లరి మూకలు చెలరేగిపోయాయని నివేదిక స్పష్టం చేసిందని, ఈ నివేదిక బ్రిటిష్ ప్రభుత్వానికి చేరినప్పటికీ విషయాలేవీ బయటకు రాలేదని కూడా ఈ డాక్యుమెంటరీ పేర్కొంది. ఈ కారణాలతోనే కదా ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వమే కాదు, అమెరికా సైతం మోడీకి వీసా నిరాకరించింది. అలాంటిది అవసరమో అవకాశవాదమో తెలియదుగానీ, నేడు అదే బ్రిటిష్ ప్రధాని ఈ సందర్భంలో మోడీకి మద్దతు తెలుపుతూ దేశమేదైనా ఏలికల నైజమొకటేనని నిరూపిస్తున్నారు! రాజకీయాల్లో నైతికతకూ నిజమైన తాత్వికతకూ స్థానంలేని విపరీతకాలం కదా ఇది! ఇలాంటి విపరీతాలు ఇంకెన్ని చూడాల్సివస్తుందో...!
రాజ్యం దృష్టిలో నిజాన్ని నిర్భయంగా రాసే కలాలన్నీ మారణాయుధాలే. వాటిని వినిపించే గళాలన్నీ రాజద్రోహాలే. అందుకే సత్యం కోసం నినదించేవారెప్పుడూ చీకటి గాలానికి వేలాతున్నట్టే, ఈ బీబీసీ కథనం కూడా తన వెబ్సైట్ నుండి తొలగించబడింది. ఇలాంటి అసమంజసతల పట్ల, అన్యాయాల పట్ల దేశం నిండా వ్యక్తమవుతున్న వేదన బోలెడుంది. దీనిని సంఘటితంగా నిలిపి దిశానిర్దేశం చేయగల ఉద్యమాలు బలపడనంత వరకూ ఈ చీకటి ఇలాగే కొనసాగుతుంది. ఇప్పుడీ చీకట్లను ఛేదించే వెలుతురు పిడికిళ్ళు కావాలి.