Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో, రక్తాశ్రువులు చిందిస్తూ''నే ఉన్నది ఈ దేశపు మహిళ. మానభంగ పర్వంలో మాతృహృదయం నిర్వేదమవుతూనే ఉన్నది. అన్యాయం జరిగిందని గొంతెత్తి అరుస్తున్నా స్పందించని నేలపైన న్యాయం ఊసెత్తటమే అన్యాయమైపోతుంది. దుష్ట సంస్కృతీ వారసత్వం నేటికీ సమాజాన కొనసాగుతూనే ఉన్నది. నాడు 'భారతా'న ఒక్క దుశ్వాసనుడే ఉన్నాడు. నేడు వీధికొక్కడూ కనపడుతున్నాడు. ఆధిపత్య పర్వంలో విహరిస్తున్నారు. 'బేటీ పడావ్ బేటీ బచావ్' నినాదం నేడు జంతర్ మంతర్ నడి వీధిలో అణచివేయబడి హాహాకారాలు చేస్తున్నది. వొదిలే మాటలకు, కదలని హృదయాలకు సాక్షిగా మూగరోదన చేస్తున్నది. స్త్రీలను శక్తులుగా కొలిచే దేశం మనదని గొప్పలు చెప్పుకునే సాంస్కృతిక ప్రచార పటాటోపంలో 'నస్త్రీ స్వాతంత్య్ర మర్వతి' అని నొక్కి వక్కాణిస్తున్న తీరుకు కించిత్ విచారమూ ప్రకటించము. మహిళకూ హృదయముందనీ, మెదడుందనీ, శరీరముందనీ, శక్తి వుందనీ, ఆకాశంలో సగమై ఈ లోకాన్ని ఏలుతుందనీ ఎందరెందరో చెబుతూ వచ్చినా సమానతా భావనకు విలువనిచ్చిందెప్పుడు? ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాల పేరుతో స్త్రీని సొంత ఆస్తిగా, బానిసగా చూస్తూ చెరబట్టే దుష్టత్వానికి అంతమెప్పుడు!
'భారతదేశంలో మహిళలకు ఎక్కడా రక్షణ లేదనుకుంటాను. దేశంలో ఆడపిల్లలు జన్మించకూడదని నేను అనుకుంటాను' అని ప్రపంచ దేశాలలో మన దేశం తలెత్తుకునేలా దేశ పతాకాన్ని ఎగరేసిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగటి ఆవేదన చెందారు అంటే... ఇక సామాన్య మహిళల పరిస్థితి ఎలావుందో అర్థమవుతుంది. ఇంత దుఃఖానికి గురవుతున్న ఆ మల్లయోధురాండ్ల వేదనను ఆలకించటానికి నాయకునికి తీరికేలేకపోయింది. గత మూడు రోజులుగా రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో స్టార్ రెజ్లర్స్ న్యాయం జరగాలంటూ ధర్నా చేశారు. గత కొంత కాలంగా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటు సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని వారు ధర్నా నిర్వహిస్తున్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారుపతకాన్ని సాధించి దేశం గర్వపడేలా చేసిన క్రీడాకారిణిపై ఇంకా అనేక మంది జూనియర్ రెజ్లర్లపై లైంగిక వేధింపులకు, ఆ క్రీడా సమాఖ్య నిర్వాహకులే పాల్పడటం దుర్మార్గమైన విషయం. ఇప్పుడు ఒక్క ఐదుగురు స్టార్ రెజ్లర్లే కాదు, జూనియర్ క్రీడాకారిణులు వీరికి తోడయ్యారు, మిగతా ఆటగాళ్లూ వీరి పోరాటానికి మద్దతు పలుకుతున్నారు. ''ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే కాదు, లైంగిక వేధింపులులకు సంబంధించి మా దగ్గర ఆధారాలున్నాయి'' అని వారంతా చెబుతున్నారు. వెంటనే అధ్యక్షుడిని తొలగించి పాలకవర్గాన్ని రద్దు చేయాలని, చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
భారత క్రీడా వ్యవస్థలో అవినీతి, అక్రమాలు, ఆశ్రిత పక్షపాతం మొదలైన అనేక రుగ్మతలు కొనసాగుతున్న విషయం ఎప్పటినుండో ఉంది. ముఖ్యంగా మహిళా క్రీడాకారిణుల విషయంలో గతంలో ఇలాంటి ఆరోపణలు అనేకం వచ్చాయి. క్రీడాభిరుచి కలిగి వచ్చిన మహిళలు బయటకు చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతుంటారు. ఇప్పుడు ధైర్యంగా కొందరు ముందుకు రావడంతో అనేక మంది గొంతు కలుపుతున్నారు. ఈ రకమైన వేధింపుల వల్లనే మహిళలు క్రీడలకు దూరమవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో రెజ్లింగ్ పోటీ శిక్షణకు అసలు మహిళలే లేకుండా పోయారు. లైంగిక వేధింపులు, చెబితే చంపేస్తామనే బెదిరింపులు, నియంతృత్వ విధానాలు, ఆటగాళ్లకు అన్యాయం చేసే పద్ధతులు... ఇవన్నీ కలిపి మహిళలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సదరు కాషాయ ఎంపీ, ఫెడరేషన్ అధ్యక్షుడు మాత్రం తన పదవిని వదిలేదే లేదని చెబుతున్నాడు. అంతే కాదు, రెజ్లర్లు చేస్తున్న ధర్నాను, సీఏఏకు వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో చేసిన ఆందోళనతో పోల్చి హేళన చేస్తున్నాడు. వాస్తవంగా షహీన్‌బాగ్‌లో చేసింది ఎంత ప్రజాస్వామిక న్యాయపోరాటమో, ఇది కూడా న్యాయబద్ధ పోరాటమే.
కాషాయ దళాలకు మహిళల పట్ల ఎలాంటి చూపున్నదో ఈ సంఘటన తెలియజేస్తుంది. నీతులు, ధర్మాలు వల్లించేవారి నిజస్వరూపమేమిటో కూడా బయటపెడుతుంది. మాట్లాడే మాటలకు, చేతలకూ ఉన్న వ్యత్యాసం అవగతమవుతుంది. అందుకే వేధింపులకు వ్యతిరేకంగా న్యాయం కోసం రెజ్లర్లు చేస్తున్న పోరాటానికి మేమూ మీతో గొంతు కలుపుతామని సంఘీభావం తెలిపిన బృందాకారత్లాగా మన గొంతుకనూ జోడిద్దాము. మల్లయుద్ధ మహిళలకు అండగా నిలుద్దాం.