Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేవుడు పగపడతాడా? అసలు తన 'సృష్టి'పై తానే పగపట్టగలడా? మరి జోషీమఠ్ కుంగిపోవడం భగవత్ సంకల్పమేనని చెప్పిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని ఏ కోవలో జమెయ్యాలి? సృష్టి, స్థితి, లయ కారకులని త్రిమూర్తులకు ''వర్క్ డివిజన్'' ఉంది. స్థితి, లయ కారకులైన విష్ణువుకు, శివుడికి అత్యంత ప్రఖ్యాత ఆలయాలున్న బదిరీనాధ్, కేదార్నాథ్ ఆలయాలను, వాటిని దర్శించేందుకు వచ్చే భక్తకోటినీ ఆ దేవుళ్ళిద్దరూ కల్సి 'లయి'స్తారా? మానవ తప్పిదాలను, 'పాపాల'ను పాపం! ఆనోరులేని దేవుళ్ళపై నెట్టేయడం అన్యాయం కదా!
ఆంగ్లంలో ''హిమాలయన్ బ్లండర్'' అనే నానుడి ఉంది. ప్రస్తుతం హిమాలయ పర్వతాల్లో హిమాలయన్ బ్లండర్ జరుగుతోంది. ఇది ఉత్తరాఖండ్‌లోనే కాదు, అటు హిమాచల్ నుండి సిక్కిం వరకు జరుగుతోంది. ప్రస్తుతం ఆర్టికల్ 370 రద్దు పుణ్యమా అని రేపు కాశ్మీర్‌లోనూ జరుగుతుంది. ఎన్ఆర్ఎస్ఎతో సహా 12 శాస్త్రవేత్తల సంఘాలు జోషీమఠ్ ఉన్న ప్రాంతం 99శాతం భూపాతం (ల్యాండ్ స్లైడ్) ఉండే ప్రాంతమేనని ఏనాడో చెప్పాయి. కాని ఇటీవల ఢిల్లీలో జరిగిన శాస్త్రవేత్తల మీటింగులో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి జోషీమఠ్ వ్యవహారమంతా ''భగవంతుడి లీలే''నని బల్లగుద్ది మరీ వాదించిన సంఘటన మనల్ని అవాక్కయ్యేలా చేస్తుంది. జోషీమఠ్ అంటే మన శంకరమఠం లాంటి భవనం కాదు. 27వేల మంది ప్రజలు నివశించే ఒక పట్టణం. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే బదిరీనాథ్, హేమకుండ్ సాహిబ్ వంటి పుణ్యక్షేత్రాలకు ముఖద్వారం. ప్రపంచ ప్రఖ్యాత మంచు ఆటల కేంద్రం అవులి ఉన్నదక్కడే. ప్రపంచంలోనే అత్యంత పొడవైన 'రోప్‌వే' ఈ పట్టణంపై నుండే పోతుంది. ''ఇది ఒక పట్టణమే కాదు సాంస్కృతిక వారసత్వం'' అని ఆ ప్రాంతాన్ని పరిశీలించిన సీపీఐ(ఎం), సిఐటియు బృందం చెప్పింది అక్షర సత్యం. మానవ తప్పిదం వల్లా, ఆశ్రిత పెట్టుబడిదార్ల లాభాపేక్ష వల్లా నేడీ పట్టణం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే సగం పట్టణం నివాసయోగ్యం కాకుండా పోయింది. సునీతా నారాయణ్ రాసినట్లు ''అదొక మానవ విషాదం.మనిషి స్వయం కృతం.''
1976లోనే ఘర్వాల్ కమిషనర్ ఎమ్.సి.మిశ్రా కమిషన్ ''ఇదొక మునిగిపోయే పట్టణమని, ఇక్కడ ఏ నిర్మాణాలు చేపట్టవద్దని'' నివేదిక ఇచ్చింది. ఏ ప్రభుత్వమూ దాన్ని ఖాతరు చేయలేదు. ప్రత్యేకంగా 2014 తర్వాత భారీ హౌటళ్ల నిర్మాణం సాగిపోతోంది. స్థానికులు అడ్డుపడుతున్నా తపోవన్ - విష్ణుగాడ్ 520 మె.వా. హైడల్ స్టేషన్ నిర్మాణం సాగుతోంది. ఎన్టిపిసి వారి ఈ ప్రాజెక్టు జోషిమఠ్ క్రిందికే తవ్వేశారు. నాలుగు పుణ్యక్షేత్రాలను కలిపే 'చార్ధామ్' ప్రాజెక్టును 'ఉభయ తారకం'గా ఉండేలా 2016లో మోడీ సర్కార్ ప్రారంభించింది. రూ.12వేల కోట్ల ఈ ప్రాజెక్టుని చిన్న చిన్న ముక్కలుగా చేసి పర్యావరణ అనుమతులు గోల తప్పించేసింది. ఎక్కడికక్కడ 'అస్మదీయుల' హౌటళ్ళు వెలుస్తున్నాయి. నాలుగు లైన్ల రోడ్ నిరాఘాటంగా నిర్మాణం సాగిపోతోంది. అదీ జోషీమఠ్ అంచునే పెద్ద పెద్ద బ్లాస్టింగులు జరగడంతో ఆ పట్టణానికి ప్రమాదం ముంచుకొచ్చింది.
బహుశా ఉత్తరాఖండ్ పెట్టుబడి లాభాపేక్షకి, అశ్రిత పెట్టుబడిదారీ విధానానికి బ్రహ్మాండమైన ఉదాహరణ. వంద డ్యామ్‌లు, 450 జలవిద్యుత్ ప్రాజెక్టులకు ప్లాన్ చేసినట్టు ఒక నివేదిక తెల్పుతోంది. ఈ నిర్మాణంలో వచ్చేరాళ్ళు, రప్పల్ని, అన్ని రూల్స్‌కి భిన్నంగా నదుల్లోనే వేయడంతో, దాన్ని పాలకులు పట్టించుకోకపోవడంతో ఉపద్రవాలు ముంచుకొస్తున్నాయి. భూపాతం వల్ల 1894లో భీకర వరదలు రాగా, ఇష్టాను సారం అడవుల నరికివేత వల్ల 1970లో వరదలొచ్చాయి. 2013లో కేదర్నాథ్ పెను ముప్పు, 2021లో తపోవన్ - రైనీ ప్రమాదంలో 200 మంది కార్మికులు జలసమాధి అయినా బుద్ధిరాని పాలకులు పెట్టుబడి లాభాపేక్ష కోసం ఈ ప్రాజెక్టులకు తెరతీశారు. పెద్ద ఎత్తున జల విద్యుదుత్పత్తి జరిగే ఉత్తరాఖాండ్ వాసులు సైతం మనలాగే అధిక విద్యుత్ చార్జీలు చెల్లించాల్సి రావడం విరోధా భాసకు పరాకాష్ట!
ఇంత జరుగుతున్నా మీడియా ముందు నోరిప్పరాదని మొన్ననే శాస్త్రవేత్తలను, ఇస్రో వంటి సంస్థలను శాసించింది మోడీ సర్కార్. 2020, 21లో కరోనా కాలంలోనూ ఈ విధంగా శాస్త్రవేత్తల నోరు నొక్కేసరికి పుక్కటి పురాణాలు యధేచ్చగా ప్రచారమైనాయి. స్థానికులు పోరాడుతూనే ఉన్నారు. అవి దేశానికి తెలియ చేయాల్సిన మీడియా కార్పొరేట్ల చేతిలో, పైగా అంబానీ, అదానీ చేతిలో బందీగా ఉంది.
సుప్రీం కోర్టు దీన్ని పరిగణనలోకి తీసుకుని ఒక కమిటీని నియమించింది. ఈ ప్రాజెక్టులు, నిర్మాణాలు తక్షణం ఆపాలంది. ఆ తర్వాత మరో కమిటీని నియమించింది. అది మొదటి కమిటీనే బలపరిచింది. ఆ తర్వాత మరో కమిటీ వేశారు. సదరు కమిటీ పైనివేదికల్ని తిరగేసింది. ప్రకృతి విధ్వంసాన్ని పెట్టుబడి లాభాల కోసం అనుమతించే పాలకులున్నంత కాలం దేవాలయాలు మూసెయ్యాల్సిందే! (2013లో కేదర్నాథ్ లాగా) భక్తుల ప్రాణాలకూ రక్షణ ఉండదు. చార్ధామ్ పేరుమీద మోడీ సర్కార్‌కు ఓట్లు రావచ్చేమోగాని, పర్యావరణం సర్వనాశనం అవు తుంది. గ్లాస్గో (కాప్-26)లో ప్రగల్భాలు మర్చిపోవద్దు మోడీ ప్రభుత్వమా!