Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఇండియా: ద మోడీ క్వశ్చన్'' -ఈ నెల 17న ప్రసారమైన ఈ డాక్యుమెంటరీ మొదటి భాగం దేశంలో ప్రకంపనలు సృష్టించింది. అవి ఇంకా కొనసాగుతుండగానే ఈనెల 24న రెండవ భాగమూ ప్రసారమైంది. ఇది మరింత అలజడి రేకెత్తిస్తోంది. ప్రత్యేకించి ఈ బీబీసీ ప్రొడక్ట్ బీజేపీని తీవ్రమైన కలవరానికి గురిచేస్తున్నట్టుంది. అందుకే ఈ డాక్యుమెంటరీనీ తొలగించాలని ఒకవైపు సామాజిక మాధ్యమాలకు ఆంక్షలు విధిస్తూనే, మరోవైపు వీక్షకులపై నిర్బంధాలకు పూనుకుంటోంది. ప్రఖ్యాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, మన హైద్రాబాద్ సెంట్రల్ యునివర్సిటీతో సహా దేశంలో పలు యూనివర్సిటీల్లో పోలీసులు ఈ ప్రదర్శనలను నిలిపేయడంతో పాటు, విద్యార్థులపై అసాంఘిక శక్తులు దాడులకూ తెగబడుతుండటం ఇందుకు నిదర్శనం.
ఇంతకీ ఈ బీబీసీ డాక్యుమెంటరీ ఏం చెప్పిందీ? బీజేపీ ప్రభుత్వమూ, పార్టీ ఎందుకింత బెంబేలెత్తుతున్నాయీ? ఒకసారి పరిశీలించాలి. ''గుజరాత్ మారణకాండ రాజకీయ ప్రేరేపితమైనది. ప్రభుత్వ రక్షణలోనే విహెచ్పీ ఈ ఊచకోతకు నాయకత్వం వహించింది. వెల్లడైనదానికంటే ఎక్కువ హింస చెలరేగింది. దాదాపు రెండువేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, లక్షా ముప్పదిఎనిమిది వేల మంది నిరాశ్రయులయ్యారు. ఓ పథకం ప్రకారం జరిగిన ఈ హింసలో నిర్దిష్ట జాతి నిర్మూలనా లక్షణాలన్నీ ఉన్నాయి. శిక్షలేమీ ఉండవనే ప్రభుత్వ హామీ లేకుండా విహెచ్పీ ఇంత అరాచకానికి వొడిగట్టేది కాదు. దీనికి నేరుగా నాటి ముఖ్యమంత్రి నరేంద్రమోడీయే బాధ్యుడు.'' -స్థూలంగా భారత్లోని బ్రిటిష్ రాయబార కార్యాలయం నివేదిక సారాంశమిది. ఈ నివేదిక ఆధారంగానే బీబీసీ డాక్యుమెంటరీ రూపొందింది.
సాధారణంగా ఏ దేశంలోనైనా ఇలాంటి అవాంఛనీయమైన దారుణ ఉదంతాలు జరిగినప్పుడు, ఆ దేశంలో ఉన్న విదేశీ రాయబార కార్యాలయాలన్నీ ఆ సమాచారంతో తమ తమ దేశాలకు నివేదికలు అందిస్తాయి. అలా మన దేశంలోని బ్రిటిష్ రాయబార కార్యాలయం అందించిన నివేదికలోని అంశాలనే ఈ బీబీసీ డాక్యుమెంటరీ రూపంలో ప్రసారం చేసింది. బీబీసీ చెప్పింది అసత్యమైతే బీజేపీ ఖండించవచ్చు. తాము చెప్పదలచుకున్న సత్యమేదో వెల్లడించవచ్చు. అలా చేయకుండా ఇలా విపరీత పోకడలకు పోవడమేమిటి? దర్యాప్తు సంస్థలేవీ ఆధారాలు చూపలేకపోయాయనీ, సుప్రీం కోర్టు సైతం తమకు క్లీన్చిట్ ఇచ్చిందనీ చెప్పుకునేవారు ఇంతగా బెంబేలెత్తిపోవడ మేమిటి? అంటే బీబీసీ చెప్పిందే నిజమా? అందుకే ఆత్మరక్షణలో పడిపోయారా? కాదంటే బీజేపీ ఈ చర్యలకు అర్థమేమిటి?
ఇదంతా ప్రధాని మోడీని అప్రతిష్టపాలు చేసే కుతంత్రమనీ, ఈ కథనం బ్రిటిషు వలసవాద దృక్పథాన్నే ప్రతిబింబిస్తోందనీ ప్రభుత్వంతో సహా పాలకనేతలంతా ఆరోపిస్తున్నారు. తప్పులేదు. తమ అభిప్రాయాన్ని చెప్పుకునే హక్కు, తమ వాదన వినిపించే అవకాశం వారికెప్పుడూ ఉంటుంది. కానీ సోషల్ మీడియాపై ఈ ఆంక్షలెందుకు? విశ్వవిద్యాలయాల మీద, వీక్షిస్తున్న విద్యార్థుల మీద ఈ ఆగడాలెందుకు? అయినా బీబీసీ చెప్పినంత మాత్రానికే వీరేమీ దోషులైపోరు. అలాగే న్యాయస్థానాలు తేల్చలేకపోయినంత మాత్రాన నిర్దోషులూ కారు. అసలు నిజాలను ప్రజలు తమ అనుభవం నుండి తేల్చుకుంటారు. ఎవరేమి చెప్పినా గుజరాత్ నెత్తుటి గాయాలు ఓ కాదనలేని సత్యం. అవి ఇంకా ప్రజల మది నుండి చెదిరిపోలేదు. ''ముఖ్యమంత్రిగా మోడీ రాజధర్మం పాటించలేదు'' అన్న నాటి ప్రధాని వాజ్పాయి మాటలు ఈ దేశమేమీ మరిచిపోలేదు. బిల్కిస్ బానోపై క్రూరమైన అత్యాచారం చేసి, అమె కుటుంబాన్ని కిరాతకంగా నరికి చంపిన నేరస్థులేమో విడుదలై వీధుల్లో తిరుగుతున్నారు..! ఆ కిరాతకాలకు ప్రత్యక్ష సాక్షిగా సత్యం కోసం నిలబడినందుకు ఐపీఎస్ ఆఫీసర్ సంజయ్భట్ మాత్రం యావజ్జీవ ఖైదీగా చెరసాల పాలయ్యారు. ఇవన్నీ ప్రజల గమనంలో లేవనుకుంటే పొరపాటు. కాబట్టి, ఈ రోజు కాకపోతే రేపైనా దోషులెవరో వారే తేలుస్తారు.
కానీ, మాట్లాడితే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ గురించి, నాడు ప్రచార మాధ్యమాలపై, పౌరస్వేచ్ఛపై సాగిన నిర్బంధ విధానాల గురించీ విమర్శించే ప్రధాని నేడు తాను చేస్తున్నదేమిటి? నేడు పౌరసమాజంలో, సోషల్మీడియాలో ఈ బీబీసీ కథనంపై, బీజేపీ తీరుపై ఇంత చర్చ జరుగుతున్నా మన ప్రధాన స్రవంతి మీడియా నోళ్లు పెగలడం లేదెందుకు? ఈ సందర్భంలో నాటి ఎమర్జెన్సీ పరిస్థితులపై విచారణ జరిపిన జస్టిస్ షా చేసిన వ్యాఖ్య ఒకటి గుర్తుకు రాక మానదు. ''ఇందిరాగాంధీ పత్రికల వారిని కాస్త వంగండి అని అడిగారు. కానీ వారు ఏకంగా ఆమెకు సాగిలబడ్డారు'' అన్నారాయన. ఇప్పుడూ అదే జరుగుతోం దంటున్నారు ప్రఖ్యాత పాత్రికేయులు పాలగుమ్మి సాయినాథ్. ''మన దేశంలో పత్రికలు, ప్రసార మాధ్యమాల పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఎప్పుడూ లేదని'' విచారం వ్యక్తం చేస్తున్నారాయన. అంతెందుకు 2013లో మోడీ చేసిన ఓ ట్వీట్ కూడా ఇప్పుడు ప్రస్తావనకొస్తోంది. కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్న ఉద్దేశంతో... ''ఇంకా ఆకాశవాణీలు, దూరదర్శన్లు ఎందుకు? అందరూ బీబీసీ వైపు చూస్తున్నారు'' అన్నారాయన. ఇప్పుడేమో అదే బీబీసీపై విరుచుకుపడుతున్నారు? ఈ తతంగమంతా చూస్తూ కూడా ''వీరు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆధారాలను పాతరేసినందున దోషులుగా చిక్కకుండా తప్పించుకున్నారే తప్ప, నేరం చేయనందున కాదు'' అనే అభిప్రాయాలను ఎలా కొట్టిపారేయగలం..!